ముగిసిన లక్నో ఎన్‌కౌంటర్
12 గంటల పాటు ఉగ్రవాదితో పోరు
సైఫుల్లా అనే ఉగ్రవాది హతం
మైక్రోట్యూబ్ కెమెరాలతో పరిశీలన
లక్నో:
ఇరాక్, సిరియా దేశాల్లో చావుదెబ్బ తిన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వేరే దేశాల వైపు చూస్తోందా? ఉగ్రవాద చర్యలకు తరచు టార్గెట్ అవుతున్న భారతదేశం దానికి ఇప్పుడు స్థావరం కాబోతోందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఐఎస్ చెరలో ఉండి, ఇటీవలే దాని బారి నుంచి బయటపడిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన డాక్టర్ కొసనం రామ్మూర్తి కూడా ఇదే విషయం చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థ భారతదేశాన్ని తన తదుపరి టార్గెట్‌గా చేసుకోవాలనుకుంటోందని ఆయన తెలిపారు. తాను వాళ్ల చెరలో ఉన్నప్పుడు వాళ్ల మాటలను బట్టి ఆ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. ఇప్పుడు తాజాగా లక్నోలో జరిగిన ఘటన చూస్తే.. ఇస్లామిక్ స్టేట్ సంస్థ నెమ్మదిగా ఇక్కడ అడుగు మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు సంభవించింది. ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కలాపీపల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పేలుడులో గన్‌పౌడర్ కనిపించిందని, దాన్నిబట్టి చూస్తే ఇది ఉగ్రవాద చర్య కావచ్చని ప్రాథమికంగా పోలీసు అధికారులు అంచనాకు వచ్చారు.
ఆ తర్వాత దానికి సంబంధం లేకుండా ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇద్దరు ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బృందం రంగంలోకి దిగింది. చాలాసేపు ఎదురు కాల్పులు జరిగిన తర్వాత.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అవతలి నుంచి కాల్పులు ఆగిపోయాయి. అప్పటికే స్మోక్ బాంబులు, టియర్ గ్యాస్.. ఇలా చాలా ప్రయోగాలు చేశారు. చివరకు లోపలకు వెళ్లి చూస్తే.. ఒక్క ఉగ్రవాది మృతదేహం కనిపించింది. అతడి దగ్గర ఒక పిస్టల్, ఒక రివాల్వర్, కత్తి.. ఇలాంటి ఆయుధాలు దొరికాయి. మరణించిన ఉగ్రవాది పేరు సైఫుల్లా అని.. అతడికి ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుడుతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ముందుగా తాము మైక్రోట్యూబ్ కెమెరాలు ఉపయోగించామని, దాన్ని బట్టి చూస్తే చీకట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు అనిపించిందని ఏటీఎస్ సీనియర్ అధికారి అసీమ్ అరుణ్ చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మొదలైన ఆపరేషన్.. దాదాపు 12 గంటల పాటు కొనసాగి, తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ముగిసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రభావంతోనే సైఫుల్లా పనిచేశాడని, ఐసిస్ ఖురసాన్ మాడ్యూల్‌కు చెందివాడని యూపీ పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి అత్యంత కీలకమైన చిట్టచివరి దశ పోలింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు వరకు ఈ ఎన్‌కౌంటర్ మొత్తం కొనసాగడం విశేషం.