ప్రెసిడెంట్ ట్రంప్.. సిరియా జెండా(కుడి వైపు)
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 7వేల మంది సిరియన్ వలస వాదులను అమెరికాలో కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
‘‘ప్రస్తుతం సిరియా అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వారిక్కడే(అమెరికాలో) నివసించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. మానవత్వ కోణంలో వారికిక్కడ తాత్కాలిక రక్షణ హోదాను (టీపీఎస్) కల్పిస్తున్నాం. దానిని మరికొంత కాలం కొనసాగించబోతున్నాం’’ అంటూ ట్రంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అయితే కొత్తగా వచ్చే శరణార్థుల దరఖాస్తులను మాత్రం అంగీకరించబోమని అమెరికా స్పష్టం చేసింది.
ఇక ఈ ప్రకటనను అమెరికా హోంలాండ్ కార్యదర్శి క్రిస్ట్‌జెన్ నీల్సన్ ధృవీకరించారు. ఒక్క సిరియానే కాదు.. మిగతా దేశాల(నిషేధం ఎదుర్కుంటున్న 10 దేశాలు) శరణార్థుల విషయంలోనూ పునరాలోచన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తాజా ఉత్తర్వులతో అమెరికాలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న సిరియన్లు.. మరో 18 నెలలపాటు నిరభ్యరంతంగా జీవించొచ్చు. అయితే ఎల్ సాల్వెడొర్, హైతి, నికారగువా తదితర ప్రాంతాల నుంచి శరణార్థుల తాకిడి ఎక్కువగా ఉంటుండటంతో.. ఆ మధ్య టీపీఎస్ విధానాన్ని ఆయా ప్రాంతాలకు రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2007లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శరణార్థుల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో శరణార్థుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అయితే నిషేధం ఎదుర్కొంటున్న 11 దేశాలపై మాత్రం 90 రోజుల పాటు సమీక్షించాలని గతేడాది అక్టోబర్‌లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment