భవిష్యత్ తరాల కోసం..
► పర్యావరణాన్ని కాపాడుకోవటం మన బాధ్యత
► పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించాలి
► ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ అనంతరం మోదీ
► ముగిసిన ప్రధాని నాలుగుదేశాల పర్యటన
పారిస్: భూతాపాన్ని తగ్గించేందుకు కుదుర్చుకున్న పారిస్ ఒప్పందాన్ని మించి పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందాన్ని ప్రపంచమంతా బాధ్యతగా తీసుకోవాలన్నారు. నాలుగుదేశాల పర్యటన సందర్భంగా ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్‌తో సమావేశమైన ప్రధాని ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
తర్వాత మేక్రాన్‌తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ‘భూమిని, సహజ వనరులను కాపాడుకోవటం మన బాధ్యత. ప్రపంచానికి పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం. భవిష్యత్ తరాలకు ఇది క్షేమకరం. మన పూర్వీకులు సహజ వనరులను కాపాడినందుకే మనకు ఈ వనరులు అందుబాటులో ఉన్నాయి. మన భవిష్యత్ తరాలకోసం కూడా ఇదే వారసత్వాన్ని మనం కొనసాగించాలి. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా, అంతకన్నా ఎక్కువగానే పర్యావరణంపై భారత్ పనిచేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై కలసిమెలసి
ప్రపంచానికి పెనుసవాల్‌గా మారిన ఉగ్రవాదంపై పోరులో భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేయనున్నాయని ప్రధాని వెల్లడించారు. ఫ్రాన్స్‌కు ఉగ్ర సమస్య ఎక్కువగా ఉందని.. అందుకే వారికి కూడా ఉగ్రవాదం వల్ల కలిగే బాధేంటో బాగా తెలుసన్నారు. ప్రపంచమంతా ఉగ్ర పోరాటంలో ఒకేతాటిపైకి రావాల్సిన అవసరముందని మోదీ తెలిపారు. భారత్–ఫ్రాన్స్ దేశాల మధ్య బలమైన మిత్రత్వం కారణంగా ఇరుదేశాలు చాలాకాలంగా కలిసిపనిచేస్తున్నాయని.. ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికలపైనా సంయుక్తంగా ముందుకెళ్తున్నాయని ప్రధాని వెల్లడించారు.
‘అది వాణిజ్యమైనా, సాంకేతిక, సృజనాత్మకత, పెట్టుబడులు, శక్తి, విద్య ఇలా అన్ని రంగాల్లో భారత్–ఫ్రాన్స్ బంధాలు మరింత బలోపేతం కావాలని.. మేం భావిస్తున్నాం’ అని మోదీ వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేయటంపైనా ఇరువురు అధినేతలు ఆసక్తి కనబరిచారు. భారత పర్యటనకు రావాలని మేక్రాన్‌ను మోదీ ఆహ్వానించారు. ఏడాది చివర్లో ఈ పర్యటన జరగనున్నట్లు తెలిసింది.
అదే సమయంలో ప్రపంచ సోలార్ కూటమి సమావేశాలను ఇరుదేశాలు నిర్వహించనున్నాయి. కాగా, ప్రపంచయుద్ధాల సందర్భంగా ఫ్రాన్స్ స్వాతంత్య్ర పోరాటంలో సహకరించి ప్రాణత్యాగం చేసిన భారత సైనికులకు మేక్రాన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మోదీ, మేక్రాన్ కలిసి ఆర్క్ డి ట్రయంఫే స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించారు. అంతకుముందు ప్రధాని మోదీని మేక్రాన్ ఆలింగనం చేసుకుని రాజప్రాసాదంలోకి స్వాగతం పలికారు. అంతకుముందు ఇరువురు నేతలు ప్రత్యేక భేటీలో పలు అంశాలపై చర్చించారు. నాలుగుదేశాల పర్యటన ముగించుకుని మోదీ భారత్‌కు తిరుగుప్రయాణమయ్యారు.