సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఓ వైపు డేటా చోరీ ఆరోపణలు.. మరోవైపు సొంత పార్టీలో విభేదాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దంటూ అసంతృప్త నేతలు ఆందోళనకు దిగుతుండటంతో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఇందుకోసం అమరావతిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా నేతలు తమ అసంతృప్తిని చంద్రబాబు వద్ద గట్టిగానే వినిపిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా పాయకరావుపేట, అనంతపురంలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు తిరుగుబావుట ఎగరవేశారు.
అనితను ఓడిస్తామని హెచ్చరిక..
పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో అసమ్మతి నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అనిత అవినీతిపై నియోజకవర్గం నేతలు రెండు పేజీల లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను వారు చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనిత పాదయాత్రను అడ్డుకున్న నేతలు.. ఆమెకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అనితకు ఎమ్మెల్యే సీటు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. పాయకరావుపేట టీడీపీ సమీక్షా సమావేశంలో అనిత అవినీతిపై నిలదీయడానికి అసంతృప్త నేతలు సిద్దమవుతున్నారు.
టీడీపీకి రాజీనామా యోచనలో మాజీ ఎంపీ..
సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంపురం ఎమ్మెల్యే టికెట్ తిరిగి ప్రభాకర్ చౌదరికి ఖరారు చేయడంతో స్థానిక టీడీపీ అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ ఎంపీ సైఫుల్లా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమరావతి నుంచి అనంతపురం బయలుదేరిన సైఫుల్లా వర్గం నేతలు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. సైఫుల్లాతో పాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ నూరమ్ మహ్మద్, పార్టీ సీనియర్ నాయకులు జయరాం నాయుడు, జకీవుల్లా, లక్ష్మీపతి, 15 మంది కార్పొరేటర్లు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment