సిరియాలో ఏం జరుగుతోంది?
ఓ పక్క అంతర్యుద్ధం, మరో పక్క ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదుల ఆగడాలు, అన్నిటికీ మించి దాదాపు 17 ఏళ్లుగా బాత్‌పార్టీ నేత బషారల్ అసద్ నియంతృత్వ పాలనలో మగ్గుతున్న సిరియాలో సంక్షోభం గురువారం అమెరికా విమాన దాడులతో మరింత తీవ్రమయింది. ఇద్లీబ్ పట్టణంపై మంగళవారం జరిగిన సారిన్ విషవాయువు దాడికి తీవ్రంగా స్పందిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలపై అమెరికా సేనలు తొలిసారి సిరియాపై ప్రత్యక్ష దాడిచేశాయి.
అసద్ దళాలు రసాయన దాడి చేయడానికి ఉపయోగించాయని భావిస్తున్న వైమానిక స్థావరంపై 59 అమెరికా క్షిపణుల వర్షం కురిపించాయి. విషవాయువు దాడి ఎవరు చేశారో దర్యాప్తు జరిపించాలని రష్యా ఐరాసలో ప్రయత్నం చేస్తుండగానే, అమెరికా ఎప్పటిలా అసద్‌నే దోషిగా చేసి దాడులు జరిపించింది. తిరుగుబాటుదారులే సారిన్ వాయువును జనంపై ప్రయోగించి, అసద్ సర్కారుకు ఆ పాపం అంటేలా చేశారని రష్యా భావిస్తోంది.
ఎందుకీ అంతర్గత పోరు?
2010 చివర్లో ఈజిప్ట్ సహా అరబ్ దేశాల్లో నియంతల పాలనపై ఆరబ్ స్ప్రింగ్ పేరిట ఆరంభమైన తిరుగుబాట్లు సిరియాలోనూ ప్రజలను అసద్ సర్కారుపై పోరాటానికి పురికొల్పాయి. 2011 మార్చిలో దేరా పట్టణంలో మొదలైన ఘర్షణలు 2012 నాటికి ప్రాచీన నగరం అలెప్పో, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి, అప్పటి నుంచి ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తూనే ఉన్నాయి.
యుద్ధం ఎవరు ప్రారంభించారు?
అప్పటికి(2011) 40 ఏళ్లుగా సోషలిస్ట్ బాత్ పార్టీ పేరిట సాగుతున్న అసద్ కుటుంబపాలనలో అవినీతి, అణచివేత అదుపు తప్పాయి. ఫలితంగా దేరాలో జరిగిన ప్రజాప్రదర్శనను సర్కారు ఉక్కుపాదంతో అణచివేసింది. దీంతో తిరుగుబాటుదారులకు ప్రవాసంలో ఉన్న అసద్ వ్యతిరేకులందరూ మద్దతు అందించారు.
ఎవరెవరిపై పోరాడుతున్నారు?
అధ్యక్షుడు అసద్ సేనలు తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులు, ఇస్లాం పేరిట దారుణాలకు పాల్పడుతున్న ఐసిస్ దళాలతో పోరుసాగిస్తున్నాయి. తిరుగుబాటుదారులపై యుద్ధంలో అసద్ సైన్యం ఎందుకు విజయం సాధించలేకపోతోంది? దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలు, గ్రూపుల జోక్యమే. అసద్ షియా కావడంతో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి షియా మెజారిటీ ఇరాన్‌తోపాటు, ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి సంబంధాల కారణంగా రష్యా సాయం చేస్తున్నాయి. అమెరికా, సౌదీఅరేబియాలు సున్నీ తిరుగుబాటుదారులకు అన్ని విధాలా తోడ్పడుతున్నాయి.
అంతర్యుద్ధంలో జరిగిన నష్టమెంత?
ఒక్క అలెప్పో నగరంలోనే మూడు నుంచి దాదాపు ఐదు లక్షల మంది ఈ అంతర్గత పోరులో ప్రాణాలు కోల్పోయారు. హింస ఎంతగా పెరిగిందంటే 2015 ఆగస్టులో ఇక్కడ మృతులను ఐక్యరాజ్య సమితి లెక్కించడం మానేసింది. దేశం నుంచి దాదాపు అర కోటి మంది పొరుగున ఉన్న టర్కీ, జోర్డాన్, లెబనాన్‌తో పాటు పశ్చిమ ఐరోపా దేశాలకు పారిపోయారు. దాదాపు 65 లక్షల మంది ప్రజలు ఈ అంతర్యుద్ధం కారణంగా తమ ఊళ్లను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు చెల్లాచెదురయ్యారు. ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి అసద్ తన దళాలతో రసాయన ఆయుధాలు ప్రయోగించడమేగాక, వీధుల్లో మూకుమ్మడి హత్యాంకాడలకు తెగబడ్డాడని అమెరికా ఆరోపించింది.
సిరియాలో హింస ఎంత క్రూరంగా కనిపిస్తోంది?
తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రధాన నగరం అలెప్పోను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి డిసెంబర్‌లో అసద్ ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో దాడులు జరిపాయి. ఈ మెరుపు దాడుల్లో 82 మంది పౌరులు మరణించారు. తిరుగుబాటుదారుల చివరి స్థావరంగా మిగిలిన తూర్పు అలెప్పోలో కేవలం అయిదు శాతం ప్రాంతం మాత్రమే వారి అధీనంలో ఉన్నాగాని ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రభుత్వ అనుకూల దళాలు ప్రజలపై దారుణాలకు పాల్పడ్డాయని ఐరాస ప్రధానకార్యదర్శి బాన్‌కీ మూన్ చెప్పారు.
ప్రచ్ఛన్నయుద్ధం అవశేషాలే సిరియా మంటలకు కారణమా?
ప్రచ్ఛన్నయుద్దకాలంలో అసద్ కుటుంబం అప్పటి సోవియెట్ యూనియన్‌కు మద్దతుదారుగా మారింది. అసద్ కుటుంబం షియా ఆలవైత్ తెగకు చెందినది కావడం, అమెరికాతో వైరం ఇరాన్‌ను సిరియాకు దగ్గరయ్యేలా చేసింది. సోవియెట్ యూనియన్ విచ్ఛన్నమయ్యాక కూడా అమెరికా అసద్ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు సాయమందిస్తూనే ఉంది. ఫలితంగా రష్యాకు అసద్ సర్కారు మరింది చేరువయింది. ఏకైక అగ్రరాజ్యం అమెరికా, మాజీ అగ్రరాజ్యం వారసురాలు రష్యాల మధ్య ఇంకా కొనసాగుతున్న పోటీ కూడా సిరియా మంటలకు ఆజ్యం పోస్తోంది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)