ఇల్లు వదిలి వెళ్లిపోయి.. ఉగ్రవాదులయ్యారు! | they ran away from homes, turn terror suspects in two months | Sakshi
Sakshi News home page

ఇల్లు వదిలి వెళ్లిపోయి.. ఉగ్రవాదులయ్యారు!

Published Thu, Mar 9 2017 11:18 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

ఇల్లు వదిలి వెళ్లిపోయి.. ఉగ్రవాదులయ్యారు!

ఇల్లు వదిలి వెళ్లిపోయి.. ఉగ్రవాదులయ్యారు!

మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడుతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఆ కేసుకు సంబంధించి సైఫుల్లా అనే వ్యక్తిని లక్నోలో పోలీసులు సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అతడి బంధువులు, స్నేహితులలో ముగ్గురిని అరెస్టు చేశారు. వీళ్లందరికీ ఒకే రకమైన నేపథ్యం ఉంది. అందరూ తల్లిదండ్రుల మీద కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయినవాళ్లే. తాము పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామని తమవాళ్లను మభ్యపెట్టినవాళ్లే. వీళ్లంతా కలిసి ఉగ్రవాదం బాట పట్టారు. ఉగ్రవాద సంస్థల పంచన చేరి.. దేశద్రోహానికి ఒడిగట్టారు. అందుకే ఎన్‌కౌంటర్‌లో మరణించిన సైఫుల్లా మృతదేహాన్ని తీసుకోడానికి అతడి తండ్రి సర్తాజ్ ఖాన్ నిరాకరించారు. దేశానికి వ్యతిరేకంగా ఉన్నవాడిని ఈ దేశపు మట్టిలో ఎలా కలుపుతానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి ముఖం చూడటం కూడా తనకు ఇష్టం లేదంటూ వెళ్లిపోయారు.

బీకాం చదివిన సైఫుల్లా.. రెండున్నర నెలల క్రితం తండ్రి మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎప్పుడూ వాట్సప్ చూసుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని ఆయన తిట్టడమే అందుకు కారణం. దుబాయ్‌ వెళ్లి అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని, అందుకోసం వీసా సంపాదించేందుకు ఢిల్లీ వెళ్తున్నానని సైఫుల్లా చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి అతడి స్నేహితుడు ఆతిఫ్ ముజఫర్ కూడా తాను ఢిల్లీ వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుంటానంటూ తన తల్లి మీద ఒత్తిడి తెస్తున్నాడు. అతడికి తండ్రి లేరు. అతడిని పంపడానికి తల్లికి ఇష్టం లేదు. అన్నతో కలిసి డెయిరీ వ్యాపారం చూసుకొమ్మని తాను చెప్పానని, కానీ అతడు తన మాట వినకపోగా, తనకు చెప్పకుండా వెళ్లిపోయాడని ఆమె వాపోయారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి వెళ్లింది ఢిల్లీ కాదు.. కాన్పూర్! అక్కడ ఉగ్రవాద సంస్థలతో వీరికి పరిచయం ఏర్పడింది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సైఫుల్లా తెల్లవారుజామునే ఇంట్లోంచి వెళ్లిపోయి అర్ధరాత్రి వచ్చేవాడని, ఇంట్లో ఉన్నా సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ చూసుకుంటూ కూర్చునేవాడని సర్తాజ్ ఖాన్ చెప్పారు. అతడి గాడ్జెట్లను ఎవరైనా ముట్టుకున్నా విపరీతమైన కోపం వచ్చేదని.. పిల్లలను కూడా ముట్టుకోనిచ్చేవాడు కాడని అన్నారు. తనకు మంచి ఉద్యోగం దొరికిందని.. కుటుంబంలో ఎవరూ ఎప్పుడూ ఊహించలేనంత పెద్ద మొత్తం సంపాదిస్తానని ఆ తర్వాత తన అన్నతో సైఫుల్లా చెప్పాడు.

సైఫుల్లాకు ఉన్న మరో స్నేహితుడు ఆతిఫ్, అతడి బంధువు డానిష్ తరచు గంగానది ఒడ్డున కలుస్తుండేవారు. వీళ్లందరికీ టీ అంటే ఇష్టం. అక్కడే కూర్చుని పలు కప్పులు తాగేవారు. కానీ టీ తాగేటప్పుడు కూడా ఫోన్లలో వీడియోలు చూస్తూనే ఉండేవారు తప్ప తనవైపు కూడా చూసేవారు కారని అక్కడి టీ దుకాణం యజమాని అన్నారు. వీళ్లలో ఆతిఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో డిప్లొమా చదివేవాడు. 2013లో తండ్రి చనిపోవడంతో చదువు మానేశాడు.

అతడిని ఎవరైనా ఏమైనా అడిగితే ఇట్టే కోపం వచ్చేసేదని అతడి సోదరుడు తెలిపారు. గత రెండు నెలల్లో ఆతిఫ్ తన తల్లికి ఫోన్ చేసినా, ఆమె మాట్లాడేవారు కారు. చిట్టచివరిసారిగా తన అక్కకు ఫోన్ చేసి, ముంబైలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడని, ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేయలేదని అతడి తల్లి తెలిపారు. సుమారు పది నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా ఆతిఫ్ సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లాడని అంటున్నారు. అందుకోసం కుటుంబానికి చెందిన భూమిని 22 లక్షల రూపాయలకు అతడు అమ్మేశాడు. ఆతిఫ్‌, డానిష్‌లతో పాటు అలీగఢ్ యూనివర్సిటీకి చెందిన వాళ్ల స్నేహితుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement