ప్రభాకర్‌ చౌదరిపై తిరుగుబాటు | MLA Prabhakar Chowdary Versus Former MP Saifulla | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిపై తిరుగుబాటు

Published Fri, Mar 30 2018 10:16 AM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM

MLA Prabhakar Chowdary Versus Former MP Saifulla - Sakshi

ప్రభాకర్‌ చౌదరి, జకీవుల్లా (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నియోజకవర్గంలోని అధికార పార్టీలో మరోసారి చిచ్చు రేగింది. పార్టీ ఆవిర్భావం రోజు ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిపై మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా వర్గీయులు తిరుగుబాటు బావుట ఎగరేశారు. సైఫుల్లా నివాసంలో ఆయన తనయుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జకీవుల్లా నేతృత్వంలో సమావేశమయ్యారు. సమావేశానికి పార్టీ నేతలు జయరాంనాయుడు, లక్ష్మీపతి, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైవుద్దీన్, కార్పొరేటర్లు ఉమామహేశ్వర్, లాలెప్పతో పాటు మరికొందరు కార్పొరేటర్లకు సంబంధించిన కుటుంబసభ్యులు, కోఆప్షన్‌ సభ్యులు మున్వర్, కృష్ణ కుమార్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. వీరంతా ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో శ్రమించిన కార్యకర్తలకు నాలుగేళ్ల అధికారంలో ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ‘పార్టీ కోసం శ్రమించిన వారిని పార్టీ చూసుకుంటుందని, తన కోసం పాటు పడినవారిని తాను చూసుకుంటాన’ని వ్యాఖ్యానిస్తున్నారని, దీన్నిబట్టి చూస్తే కార్యకర్తల సంక్షేమంపై ఎమ్మెల్యేకు ఏమేరకు చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని జయరాంనాయుడు ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ కార్యకర్తలను హత్య చేసిన వారికి పదవులు కట్టబెట్టారని టౌన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జేఎల్‌ మురళీని ఉద్దేశించి మాట్లాడారు. ఏ రోజూ టీడీపీ జెండా మోయని గంపన్నకు డిప్యూటీ మేయర్‌ పదవి కట్టబెట్టారన్నారు. ఎమ్మెల్యే తీరుతో మరో 20 ఏళ్లు పార్టీ గెలిచే పరిస్థితి లేదని అంతా అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లి, తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ఆలోచిద్దామని జకీవుల్లా తెలిపినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement