అనంతపురం న్యూసిటీ: టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరంలో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశామనీ, అందువల్లే ‘అనంత‘ అభివృద్ధికే చిరునామాగా మారిందని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గొప్పలు చెబుతున్నారు. అంతేకాదు..ఇటీవలే అట్టహాసంగా ఓ కార్యక్రమం నిర్వహించి శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. కానీ ఆ స్థాయిలో నిధులు వెచ్చించింటే నగరం ఇంకా ఇలాగే ఉందేమిటబ్బా..అని జనం చర్చించుకుంటున్నారు. తాగునీరు లేక.. చెత్తతరలించక.. సంక్షేమ పథకాలు వర్తించక నగరజీవి అల్లాడిపోతున్నాడు. రోడ్డెక్కితే ట్రాఫిక్ సమస్య..రోగమొచ్చి ఆస్పత్రికి వెళ్తే సకాలంలో వైద్యం అందక సతమతమవుతున్నాడు.
అనుచరుల దందా..!
ప్రజలకు జవాబుదారీతనంగా,నీతి, నిజాయతీగా, భావితరాలకు ఆదర్శంగా తాము ఉంటున్నామని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గొప్పలు చెబుతుండగా.. ఆయన అనుచరులు మాత్రం అందినకాడికి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడుగా పేరున్న కాపు ఫెడరేషన్ డైరెక్టర్ రాయల్ మురళీ.. తపోవనం సమీపంలోని 16 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి.. తన తల్లి పేరు మీద మార్చుకుని నిర్మాణం చేపడుతున్నాడు. దొంగ పట్టాలు సృష్టించారని తహసీల్దార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించరని అధికార పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తున్న మాట వాస్తవం కాదా..? కమిషనర్లపై దాడులకు పాల్పడిన సంఘనలు నిజం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
టెం‘ఢర్’ : నగరంలో అభివృద్ధి పనులు చేయాలంటే కాంట్రాక్టర్లకు టెం‘ఢర్’ భయం పట్టుకుంది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులకు సంబంధించి రూ. 30 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. కానీ పనులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. మొత్తం 160 అభివృద్ధి పనుల్లో 90 పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
పైప్‌లైన్ పనులు అస్తవ్యస్తం : ఏపీఎండీపీ పైప్‌లైన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పక్కా ప్రణాళికతో పనులు చేయకపోతే భవిష్యత్ తరాలకు నీరు సక్రమంగా అందే పరిస్థితి ఉండదని నగరపాలక సంస్థ వర్గాలంటున్నాయి. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పైప్‌లైన్ కనెక్షన్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మురుగు కాల్వలను ఆనుకుని నీటి పైప్‌లైన్ కనెక్షన్స్ వేస్తుండడంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పైప్‌లైన్ పనులకు అధికార పార్టీ నేతలు డబ్బులు తీసుకున్నారని ‘జన్మభూమి– మా ఊరు’ సభలో టీడీపీ నేత జయరాం నాయుడే విమర్శించారు.
ప్రజారోగ్యం గాలికి : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రి అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. సిబ్బంది కొరతతో వైద్యం అందక రోగులు అల్లాడిపోతున్నారు. 124 జీఓ అమలైతే 649 పోస్టులు మంజూరు అవుతాయని తెలిసీ.. స్పందించిన దాఖలాలు లేవు. ఇక ఆస్పత్రిలో ప్రతి పనికీ డబ్బులు చెల్లించాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. మందుల కొరత పట్టిపీడిస్తోంది. పారిశుద్ధ్యానికి ప్రతి నెలా రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నా... పారిశుద్ధ్యం మెరుగుపర్చడం లేదు. దీనిపై ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు స్పందిస్తే ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందుతాయని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.
పెన్షన్ పరేషాన్ : టీడీపీ అధికారంలోకి రాగానే వేల మంది పింఛన్లు తొలగించిన నేతలు.. ఇప్పుడు వారందరినీ ఇళ్లవద్దకు తిప్పుకుంటున్నారు. ఈ నాలుగేళ్లలో నాలుగువేల పింఛన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే చెబుతున్నా..ఇంకా మరో 7 వేల మంది లబ్ధిదారులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే నివాసంలోని కంప్యూటర్‌లో నమోదు చేస్తేనే పింఛన్ వస్తుందని జనం చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment