Paris Treaty
-
ట్రంప్ సరైనోడు కాదు!
ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ స్థానానికి అర్హుడు కాదని, గత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేసిన హిల్లరీ క్లింటన్ విమర్శించారు. ట్రంప్ గెలుస్తారని ఎవరూ అనుకోలేదన్నారు. పారిస్ ఒప్పందంపై సంతకాల విషయంలో అన్ని దేశాలను ఒప్పించటంలో భారత్ పెద్దన్నపాత్ర పోషించిందని ప్రశంసించారు. ముంబైలో ఇండియాటుడే సదస్సు – 2018లో పాల్గొన్న క్లింటన్.. ట్రంప్ పాలన తీరు, అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత ప్రాభవం వంటి పలు అంశాలపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు. రష్యా తీరును అంతర్జాతీయ సమాజం ముందు తీవ్రంగా వ్యతిరేకించినందునే.. పుతిన్‌కు తానంటే వ్యక్తిగతంగా నచ్చదని హిల్లరీ పేర్కొన్నారు. దీని కారణంగానే.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేశారన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయటంలో సామాజిక మాధ్యమం ఓ ఆయుధంలా మారిందని.. ఇది సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తుందని హిల్లరీ అభిప్రాయపడ్డారు. భారత సమాజంలోనూ విభేదాలు సృష్టించేందుకు ఈ మాధ్యమం ద్వారా ఎవరైనా ప్రయత్నించే అవకాశం ఉందన్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యం లేదు అమెరికా అధ్యక్ష స్థానానికి ట్రంప్ సరైన వ్యక్తి కాదన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రచారం సంప్రదాయపద్ధతిలో జరిగిందని.. ముఖ్యమైన అంశాలను స్పృశించానన్నారు. అయితే.. ట్రంప్ ప్రచారం ఓ టీవీ రియాల్టీ షోలా ప్రహసనంగా సాగిందన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని భావించానని హిల్లరీ తెలిపారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముందన్నారు. అమెరికాలో ప్రశ్నించే గొంతుకలకు స్థానం లేకుండా చేస్తున్నారన్నారు. ప్రజలు ఒకరిపై ఒకరు విషం చిమ్ముకునేందుకు సామాజిక మీడియానే కారణమవుతోందన్నారు. భారత్ నాయకత్వాన్ని కోరుతున్నారు.. అంతర్జాతీయంగా భారత ప్రాభవం పెరుగుతోందని.. ప్రపంచవ్యాప్తంగా శాంతి వెల్లివిరియటంలో భారత్ పాత్ర కీలకం కానుందని హిల్లరీ తెలిపారు. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి ట్రంప్ బయటకు రావటాన్ని విమర్శించిన హిల్లరీ.. అమెరికాకు ఇది అత్యంత అవమానకరమన్నారు. అమెరికా తప్పుకున్నప్పటికీ.. ఈ ఒప్పందంపై అందరినీ ఒప్పించటంలో భారత్ పోషించిన పాత్ర అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క దేశంతో మాట్లాడి.. వివరాలను అర్థం చేయించారని భారత్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ‘పర్యావరణాన్ని దోచుకోవటం సరికాదు. దీన్ని కాపాడుతూనే ప్రపంచం లబ్ధి పొందాలి’ అని పారిస్ ఒప్పందం సమయంలో మోదీ వ్యాఖ్యలను క్లింటన్ గుర్తుచేశారు. ప్రపంచంలో పర్యావరణ మార్పుపై భారత నాయకత్వాన్ని ప్రపంచం కోరుకుంటోందన్నారు. -
భవిష్యత్ తరాల కోసం..
► పర్యావరణాన్ని కాపాడుకోవటం మన బాధ్యత ► పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించాలి ► ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ అనంతరం మోదీ ► ముగిసిన ప్రధాని నాలుగుదేశాల పర్యటన పారిస్: భూతాపాన్ని తగ్గించేందుకు కుదుర్చుకున్న పారిస్ ఒప్పందాన్ని మించి పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందాన్ని ప్రపంచమంతా బాధ్యతగా తీసుకోవాలన్నారు. నాలుగుదేశాల పర్యటన సందర్భంగా ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్‌తో సమావేశమైన ప్రధాని ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. తర్వాత మేక్రాన్‌తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘భూమిని, సహజ వనరులను కాపాడుకోవటం మన బాధ్యత. ప్రపంచానికి పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం. భవిష్యత్ తరాలకు ఇది క్షేమకరం. మన పూర్వీకులు సహజ వనరులను కాపాడినందుకే మనకు ఈ వనరులు అందుబాటులో ఉన్నాయి. మన భవిష్యత్ తరాలకోసం కూడా ఇదే వారసత్వాన్ని మనం కొనసాగించాలి. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా, అంతకన్నా ఎక్కువగానే పర్యావరణంపై భారత్ పనిచేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కలసిమెలసి ప్రపంచానికి పెనుసవాల్‌గా మారిన ఉగ్రవాదంపై పోరులో భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేయనున్నాయని ప్రధాని వెల్లడించారు. ఫ్రాన్స్‌కు ఉగ్ర సమస్య ఎక్కువగా ఉందని.. అందుకే వారికి కూడా ఉగ్రవాదం వల్ల కలిగే బాధేంటో బాగా తెలుసన్నారు. ప్రపంచమంతా ఉగ్ర పోరాటంలో ఒకేతాటిపైకి రావాల్సిన అవసరముందని మోదీ తెలిపారు. భారత్–ఫ్రాన్స్ దేశాల మధ్య బలమైన మిత్రత్వం కారణంగా ఇరుదేశాలు చాలాకాలంగా కలిసిపనిచేస్తున్నాయని.. ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికలపైనా సంయుక్తంగా ముందుకెళ్తున్నాయని ప్రధాని వెల్లడించారు. ‘అది వాణిజ్యమైనా, సాంకేతిక, సృజనాత్మకత, పెట్టుబడులు, శక్తి, విద్య ఇలా అన్ని రంగాల్లో భారత్–ఫ్రాన్స్ బంధాలు మరింత బలోపేతం కావాలని.. మేం భావిస్తున్నాం’ అని మోదీ వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేయటంపైనా ఇరువురు అధినేతలు ఆసక్తి కనబరిచారు. భారత పర్యటనకు రావాలని మేక్రాన్‌ను మోదీ ఆహ్వానించారు. ఏడాది చివర్లో ఈ పర్యటన జరగనున్నట్లు తెలిసింది. అదే సమయంలో ప్రపంచ సోలార్ కూటమి సమావేశాలను ఇరుదేశాలు నిర్వహించనున్నాయి. కాగా, ప్రపంచయుద్ధాల సందర్భంగా ఫ్రాన్స్ స్వాతంత్య్ర పోరాటంలో సహకరించి ప్రాణత్యాగం చేసిన భారత సైనికులకు మేక్రాన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మోదీ, మేక్రాన్ కలిసి ఆర్క్ డి ట్రయంఫే స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించారు. అంతకుముందు ప్రధాని మోదీని మేక్రాన్ ఆలింగనం చేసుకుని రాజప్రాసాదంలోకి స్వాగతం పలికారు. అంతకుముందు ఇరువురు నేతలు ప్రత్యేక భేటీలో పలు అంశాలపై చర్చించారు. నాలుగుదేశాల పర్యటన ముగించుకుని మోదీ భారత్‌కు తిరుగుప్రయాణమయ్యారు. -
ఇదీ పారిస్ ఒప్పందం..
పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల విచ్చలవిడి వాడకం, పారిశ్రామికీకరణతో భూగోళం వేడెక్కుతోంది. పరిస్థితి మారకపోతే కార్బన్డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పెరిగి అనేక విపరిణామాలు చోటు చేసుకుంటాయి. అకాల వర్షాలు, వరదలు, కరువు వంటి అనేక అనర్థాలు కలగనున్నాయి. ఈ విపత్తు నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలన్నీ కుదర్చుకున్నదే పారిస్ ఒప్పందం. రెండేళ్ల క్రితం దీన్ని ప్రతిపాదించగా.. 195 దేశాలు సంతకాలు చేశాయి. గత ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్నది ఈ ఒప్పందం లక్ష్యం. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి చర్యలతో దీన్ని సాధించాలన్నది సంకల్పం. ఒప్పందంలో అమెరికాదే కీలకపాత్ర ఈ ఒప్పందం చట్టం కాదు. అందువల్ల అన్ని దేశాలు కచ్చితంగా అమలుచేయాల్సిన అవసరం లేదు. ఉద్గారాల తగ్గింపునకు ఏ చర్యలు తీసుకోనున్నారో, ఎంత పురోగతి సాధించారో ఆయా దేశాలు నిర్ణీత కాలవ్యవధిలో ప్రకటించాలి. ఇందులో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా 2025 నాటికల్లా కర్బన ఉద్గారాలను 26 నుంచి 28 శాతం (2005 నాటి స్థాయి) తగ్గిస్తామని ప్రకటించారు. ఇతర దేశాలు తమ లక్ష్యాలను చేరుకునేలా ఇంతవరకూ అధిక కాలుష్యానికి కారణమైన అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా సాయపడాలి. ప్రపంచదేశాలన్నీ భాగస్వాములుగా ఉన్న యునైటెడ్ నేషన్స్ గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు ఏటా రూ. 6.5 లక్షల కోట్లు జమ చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఒబామా అమెరికా తరఫున వంద కోట్ల డాలర్లు అందజేశారు. అయితే అమెరికా తాజా బడ్జెట్లో ఈ నిధి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ట్రంప్ నిర్ణయం వెనుక.. భూతాపోన్నతి, వాతావరణ మార్పులపై ట్రంప్‌కు నమ్మకం లేదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఇవన్నీ చైనా కుట్రగా పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని చైనా తగ్గించుకోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలతో అమెరికాకు ప్రయోజనం లేదని, పారిస్ ఒప్పందమూ అలాంటిదేనని ట్రంప్ అభిప్రాయం. కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఒబామా విధించిన ఆంక్షలు, పెట్టాలనుకున్న ఖర్చు అమెరికా వృద్ధిని అడ్డుకుంటుందని ట్రంప్ భావిస్తున్నారు. ఒబామా హయాంలో బొగ్గు వాడకాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన క్లీన్ పవర్ ప్లాన్‌ను రద్దు చేయగా.. అధ్యక్షుడిగా ఎన్నికైతే బొగ్గు గనులు, విద్యుత్ ప్లాంట్లను పునరుద్ధరిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అమెరికా వైదొలిగితే ఏమవుతుంది..? అమెరికా వైదొలిగితే పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే. 2025 నాటికల్లా 200 కోట్ల టన్నుల ఉద్గారాల్ని అమెరికా తగ్గించాలన్నది ఒబామా లక్ష్యం. అమెరికా తప్పుకోవడం వల్ల మిగిలిన దేశాలపై ఆ భారం పడనుంది. సాంకేతికంగా చూస్తే అమెరికా ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగేందుకు మరో నాలుగేళ్ల సమయం పడుతుంది. వైదొలగాలనుకునే దేశం మూడేళ్ల ముందుగా నోటీసు ఇవ్వాలి. నోటీసు కాలం తర్వాత మరో ఏడాది గడిచాక... ఒప్పందం నుంచి వైదొలిగినట్లు. ఈ లోపు సౌర, పవన విద్యుత్తులను మరింత చౌక చేసేందుకు ఒబామా చేపట్టిన చర్యల్ని ట్రంప్ నిలిపివేయవచ్చు. భారత్, చైనా వంటి దేశాలు ఈ అంశాన్ని బలంగా మార్చుకుని కొత్త టెక్నాలజీ అభివృద్ధికి, పరిశోధనలకు ఊతమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్