ఐఎస్‌ఐఎస్ సృష్టికర్తలు ఒబామా, హిల్లరీనే!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ విధానాల వల్లే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పురుడు పోసుకుందని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. మిసిసిపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఒబామా, క్లింటన్ విధానాలపై దుమ్మెత్తిపోశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద గ్రూపు ఎదుగుదలకు వారే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
'నేను గతంలోనే చెప్పాను. 'చమురు తెచ్చుకొండి. చమురును అధీనంలోకి తీసుకోండి. చమురును నిల్వ ఉంచండి' అని మూడేళ్లుగా నేను చెప్తూనే ఉన్నా. కానీ ప్రతి ఒక్కరూ ' అది మేం చేయలేం. అది సారభౌమాధికార దేశం. అక్కడ దేశం లేదు' అంటూ కారణాలు చెప్పారు. వాళ్లే ఐఎస్ఐఎస్‌ను సృష్టించారు. ఒబామాతో కలిసి హిల్లరీ క్లింటన్‌నే ఐఎస్ఐఎస్‌ను సృష్టించింది' అని ట్రంప్ ఆరోపించారు. చమురు కోసం పొరుగుదేశం సౌదీ అరేబియాను తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ఇరాన్ భావిస్తోందని ఆయన విమర్శించారు.