ట్రంప్‌ సరైనోడు కాదు! | Hillary Clinton concerned on Trump administration's ability to handle talks with Kim Jong-un | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సరైనోడు కాదు!

Published Sun, Mar 11 2018 2:44 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

Hillary Clinton concerned on Trump administration's ability to handle talks with Kim Jong-un - Sakshi

హిల్లరీ క్లింటన్‌

ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆ స్థానానికి అర్హుడు కాదని, గత ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేసిన హిల్లరీ క్లింటన్‌ విమర్శించారు. ట్రంప్‌ గెలుస్తారని ఎవరూ అనుకోలేదన్నారు. పారిస్‌ ఒప్పందంపై సంతకాల విషయంలో అన్ని దేశాలను ఒప్పించటంలో భారత్‌ పెద్దన్నపాత్ర పోషించిందని ప్రశంసించారు. ముంబైలో ఇండియాటుడే సదస్సు – 2018లో పాల్గొన్న క్లింటన్‌.. ట్రంప్‌ పాలన తీరు, అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత ప్రాభవం వంటి పలు అంశాలపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

రష్యా తీరును అంతర్జాతీయ సమాజం ముందు తీవ్రంగా వ్యతిరేకించినందునే.. పుతిన్‌కు తానంటే వ్యక్తిగతంగా నచ్చదని హిల్లరీ పేర్కొన్నారు. దీని కారణంగానే.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేశారన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయటంలో సామాజిక మాధ్యమం ఓ ఆయుధంలా మారిందని.. ఇది సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తుందని హిల్లరీ అభిప్రాయపడ్డారు. భారత సమాజంలోనూ విభేదాలు సృష్టించేందుకు ఈ మాధ్యమం ద్వారా ఎవరైనా ప్రయత్నించే అవకాశం ఉందన్నారు.  

అమెరికాలో ప్రజాస్వామ్యం లేదు
అమెరికా అధ్యక్ష స్థానానికి ట్రంప్‌ సరైన వ్యక్తి కాదన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రచారం సంప్రదాయపద్ధతిలో జరిగిందని.. ముఖ్యమైన అంశాలను స్పృశించానన్నారు. అయితే.. ట్రంప్‌ ప్రచారం ఓ టీవీ రియాల్టీ షోలా ప్రహసనంగా సాగిందన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని భావించానని హిల్లరీ తెలిపారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముందన్నారు. అమెరికాలో ప్రశ్నించే గొంతుకలకు స్థానం లేకుండా చేస్తున్నారన్నారు. ప్రజలు ఒకరిపై ఒకరు విషం చిమ్ముకునేందుకు సామాజిక మీడియానే కారణమవుతోందన్నారు.  

భారత్‌ నాయకత్వాన్ని కోరుతున్నారు..
అంతర్జాతీయంగా భారత ప్రాభవం పెరుగుతోందని.. ప్రపంచవ్యాప్తంగా శాంతి వెల్లివిరియటంలో భారత్‌ పాత్ర కీలకం కానుందని హిల్లరీ తెలిపారు. పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి ట్రంప్‌ బయటకు రావటాన్ని విమర్శించిన హిల్లరీ.. అమెరికాకు ఇది అత్యంత అవమానకరమన్నారు. అమెరికా తప్పుకున్నప్పటికీ.. ఈ ఒప్పందంపై అందరినీ ఒప్పించటంలో భారత్‌ పోషించిన పాత్ర అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క దేశంతో మాట్లాడి.. వివరాలను అర్థం చేయించారని భారత్‌ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ‘పర్యావరణాన్ని దోచుకోవటం సరికాదు. దీన్ని కాపాడుతూనే ప్రపంచం లబ్ధి పొందాలి’ అని పారిస్‌ ఒప్పందం సమయంలో మోదీ వ్యాఖ్యలను క్లింటన్‌ గుర్తుచేశారు. ప్రపంచంలో పర్యావరణ మార్పుపై భారత నాయకత్వాన్ని ప్రపంచం కోరుకుంటోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement