ట్రంప్‌ ఇడియట్‌ అంటూ తిట్ల దండకం | Islamic state calls donald trump 'idiot' in message | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఇడియట్‌ అంటూ తిట్ల దండకం

Published Wed, Apr 5 2017 5:05 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ట్రంప్‌ ఇడియట్‌ అంటూ తిట్ల దండకం - Sakshi

ట్రంప్‌ ఇడియట్‌ అంటూ తిట్ల దండకం

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై  అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (ఐసిఎస్‌) తిట్ల దండకం లంకించుకుంది. ‘ఇడియట్‌’ అంటూ ట్రంప్‌ను తీవ్ర పదజాలంతో దూషించింది. ఇస్లాం గురించి ట్రంప్‌కు ఏం తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఐఎస్‌ అధికార ప్రతినిధి అబు హసన్‌ అల్‌ ముహజిర్‌ పేరిట అరబిక్‌ భాషలో దాదాపు 36 నిమిషాల నిడివి గల  వీడియోను మంగళవారం విడుదల చేసింది. ఆ వీడియోలో అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనాపగ్గాలు చేపట‍్టటం అమెరికన్ల దివాళాకోరుతనంగా అభివర్ణించింది. కాగా ట్రంప్‌ జనవరిలో అధికారంలోకి వచ్చాక ఐసిఎస్‌ నుంచి వచ్చిన తొలి వీడియో ఇది.

అందులో ఇస్లాంను గురించి ఏమాత్రం అవగాహన లేని ఇడియట్‌గా ట్రంప్‌ను పేర్కొంది. ఇస్లామిక్‌ స్టేట్‌ అంటే ఏమిటో కూడా తెలియని మూర్ఖుడని వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్ష గద్దె నుంచి ట్రంప్‌ను తొలగించటం ఖాయమని, ఆయన ఉద్వాసనకు మార్గం మరింత సుగమమైందని పేర్కొంది. అమెరికా సర్కార్‌ త్వరలోనే దివాళా తీయడం ఖాయమని, ఇప్పటివరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఇమేజ్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరికలు చేసింది. సిరియా, ఇరాక్లలో తాము పట్టు కోల్పోలేదని, సిరియాలో మరింత బలపడేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది.  ఇరాక్ బలగాలతో తాము ఎదుర్కొంటున్న పరిస్థితి జిహాదీ చరిత్రలోనే గొప్పదిగా అభివర్ణించింది.

కాగా అమెరికా ఎన్నికల ప్రచారంలోనూ, అధ్యక్షుడయ్యాక ట్రంప్‌ పలు సందర్భాల్లో ఐఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతోపాటు అమెరికా బలగాలను ఐఎస్‌ను యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే ఇరాక్‌తోపాటు సిరియాలోని కొంతభాగంలో ఇస్లామిక్‌స్టేట్‌ పేరుతో అధికారం నడుపుతున్న ఈ సంస‍్థను తుదముట్టించేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వీడియోను ఐఎస్‌ వ్యూహకర్తలు రూపొందించారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement