Syrian civil war
-
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్‌కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్‌కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్‌ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్‌లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్‌లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్‌లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్‌ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కుర్దు ఉగ్రవాదులను తరిమికొట్టాం’
అఫ్రిన్, సిరియా : సిరియాలోని ఆఫ్రిన్ నగరంలో టర్కీ సేనలు పాగా వేశాయి. దేశానికి ఆఫ్రిన్ నగరంలోని కుర్దులను టర్కీ దన్నుతో సిరియాలో పోరాటం సాగిస్తున్న సేనలు వెళ్లగొట్టాయి. అనంతరం ప్రముఖ కుర్దు నాయకుడి విగ్రహాన్ని సేనలు నేలకూల్చాయి. టర్కీ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ మిలిటెంట్లను అంతమొందించేందుకు గత రెండు నెలలుగా సిరియాలో టర్కీ సేనలు వరుసగా దాడులు చేస్తున్నాయి. అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకూ 280 సాధారణ పౌరులు మరణిచారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా ఆ ఆరోపణలను టర్కీ ఖండించింది. అంతకుముందు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ ఫ్రీ సిరియా ఆర్మీ సేనలు ఆఫ్రిన్‌ను ఆదివారం ఉదయం స్వాధీనం చేస్తున్నాయని ప్రకటించారు. సేనల దెబ్బకు ఉగ్రవాదులు ఒట్టి చేతులతో పారిపోతున్నారని అన్నారు. -
ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 7వేల మంది సిరియన్ వలస వాదులను అమెరికాలో కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘ప్రస్తుతం సిరియా అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వారిక్కడే(అమెరికాలో) నివసించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. మానవత్వ కోణంలో వారికిక్కడ తాత్కాలిక రక్షణ హోదాను (టీపీఎస్) కల్పిస్తున్నాం. దానిని మరికొంత కాలం కొనసాగించబోతున్నాం’’ అంటూ ట్రంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అయితే కొత్తగా వచ్చే శరణార్థుల దరఖాస్తులను మాత్రం అంగీకరించబోమని అమెరికా స్పష్టం చేసింది. ఇక ఈ ప్రకటనను అమెరికా హోంలాండ్ కార్యదర్శి క్రిస్ట్‌జెన్ నీల్సన్ ధృవీకరించారు. ఒక్క సిరియానే కాదు.. మిగతా దేశాల(నిషేధం ఎదుర్కుంటున్న 10 దేశాలు) శరణార్థుల విషయంలోనూ పునరాలోచన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తాజా ఉత్తర్వులతో అమెరికాలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న సిరియన్లు.. మరో 18 నెలలపాటు నిరభ్యరంతంగా జీవించొచ్చు. అయితే ఎల్ సాల్వెడొర్, హైతి, నికారగువా తదితర ప్రాంతాల నుంచి శరణార్థుల తాకిడి ఎక్కువగా ఉంటుండటంతో.. ఆ మధ్య టీపీఎస్ విధానాన్ని ఆయా ప్రాంతాలకు రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2007లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శరణార్థుల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో శరణార్థుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అయితే నిషేధం ఎదుర్కొంటున్న 11 దేశాలపై మాత్రం 90 రోజుల పాటు సమీక్షించాలని గతేడాది అక్టోబర్‌లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. -
క్రిస్టియన్ నగరంపై విరుచుకుపడ్డ జిహాదీలు
డమాస్కస్ : సిరియాలోని హమా, మహార్దా నగరాలపై ఆదివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) జిహాదీ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. అల్‌ఖైదా నేతృత్వంలో తీవ్రవాదాన్ని కొనసాగిస్తున్న ఉగ్ర సంస్థలు హాయత్ తహరీర్ అల్ షామ్, ఎఫ్‌ఎస్‌ఏలు సిరియా సైన్యానికి చెందిన మూడు చెక్ పాయింట్లపై బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఒక చెక్ పోస్టు పూర్తిగా ధ్వంసం కాగా, రెండు చెక్ పోస్టులు పాక్షికంగా నాశనమయ్యాయి. సైన్యం చెక్‌పోస్టులతో పాటు క్రిస్టియన్ నగరమైన మహార్దాపై ఒకే సమయంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మహార్దాపై క్షిపణుల వర్షం కురింపించారు. క్రిస్టమస్ వేడుకకు నగరం సిద్ధమవుతున్న సందర్భంలో దాడి జరగడంతో మహార్దా ప్రజలు షాక్‌కు గురయ్యారు. కాగా, ఉగ్రవాదుల దాడికి ప్రతిగా సిరియా, రష్యా ఫైటర్ జెట్లు ఉగ్ర ప్రభావం కలిగిన ప్రాంతాలపై బాంబు దాడులు చేశాయి. కాగా, జిహాదీలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉగ్రవాదులు చేసిన దాడిగా దీన్ని పరిగణిస్తున్నారు. -
ఐసిస్ అధీనంలోని చివరి పట్టణం స్వాధీనం
బగ్దాద్: సంకీర్ణ సేనలతో పాటు కుర్దిష్ దళాల దాడులతో దెబ్బతిన్న ఉగ్రసంస్థ ఐసిస్‌కు మరో షాక్ తగిలింది. దేశంలో ఐసిస్ అధీనంలో ఉన్న చివరి పట్టణమైన ‘రవా’ను శుక్రవారం ఇరాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ‘భద్రతా బలగాలు రవాకు విముక్తి కల్పించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై ఇరాక్ జాతీయ జెండాను ఎగరవేశాయి’ అని సంయుక్త ఆపరేషన్స్ కమాండ్(జేఓసీ) జనరల్ అబ్దెలామీర్ యరల్లాహ్ ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, కుర్దిష్ దళాలు, రష్యా మద్దతు ఉన్న సిరియన్ సైన్యం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో ఇప్పటివరకు ఐసిస్ 95 శాతం భూభాగాన్ని కోల్పోయింది. -
జస్టిన్ ట్రూడో చేతిలో జస్టిన్ ట్రూడో.. వైరల్
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉద్వేగానికి లోనయ్యారు. శనివారం ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ చిన్ని జస్టిన్ ట్రూడోను అప్యాయంగా ఎత్తుకుని ముద్దాడిన సందర్బంలో ఆయన ఆనందం రెట్టింపయింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుజ్జి జస్టిన్ ట్రూడోకు ఆయనకు ఏమాత్రం సంబంధం లేదు. అయితే జస్టిన్ ట్రూడో పేరేంటి అంటారా. ఆ వివరాలు.. సిరియాలోని డెమాస్కస్‌కు చెందిన మహ్మద్, ఆఫ్రా బిలాల్ అనే దంపతులు గతేడాది ఫిబ్రవరిలో శరణార్థులుగా కెనడాకు వలసొచ్చారు. ఇక్కడి ఆల్బర్టా అనే ప్రాంతంలో ఈ జంట నివాసం ఉంటోంది. కెనడాకు వచ్చిన కొన్ని రోజులకు వీరికి ఓ పండండి బాబు పుట్టగా.. శరణార్థులుగా తమకు ఎంతో దయగా దేశంలోకి అనుమతులిచ్చిన ప్రధాని జస్టిన్ ట్రూడో పేరునే బాబుకు పెట్టారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రధానిని కలిసి తమ కుమారుడు జస్టిన్ ట్రూడోను చూపించాలని సిరియా దంపతులు భావించారు. అంత త్వరగా తమ కోరిక నెరవేరుతుందని మహ్మద్, ఆఫ్రా బిలాల్‌లు ఊహించలేదు. కాల్గరీలోని ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చారని చూసేందుకు ఈ భార్యాభర్తలు వెళ్లారు. వీలు దొరకడంతో ప్రధానిని సిరియా జంట కలిసింది. 'మా బాబుకి మీ పేరే పెట్టుకున్నాం. జస్టిస్ ట్రూడోను అందుకోండి' అంటూ తల్లి ఆఫ్రా బాబును ప్రధాని చేతిలో పెట్టారు. తమకు ఇక్కడ ఉండేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు మీ పేరే బాబుకె పెట్టామని దంపతులు చెప్పారు. జస్టిన్ ట్రూడోను ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తుకోగా ఫొటోగ్రాఫర్ అడమ్ స్కాటి ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక అంతే.. జస్టిన్ ట్రూడోను ఎత్తుకున్న జస్టిన్ ట్రూడో అంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్‌గా మారి విపరీతంగా లైక్స్, కామెంట్లతో దూసుకుపోతోంది. .@JustinTrudeau met Justin-Trudeau Adam Bilal in #Calgary today. Background: https://t.co/u91OQexycZ #cdnpoli pic.twitter.com/qA2kvBXeXn — Adam Scotti -
సిరియాలో ఉగ్రదాడి: నలుగురి మృతి
డమస్కస్: సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. మరో12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిరియాలోని అలెప్పో అల్ ఫుర్ఖాన్ వీధిలో శుక్రవారం ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పవిత్ర మాసమైన రంజాన్ నెలలో చివరి శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు మార్కెట్లో కొనుగోళ్లు చేస్తున్న సమయంలో రాకెట్ లాంచర్ ప్రయోగించడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
అధినేతలే శరణార్థులైతే!!
దేశాధినేతలు అందునా అగ్రరాజ్యాల అధినేతలు అధికార దర్పం ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కుతగ్గరు. అడుగు తీసి అడుగు వేస్తే అంగరక్షకులు, వందిమాగధులు, అనుచరగణాల మధ్య రాచఠీవి ఒలకబోస్తుంటారు. కానీ.. అభాగ్యులు, అన్నార్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లాపాపలతో శరణార్థులై వస్తుంటే వారికి ఆశ్రయం ఇవ్వడంపై సిద్ధాంత చర్చలతో రాద్ధాంతం చేస్తుంటారు. ఈలోగా ఆ అభాగ్యులు ఎందరో మధ్యధరా సముద్రంలోనో, మధ్యవర్తుల అకృత్యాలకో బలైపోతున్నారు. ముఖ్యంగా సిరియా శరణార్థుల దైన్యం మాటలలో చెప్పలేనిది. ఆ సిరియాకు చెందిన అబ్దల్లా అల్ఒమారి అనే చిత్రకారుడు ప్రపంచ దేశాల అధినేతల మీద తన నిరసనను తన చిత్రాల ద్వారా చూపించారు. 'మీరు కూడా మనుషులే... మీరు కూడా అభాగ్యులు కాగలరు.. మీరు శరణార్థులైతే ఎలా ఉంటారో చూడండి...' అంటూ వారి చిత్రపటాలు గీశారు. అధికారం అందించే రాజలాంఛనాలలో అనునిత్యం తేలియాడే ఆ నాయకుల చిత్రాలను.. జన్మభూమిని విడనాడి సర్వస్వం కోల్పోయి చెల్లాచెదురైన కుటుంబ సభ్యుల కోసం వెదుకులాడుతూ, తలదాచుకునేందుకు కాస్త చోటు కోసం అల్లాడుతూ, ఆకలి తీర్చుకోవడానికి పిడికెడు మెతుకుల కోసం బారులు తీరే దీనుల రూపంలో గీసి చూపించాడు. ఈ చిత్రాలు సామాజిక మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌జాంగ్ ఉన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని, హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా, టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసి, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికొలస్ సర్కోజీ, ఫ్రాంకోయ్ హోలాండ్ తదితరులను శరణార్థులుగా చిత్రించారు. ప్రస్తుతం బెల్జియంలోని బ్రసెల్స్ లో నివసిస్తున్న అబ్దల్లా 'వల్నరబిలిటీ సిరీస్' పేరుతో గీసిన ఈ చిత్రాల్లో.. ముఖ్యంగా ఒక చంటిపాపను భుజాన ఎత్తుకుని, ఆచూకీ లేని తన కుటుంబ సభ్యుల ఫొటోను చేతిలో చూపిస్తూ దీనంగా కనిపిస్తున్న ట్రంప్ చిత్రం, 'నాకు సాయం చేయండి' అని రాసిన కాగితాన్ని ప్రదర్శిస్తూ అత్యంత దీనంగా కనిపిస్తున్న పుతిన్ చిత్రం, కాగితం పడవను నెత్తిన పెట్టుకుని నీటిలో నానిపోయిన అసద్ చిత్రంతో పాటు.. అధినేతలందరూ ప్లేట్లు, గిన్నెలె చేతుల్లో పట్టుకుని తిండి కోసం వరుసలో నిల్చున్న చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసి జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికొలస్ సర్కోజీ ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌జాంగ్ ఉన్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితరులు -
ఈ ఫొటో జర్నలిస్టు హృదయాలు కదిలించాడు
డెమాస్కస్: హృదయాన్ని కదిలించే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. చాలా తక్కువమంది మాత్రమే అలాంటివాటికి స్పందిస్తుంటారు. ఈరోజుల్లో అయితే జరుగుతున్న విషయాన్ని పట్టించుకోకుండా కూసింత సాయం చేయకుండా దానిని వీడియో తీయడమో, ఫొటోలో తీయడమో చేసి సోషల్ మీడియాలో పెట్టి క్రేజ్ సంపాధించుకోవాలనుకుంటారు. కానీ, సిరియాలో ఓ ఫొటో జర్నలిస్టు మాత్రం తన వృత్తిధర్మాన్ని పక్కకు పెట్టి మానవత్వాన్ని ముందుకు తెచ్చాడు. తనముందు జరిగిన సంఘటనను చూసి చలించిపోయి కాసేపు నిశ్చేష్టుడిగా మారి అనంతరం మేలుకొని నిజమైన వ్యక్తిలా కదిలాడు. రక్తం కారుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తన చుట్టూ అక్కడక్కడ పడి ఉన్న చిన్నారులపై వైపు చూసి గుండెలు పగిలేలా రోధించాడు. కెమెరా ఉండగానే రెండు చేతుల్లోకి ఓ చిన్నారిని తీసుకొని అంబులెన్స్ వైపు పరుగులు తీశాడు. ఇదంతా సిరియాలో అనూహ్యంగా వారం కిందట చోటు చేసుకున్న బాంబుదాడి జరిగినప్పుడు చోటు చేసుకున్న దృశ్యమాలిక. పశ్చిమ అలెప్పోలోని రషిదిన్ల స్వాధీనంలో ఉన్న పలు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే సమయంలో ఓ చిప్స్ ప్యాకెట్స్ పట్టుకొని కారు దగ్గర నిల్చున్న వ్యక్తి చిన్నారులను దగ్గరకు పిలుస్తున్నాడు. అక్కడే ఫొటో గ్రాఫర్ల బృందం కూడా ఉంది. ఆలోగా అనూహ్యంగా ఓ భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. క్షణాల్లో 126మంది బలయ్యారు. వారిలో 80మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఫొటో గ్రాఫర్లలో ఒకరైన అబ్ద అల్కదేర్ హబాక్ అనే వ్యక్తి ఆ సంఘటనను చూసి కాసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే తేరుకొని తన మిగితా ఫొటో గ్రాఫర్లకు ఆదేశాలు ఇచ్చి ఫొటోలు తీయడం ఆపేసి సహాయక చర్యలకు దిగాడు. ఎటు చూసిన విగత జీవులై పడి ఉన్న చిన్నారులను రోదించాడు. హబాక్ తొలిసారి ఓ చిన్నారి వద్దకు వెళ్లగా అతడు చనిపోయి ఉన్నాడు. మరో రెండడుగులు వేయగా కొన ఊపిరితో ప్రాణంకోసం ఓ బాలుడు అల్లాడుతున్నాడు. దాంతో కన్నీటి పర్యంతమైన హబాక్ అతడిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్‌లోకి చేర్చాడు. ఆ వెంటనే మరో చిన్నారి వద్దకు వెళ్లి చూడగా ప్రాణాలుకోల్పోయి కనిపించాడు. ఇలా అంతా చనిపోయి ఉండటం చూసి మొకాళ్లపై కూలబడి కుమిలికుమిలి ఏడ్చాడు. ఈ చిత్రాలను అతడి సహచర ఫొటో గ్రాఫర్లు తీసి ఆన్లైన్లో పెట్టగా లక్షల మంది వీక్షించారు. అతడు చూపించిన జాలి ప్రేమపట్ల నెటిజన్లు శబాష్ ఫొటో జర్నలిస్టు అంటున్నారు. -
కూతురి బాధ తట్టుకోలేకే...ట్రంప్ నిర్ణయం
లండన్: సిరియా వైమానిక స్థావరంపై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడానికి ఆయన కుమార్తె ఇవాంకా వేదన కూడా కారణమని ట్రంప్ కుమారుడు ఎరిక్ తెలిపారు. సిరియా గ్యాస్ దాడిలో గాయపడిన చిన్నారులపై మందును స్ప్రే చేస్తున్న చిత్రాలను చూసి తన తండ్రి చలించిపోయారని ఆయన చెప్పారు. గ్యాస్ దాడిలో తన గుండె పగిలిపోయిందని ఇవాంకా చెప్పినట్లు ‘టెలిగ్రాఫ్ పత్రిక’ పేర్కొంది. దాడి భయంకరంగా ఉందని, తన తండ్రి సకాలంలో చర్య తీసుకుంటాడని ఆమె చెప్పంది. కాగా యుద్దవిమానాలు విష రసాయనాలతో వాయువ్య సిరియాపై జరిపిన దాడిలో 72మందికి పైగా అమాయకుల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. రెబెల్స్ ఆధీనంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోగల ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతున్న కుర్దిష్–అరబ్ కూటమి లక్ష్యంగా చేసుకుని గత కొద్ది రోజులుగా దాడులు ముమ్మరం చేసింది. -
సిరియాలో ఏం జరుగుతోంది?
ఓ పక్క అంతర్యుద్ధం, మరో పక్క ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదుల ఆగడాలు, అన్నిటికీ మించి దాదాపు 17 ఏళ్లుగా బాత్‌పార్టీ నేత బషారల్ అసద్ నియంతృత్వ పాలనలో మగ్గుతున్న సిరియాలో సంక్షోభం గురువారం అమెరికా విమాన దాడులతో మరింత తీవ్రమయింది. ఇద్లీబ్ పట్టణంపై మంగళవారం జరిగిన సారిన్ విషవాయువు దాడికి తీవ్రంగా స్పందిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలపై అమెరికా సేనలు తొలిసారి సిరియాపై ప్రత్యక్ష దాడిచేశాయి. అసద్ దళాలు రసాయన దాడి చేయడానికి ఉపయోగించాయని భావిస్తున్న వైమానిక స్థావరంపై 59 అమెరికా క్షిపణుల వర్షం కురిపించాయి. విషవాయువు దాడి ఎవరు చేశారో దర్యాప్తు జరిపించాలని రష్యా ఐరాసలో ప్రయత్నం చేస్తుండగానే, అమెరికా ఎప్పటిలా అసద్నే దోషిగా చేసి దాడులు జరిపించింది. తిరుగుబాటుదారులే సారిన్ వాయువును జనంపై ప్రయోగించి, అసద్ సర్కారుకు ఆ పాపం అంటేలా చేశారని రష్యా భావిస్తోంది. ఎందుకీ అంతర్గత పోరు? 2010 చివర్లో ఈజిప్ట్ సహా అరబ్ దేశాల్లో నియంతల పాలనపై ఆరబ్ స్ప్రింగ్ పేరిట ఆరంభమైన తిరుగుబాట్లు సిరియాలోనూ ప్రజలను అసద్ సర్కారుపై పోరాటానికి పురికొల్పాయి. 2011 మార్చిలో దేరా పట్టణంలో మొదలైన ఘర్షణలు 2012 నాటికి ప్రాచీన నగరం అలెప్పో, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి, అప్పటి నుంచి ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధం ఎవరు ప్రారంభించారు? అప్పటికి(2011) 40 ఏళ్లుగా సోషలిస్ట్ బాత్ పార్టీ పేరిట సాగుతున్న అసద్ కుటుంబపాలనలో అవినీతి, అణచివేత అదుపు తప్పాయి. ఫలితంగా దేరాలో జరిగిన ప్రజాప్రదర్శనను సర్కారు ఉక్కుపాదంతో అణచివేసింది. దీంతో తిరుగుబాటుదారులకు ప్రవాసంలో ఉన్న అసద్ వ్యతిరేకులందరూ మద్దతు అందించారు. ఎవరెవరిపై పోరాడుతున్నారు? అధ్యక్షుడు అసద్ సేనలు తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులు, ఇస్లాం పేరిట దారుణాలకు పాల్పడుతున్న ఐసిస్ దళాలతో పోరుసాగిస్తున్నాయి. తిరుగుబాటుదారులపై యుద్ధంలో అసద్ సైన్యం ఎందుకు విజయం సాధించలేకపోతోంది? దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలు, గ్రూపుల జోక్యమే. అసద్ షియా కావడంతో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి షియా మెజారిటీ ఇరాన్‌తోపాటు, ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి సంబంధాల కారణంగా రష్యా సాయం చేస్తున్నాయి. అమెరికా, సౌదీఅరేబియాలు సున్నీ తిరుగుబాటుదారులకు అన్ని విధాలా తోడ్పడుతున్నాయి. అంతర్యుద్ధంలో జరిగిన నష్టమెంత? ఒక్క అలెప్పో నగరంలోనే మూడు నుంచి దాదాపు ఐదు లక్షల మంది ఈ అంతర్గత పోరులో ప్రాణాలు కోల్పోయారు. హింస ఎంతగా పెరిగిందంటే 2015 ఆగస్టులో ఇక్కడ మృతులను ఐక్యరాజ్య సమితి లెక్కించడం మానేసింది. దేశం నుంచి దాదాపు అర కోటి మంది పొరుగున ఉన్న టర్కీ, జోర్డాన్, లెబనాన్‌తో పాటు పశ్చిమ ఐరోపా దేశాలకు పారిపోయారు. దాదాపు 65 లక్షల మంది ప్రజలు ఈ అంతర్యుద్ధం కారణంగా తమ ఊళ్లను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు చెల్లాచెదురయ్యారు. ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి అసద్ తన దళాలతో రసాయన ఆయుధాలు ప్రయోగించడమేగాక, వీధుల్లో మూకుమ్మడి హత్యాంకాడలకు తెగబడ్డాడని అమెరికా ఆరోపించింది. సిరియాలో హింస ఎంత క్రూరంగా కనిపిస్తోంది? తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రధాన నగరం అలెప్పోను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి డిసెంబర్లో అసద్ ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో దాడులు జరిపాయి. ఈ మెరుపు దాడుల్లో 82 మంది పౌరులు మరణించారు. తిరుగుబాటుదారుల చివరి స్థావరంగా మిగిలిన తూర్పు అలెప్పోలో కేవలం అయిదు శాతం ప్రాంతం మాత్రమే వారి అధీనంలో ఉన్నాగాని ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రభుత్వ అనుకూల దళాలు ప్రజలపై దారుణాలకు పాల్పడ్డాయని ఐరాస ప్రధానకార్యదర్శి బాన్‌కీ మూన్ చెప్పారు. ప్రచ్ఛన్నయుద్ధం అవశేషాలే సిరియా మంటలకు కారణమా? ప్రచ్ఛన్నయుద్దకాలంలో అసద్ కుటుంబం అప్పటి సోవియెట్ యూనియన్‌కు మద్దతుదారుగా మారింది. అసద్ కుటుంబం షియా ఆలవైత్ తెగకు చెందినది కావడం, అమెరికాతో వైరం ఇరాన్‌ను సిరియాకు దగ్గరయ్యేలా చేసింది. సోవియెట్ యూనియన్ విచ్ఛన్నమయ్యాక కూడా అమెరికా అసద్ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు సాయమందిస్తూనే ఉంది. ఫలితంగా రష్యాకు అసద్ సర్కారు మరింది చేరువయింది. ఏకైక అగ్రరాజ్యం అమెరికా, మాజీ అగ్రరాజ్యం వారసురాలు రష్యాల మధ్య ఇంకా కొనసాగుతున్న పోటీ కూడా సిరియా మంటలకు ఆజ్యం పోస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘యూఎస్, రష్యా మధ్య అణుయుద్ధం జరగొచ్చు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యను హవాయిన్ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్ తులసీ గబార్డ్ తప్పుబట్టారు. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా ట్రంప్ సిరియాపై దాడి చేయించారని మండిపడ్డారు. వారికి అసలు దూరదృష్టే లేదని విమర్శించారు. ‘ఈ పాలన వర్గం(ట్రంప్ ప్రభుత్వం) నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సిరియాపై దాడులు చేస్తే తదుపరి జరగబోయే పరిణామాలు ఏమిటనే విషయంలో ఎవరినీ సంప్రదించలేదు. అదీ కాకుండా అసలు సిరియాలో జరిగింది కెమికల్ దాడులా కాదా అని నిర్ధారించుకోలేదు. ఇవేం చేయకుండానే ఏకపక్షంగా దాడి చేయడం సరికాదు. ట్రంప్ చేసిన ఈ పని నాకు చాలా బాధను, కోపాన్ని కలిగించింది. ఇది అల్ కయిదాను మరింత బలోపేతం చేస్తోంది. వారు ఇంకెంతోమంది సిరియాలోని అమాయకులను పొట్టనపెట్టుకోవచ్చు. ఎంతోమందిని శరణార్థులుగా మార్చవచ్చు. అంతేకాదు, అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉంది’ అంటూ ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
హిల్లరీ చెప్పిన కాసేపటికే దాడి!
సిరియాలోని వైమానిక స్థావరం మీద అమెరికా తన యుద్ధ విమానాల నుంచి తోమహాక్ క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందు హిల్లరీ క్లింటన్ ఎన్బీసీ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అసద్ అల్ బషర్ వైమానిక స్థావరాల మీద అమెరికా దాడి చేయాలని చెప్పారు. ఆ దేశంలో చాలావరకు పౌరుల మరణాలకు సిరియా వైమానిక దళమే కారణమని, అందువల్ల సిరియా అధ్యక్షుడి నియంత్రణలో ఉన్న మొత్తం అన్ని వైమానిక స్థావరాలను మనం స్వాధీనం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆ తర్వాత కాసేపటికే సిరియా వైమానిక స్థావరంపై తోమహాక్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ అనుమతి లేకుండానే... వాస్తవానికి అమెరికా తరఫున ఎలాంటి సైనిక చర్య తీసుకోవాలన్నా అందుకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, సిరియా మీద దాడి విషయంలో డోనాల్డ్ ట్రంప్ మాత్రం కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండానే దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకుముందు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా దాడులు చేసినా, అప్పట్లో మాత్రం కాంగ్రెస్‌లో విస్తృతంగా చర్చించిన తర్వాత మాత్రమే రంగంలోకి దిగారు. ఆరుగురు సైనికుల మృతి అమెరికా క్షిపణి దాడుల్లో ఒక అధికారి సహా ఆరుగురు సైనికులు మరణించారని సిరియా చెబుతోంది. షైరత్ వైమానిక స్థావరంపై దాదాపు 60 తోమహాక్ క్షిపణులను అమెరికా మధ్యధరా సముద్రంలోని తన యుద్ధ నౌకల నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తమ దేశానికి చెందిన నలుగురు సైనికులు మరణించినట్లు సిరియా అంటోంది. వాస్తవానికి తాము ఈ వైమానిక స్థావరాన్ని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై దాడి కోసం ఉపయోగిస్తున్నామని, ఇలాంటి స్థావరాన్ని అమెరికా ధ్వంసం చేసిందని సిరియా వాదిస్తోంది. ఈ విషయాన్ని స్థానిక పాత్రికేయులు కూడా సమర్థిస్తున్నారు. సిరియాలో చాలా వైమానిక స్థావరాలు ఉండగా, అమెరికా మాత్రం కేవలం సిరియా వైమానిక దళం ఐసిస్ మీద దాడులకు ఉపయోగించే ఏకైక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందని సిరియాకు చెందిన అల్ మస్దర్ న్యూస్ సీఈవో లీత్ అబూ ఫదెల్ ట్విట్టర్లో తెలిపారు. ఇప్పుడు సిరియాను అల్ కాయిదాకు వెండి పళ్లెంలో పెట్టి మరీ అప్పగిస్తున్నారని రక్షణ రంగ నిపుణుడు హైదర్ సుమేరి వ్యాఖ్యానించారు. -
తోమహాక్ క్షిపణులే ఎందుకు?
అమెరికా నౌకాదళం సిరియా మీద దాడులకు ఉపయోగించుకున్న ప్రధానాస్త్రం.. తోమహాక్ క్షిపణులు. చాలా దూరం నుంచి ప్రయోగించినా కూడా కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం వీటికి ఉంటుంది. 1991 ప్రాంతంలో జరిగిన గల్ఫ్ యుద్ధంలో కూడా అమెరికా వీటిని విస్తృతంగా ఉపయపోగించింది. వీటికి సాధారణంగా 455 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. చిట్టచివరిసారిగా వీటిని ఎర్ర సముద్రం నుంచి యెమెన్‌లోని కోస్టల్ రాడార్ సైట్ల మీద పెంటగాన్ ప్రయోగించింది. అమెరికా నౌకల మీద హౌతీ రెబెల్స్ క్షిపణిదాడులు చేయడంతో వారిని అడ్డుకునేందుకు వీటిని వేసింది. ఇక తాజాగా సిరియా వైమానిక స్థావరం మీద చేసిన దాడుల కోసం.. మధ్యధరా సముద్రంలో ఉన్న యుద్ధనౌకల మీద నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారు. తోమహాక్ క్షిపణులను ప్రయోగించాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దాదాపు 1600 కిలోమీటర్ల దూరం నుంచి వీటిని నౌకాదళం ప్రయోగించగలదు. అంత దూరంలో ఉన్న నౌకల మీదకు శత్రువులు తమ వాయుసేనతో వచ్చేందుకు కూడా వెంటనే అవకాశం ఉండదు. తోమహాక్ క్షిపణుల కంటే కూడా అమెరికా సైనిక విమానాలు ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలవు. కానీ, వాటిని తప్పనిసరిగా మనుషులే నడపాల్సి ఉంటుంది. శత్రుసేనలు వాటిమీద సులభంగా దాడి చేయగలవు. తోమహాక్ క్షిపణుల్లో కొన్ని క్లస్టర్ బాంబులను కూడా తీసుకెళ్లి, వాటిని టార్గెట్ మీద విరజిమ్మగలవు. దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా ధ్వంసం అవుతాయి. అయితే యుద్ధ విమానాల నుంచి వదిలే బాంబులు మరింత ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. ఒకవేళ యుద్ధవిమానాలు వాడాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకుంటే, అప్పుడు తప్పనిసరిగా నౌకాదళ విమానాలే వాడాల్సి ఉంటుంది. అంటే హారియర్ జెట్లు అన్నమాట. సిరియా సైన్యం ఎక్కువగా ఎస్-200 తరహా భూమ్మీద నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులను వాడుతుంది. అయితే, వాళ్లకు అండగా ఉన్న రష్యన్ సైన్యం మాత్రం ఎస్-300, ఎస్-400 తరహా క్షిపణులు వాడగలదు. ఇవి మామూలు వాటి కంటే చాలా వేగంగా వెళ్తాయి. వాటికి రాడార్ వ్యవస్థ కూడా ఉంటుంది. అమెరికా సైన్యం మాత్రం కొంతవరకు ఈఏ-18జి గ్రౌలర్ జెట్, ఇతర సాధనాలతో రష్యాన్ రాడార్లను జామ్ చేయగలదు. ఆ జామర్లను కూడా అధిగమించే సామర్థ్యం రష్యా దగ్గరున్న ఎస్-400 తరహా క్షిపణులకు ఉంటుంది. -
ఇది మాపై దురాక్రమణే: సిరియా
తమ సైనిక స్థావరంపై అమెరికా తోమహాక్ క్షిపణులతో దాడి చేయడాన్ని సిరియా తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా దురాక్రమణే అని సిరియా అధికారిక టీవీ చానల్ ప్రకటించింది. సిరియా రసాయన దాడులలో 70 మంది వరకు మరణించిన విషయాన్ని తీవ్రంగా ఖండించిన ఒక్క రోజు తర్వాతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడులకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులపై సిరియా అధ్యక్షుడు అసద్ అల్ బషర్ నేరుగా ఇంతవరకు స్పందించలేదు. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా దీనిపై ఇంకా ఎలాంటి స్పందనలు రాలేదు. కానీ, తాము ముందుగానే సిరియాలో ఉన్న రష్యా దళాలకు తమ దాడుల గురించి సమాచారం అందించామని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అక్కడ వైమానిక స్థావరంలో ఉన్న రష్యన్, సిరియన్ బలగాలకు ముప్పు వీలైనంత తక్కువగా ఉండేందుకు గాను అమెరికా సైనిక వ్యూహకర్తలు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారని కూడా ఆ ప్రకటనలో వివరించింది. -
సిరియా జైలుపై వైమానిక దాడి: 16 మంది మృతి
బీరట్: సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఇడ్లిబ్ నగరంలోని ఓ జైలుపై శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 16 మంది మరణించారు. మృతుల్లో జైలు ఖైదీలు, సిబ్బంది కూడా ఉన్నారని సిరియాలోని ఓ మానవ హక్కుల సంస్థ తెలిపింది. రష్యా దళాలు ఈ వైమానిక దాడి చేసినట్లు భావిస్తున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు రష్యా.. తిరుగుబాటు చేస్తున్న ప్రతిపక్షానికి టర్కీ మద్దతుగా ఉండటం తెలిసిందే. దాడి అనంతరం జైలు నుంచి కొంతమంది ఖైదీలు పారిపోతుండగా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లోనూ కొంతమంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఇడ్లిబ్ నగరంపై సిరియా, రష్యా, అమెరికా సంకీర్ణ దళాలు తరచుగా దాడులు చేస్తుంటాయి. సిరియాలో ఆరేళ్ల క్రితం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఘర్షణల్లో 3.2 లక్షల మంది మరణించారు. -
‘రిపీటయిందో.. ఇక మీ డిఫెన్స్ ధ్వంసమే’
జెరూసలెం: సిరియాకు ఇజ్రాయెల్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేసేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి అవిగ్దార్ లైబర్‌మాన్ నేరుగా హెచ్చరించారు. ఇటీవల సిరియా తమ యుద్ధ విమానాలను కూల్చివేసే ప్రయత్నం చేసిందని, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను తమ యుద్ధ విమానాలపైకి ప్రయోగించిందని ఆయన గుర్రుమన్నారు. ‘మరోసారి సిరియా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టంను మా విమానాలపైకి ప్రయోగిస్తే మేం ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఆ వ్యవస్థను ధ్వంసం చేసి పారేస్తాం’ అని లైబర్‌మాన్ ఘాటుగా హెచ్చరించారు. -
ఆ జైలులో 13 వేల మందికి దారుణ ఉరి
టెర్రరిస్టులకన్నా దారుణ హత్యలు లండన్ : సిరియాలో టెర్రరిస్టులు సాగిస్తున్న దారుణ మారణకాండ గురించే ఇంతవరకు మనం విన్నాం. వీడియోల్లో చూశాం. అంతకంటే దారుణాతి దారుణంగా బయటి ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వ ప్రోద్బలంతో సాగించిన మూకుమ్మడి మానవ హననానికి సంబంధించిన ఘోర కత్యాల గురించి ఇప్పుడు ‘ఆమ్నెస్టి ఇంటర్నేషనల్’ వెలుగులోకి తెచ్చింది. ఆ జైలులో రోజూ అర్ధరాత్రి పూట యాభై నుంచి అరవై మంది ఖైదీలను విచారణ పేరిట బయటకు ఎక్కడికో తీసుకెళతారు. వారు ఎప్పటికి తిరిగిరారనే విషయం తోటి ఖైదీలతోపాటు అక్కడి వారందరికి తెల్సిందే. ఎవరికి వారు మనసులో వారి ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటారే తప్ప, ఏమీ అనలేని నిస్సహాయ పరిస్థితి వారిది. అసలా అర్ధరాత్రి బయటకు వెళ్లినవారు ఏమవుతున్నారో తెలుసుకునేందుకు ఆమ్మెస్టీ జరిపిన దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగుచూశాయి. ఖైదీలను చీకటి బ్యార క్స్‌లోకి తీసుకెళతారు. మెడలకు తాడేసి ఉరి తీస్తారు. అప్పటికే సరైన తిండీ, నిద్ర లేక బక్కచిక్కిన ఖైదీల శరీరాలు వేలాడదీసిన ఎక్కువ సందర్భాల్లో వారి ప్రాణంపోదు. అలాంటి సమయంలో గార్డులు ఆ జీవచ్ఛవాలను బలంగా పట్టుకొని కిందకు లాగుతారు. అప్పుడు వారి తలల నుంచి మొండాలు ఊడిపోయి వస్తాయి. వాటికి తీసుకెళ్లి సామూహికంగా చీకట్లో ఖననం చేస్తారు. తమను ఇంత దారుణంగా ఉరితీస్తారన్న విషయం ఖైదీలకుగానీ, వారు ఏమయ్యారోనన్న విషయం వారి కుటుంబాలకు కూడా ఎప్పటికీ తెలియదు. రాత్రి పూట తీసే ఉరివల్ల ఒక్కసారే ప్రాణం పోతుంది. కానీ జైలు ఊచల గదుల్లో వారు క్షణం క్షణం మరణ వేదనను అనుభవించాల్సిందే. ఖైదీలను సైనికులే రేప్ చేస్తారు. తోటి ఖైదీలతోనీ రేప్ చేయిస్తారు. కర్రలు, రాడ్లతో చితకబాది రక్తం కక్కిస్తారు. రక్తం గడ్డకట్టిన, మురికితో కంపుకొడుతున్న నేలపైనే ఇన్ని మెతుకులేసి తినమని హుకుం జారీ చేశారు. తినకపోతే కొడతారు, తంతారు. పొద్దున లేవగానే విజిల్స్ వేసుకుంటూ సైనికులొస్తారు. ‘ఆ ఈ రోజు ఎంత మంది చచ్చార్రా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా!’ అంటూ ఖైదీలను ప్రశ్నిస్తారు. చనిపోయిన వారి శవాలను ట్రక్కులో చెత్తను మోసుకెళ్లినట్లు మోసుకెళతారు. ఇలా 2011 నుంచి 2015 సంవత్సరాల మధ్య 13వేల మందిని దారుణంగా హింసించి, ఉరితీసి చంపినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. డమస్కస్ నగారానికి 30 కిలోమీటర్ల దూరంలోని సయద్నాయ జైలులో జరిగిన ఈ దారుణాల గురించి మాజీ జడ్జీలు, మాజీ జైలు గార్డులు, తోటి ఖైదీలు సహా 84 మంది ప్రత్యక్షసాక్షుల ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ సమాచారాన్ని సేకరించింది. ఇంతకుముందు దేశవ్యాప్తంగా 17,500 మందిని అన్యాయంగా ఉరితీశారన్ని ఆమ్నెస్టీ లెక్కవేసింది. ఇప్పుడు ఒక్క జైలులోనే 13వేల మందిని ఉరితీయడం గురించి తెలియడంతో తమ అంచనాలు సరిచేసుకోవాల్సి ఉందని ఆమ్నెస్టీ అభిప్రాయపడింది. జైలు శిక్ష అనుభవిస్తున్నవారు, ఇలా దారుణంగా ఉరిశిక్షకు గురైన వారు టెర్రరిస్టులుకాదు, కరుడుకట్టిన నేరస్థులుకాదు. వారిలో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనను వ్యతిరేకిస్తున్న దేశ పౌరులు ఎక్కువ ‘ఖైదీలను ఉరి తీసినప్పుడు వారి బరువు సరిపోక ప్రాణం పోకపోతే గార్డులు వారి మోకాళ్లు పట్టుకొని కిందకు లాగేవారు. అలా లాగినప్పుడు కొన్నిసార్లు వారి మెడల నుంచి మొండాలి ఊడి వచ్చేవి. ఇలాంటివి నేను కళ్లారా చూశాను’ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ మాజీ జడ్జీ ఆమ్నెస్టీ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ జైలుకు మాత్రమే కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేసే వారని, ఖైదీలెవరూ ఎవరితో మాట్లాడకూడదని, గార్డులు వచ్చినప్పుడు ఎలాంటి పొజిషన్స్‌లో ఉండాలో కూడా నిబంధనలు ఉండేవని పదవి విరమణ చేసిన ఓ జైలు అధికారి తెలిపారు. రోజూ తిండీ తిప్పలు లేక, చిత్ర హింసలకు గురై ఇద్దరు, ముగ్గురు చనిపోయేవారని, ఒకటో నెంబర్ సెల్లో ఎంత మంది చనిపోయారు, రెండో నెంబర్ సెల్లో ఎంత మంది చనిపోయారంటూ గార్డులు తోటి వారిని ప్రశ్నించడం తాను వినేవాడినని జైలు నుంచి విడుదలైన నాదల్ తెలిపారు. ‘జైలు కింది గదుల్లో ఖైదీల మెడ నరాలు తెగిన శబ్దాలు, ప్రాణం పోతున్న మూలుగు వినిపించేది’ అని హమీద్ అనే మాజీ సైనికాధికారి తెలిపారు. తాము నివేదికలో పేర్కొన్న పేర్లు అసలు పేర్లుకాదని, వారి నిక్‌నేమ్‌లని, అసలు పేర్లు బయట పెట్టొద్దనే షరతుపైనే వారు ఈ విషయాలు వెల్లడించారని ఆమ్నెస్టీ తెలిపింది. ఆమ్నెస్టీ ఇంటర్వ్యూ చేసిన 84 మందిలో న్యాయవాదులు కూడా ఉన్నారు. ఈ దారుణాలు ఇప్పటికీ కొనసాగుతుండవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 2011లోనే దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమై అది అంతర్యుద్ధానికి దారితీసిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో నాలుగు లక్షల మంది ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి లెక్కలు తెలియజేస్తున్నాయి. -
మూడు లక్షల మంది మరణించారు
సిరియా యుద్ధం ప్రారంభమై దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో ఆ దేశంలోని కీలక భాగాలు నాశనమయ్యాయి. యుద్ధంలో ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది మరణించగా.. దేశ జనాభాలో సగానికిపైగా జనాభా శరణార్ధులుగా పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. భారీగా మరణాలు 2011 మార్చిలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నినాదాల నుంచి ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ గత వారం పేర్కొంది. వీరిలో 90 వేల మందికి పైగా పౌరులు ఉన్నట్లు తెలిపింది. యుద్ధానికి ముందు 23 మిలియన్లు జనాభా కలిగిన సిరియాలో యుద్ధం కారణంగా 6.6 మిలియన్ల జనాభా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పింది. శరణార్ధులు యుద్ధం కారణంగా 48 లక్షల మంది ప్రజలు సిరియాను వదిలి వెళ్లిపోయారని యూనైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(యూహెచ్ సీఆర్) పేర్కొంది. వీరిలో 27 లక్షల మంది పైగా టర్కీకి వలస వెళ్లారని చెప్పింది. టర్కీ తర్వాత లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టులు శరణార్ధులకు ఆశ్రయం కల్పించాయి. అయితే, పెద్ద సంఖ్యలో శరణార్ధులు యూరప్ చేరుకోవడానికి సముద్రమార్గాన్ని ఎంచుకుని ప్రాణాలు కోల్పోయారు. యూరప్ చేరుకున్న కొంతమంది శరణార్ధులను అక్కడ అధికారులు జైళ్లలో బంధించి చిత్రవధ చేశారు. దాదాపు 17,700 మంది యూరప్ జైళ్లలో మరణించగా, వేల మంది జీహాదిస్టుల చెరలో ప్రాణాలు వదిలారని యూహెచ్ సీఆర్ చెప్పింది. నాశమైన ఆర్ధిక వ్యవస్ధ సిరియా యుద్ధం కారణంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మూడు దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలకు గండి పడగా.. వసతులు, ఆరోగ్య, విద్యావ్యవస్ధలు సమూలంగా నాశనమయ్యాయి. సిరియా మొత్తం(కొన్ని ప్రాంతాల మినహా) విద్యుత్తు సౌకర్యం లేకుండా జీవనం సాగిస్తోందని ఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 2015లో చెప్పింది. 80శాతం జనాభా పేదరికంలో బతుకీడుస్తున్నారు. 2010 నుంచి 2015 మధ్యలో 55శాతం మేర సిరియా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలింది. -
అలెప్పోకు దాదాపుగా విముక్తి!
డెమాస్కస్: సిరియాలోని ఉగ్రవాదులకు, తిరుగుబాటుదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అలెప్పో నగరంలో సిరియా బలగాలు వారిని తుదముట్టించాయి. దాదాపు 93శాతం ప్రాంతాన్ని బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. ఇంకొన్ని ప్రాంతాలపై మాత్రమే పట్టుసంపాదించాల్సి ఉంది. ఇది పూర్తయితే, పూర్తిగా అలెప్పోకు తిరుగుబాటుదారుల నుంచి విముక్తి లభించినట్లవుతుంది. ఇప్పటికే దాదాపు 30వేల మంది అలెప్పో నగర పరిధిలోని పౌరులంతా ప్రభుత్వ రక్షణ దళాల సహాయంతో సురిక్షిత ప్రాంతాలకు తమ ఇంటిని, కట్టుకున్న బట్టలను వదిలేసి వెళ్లారు. తాజాగా మరికొన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తెచ్చుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్‌లో మరో మూడువేల మంది సౌకరి అనే ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. అలెప్పో పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వచ్చాక దాని రూపురేఖలు పూర్తిగా మార్చి వేస్తామని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ అన్నారు. -
అందం పాదాల్లో ఉంటుందా?
సిరియా శత్రుసైన్యం షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసింది. ద్వారం మూసుకొని పట్టణం లోపల ఉన్న ఇశ్రాయేలీయులకు ఆహారం, నీరు తదితర అత్యవసర సరుకులు అందకుండా చేశారు. సిరియా సైనికులు పట్టణం లోపల కొంత కాలానికి ఆహారం నిండుకుంది. తర్వాత పక్షులు, గాడిదలూ చంపుకొని తిన్నారు. పిదప తల్లితండ్రులు తమ పిల్లల్నే చంపుకొని తినేంత దౌర్భాగ్యకరమైన దుర్భర క్షామం పట్టణంలో నెలకొంది. ఈ క్రీడంతా దేవుడే చేశాడు. ఇక ఆయన్ను నేనెందుకు ప్రార్ధించాలంటూ ఎదురు తిరిగారు షోమ్రోను రాజు (2 రాజులు 6:33). దేవుడు ఇంత భయంకరమైన క్షామాన్ని 24 గంటల్లో తొలగించి రేపు ఈ వేళకు సమృద్ధి ఆహారాన్నిస్తాడని ఎలీషా ప్రవక్త చెప్పాడు. పట్టణం లోపల కరవు రూపంలో, వెలుపల శత్రువుల రూపంలో మృత్యువు సంచారం చేస్తూంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి ఆహారమిస్తాడా? అని ఎకసెక్కాలాడాడు ఒక అధికారి. ప్రవక్త మాటల్ని ఎవరూ నమ్మలేనంత నిరాకారమైన క్షామం అది. అయితే ఎవరు నమ్మినా నమ్మకున్నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చి తీరుతాడు. షోమ్రోనును చుట్టుముట్టిన సిరియా సైన్యంలో దేవుడు గందరగోళం సృష్టించాడు. ఇశ్రాయేలీయులు పెద్ద ఎత్తున దాడికి రానున్నారన్న భ్రమ కల్పిస్తూ గుర్రాలు, రథాల ఉరుకులు, పరుగుల ధ్వని వారికి వినిపించడంతో శత్రువులు తమ గుడారాల్లో రెండేళ్ల కోసం దాచుకున్న ఆహార సరుకుల్ని పడవేసి ప్రాణాలు దక్కించుకోవడానికి రాత్రికి రాత్రి పారిపోయారు. పట్టణం చుట్టూ శత్రువులు లేరు కాని వారు వదిలివెళ్లిన ఆహారం విస్తారంగా పడి ఉంది. దేవుణ్ణి నమ్మక, అది తెలియక పట్టణం లోపల ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. తన మాటల్ని రాజులు, అధికారులు, ప్రముఖులు నమ్మకపోతే దేవుడు కుష్ఠురోగులనైనా వాడుకుంటాడు. పట్టణం లోపలికి ప్రవేశార్హత లేని కుష్ఠు రోగులు నలుగురు ఆకలికి తాళలేక శత్రువుల వద్దనైనా ఆహారం దొరుకుతుందేమోనన్న ఆశతో సిరియన్ల శిబిరానికి వెళ్ళారు. అక్కడ శత్రువులెవరూ లేకపోగా వాళ్లు వదిలి వెళ్లిన ఆహారం కనిపించింది. కరువుతీరా తిన్నారు. అయితే అంత ఆహారాన్ని తామే తినాలనుకోవడం అన్యాయమనుకున్నారు. ఆహారం సమృద్ధిగా పడి ఉందన్న ‘సువార్త’ను ఆ నలుగురు కుష్ఠురోగులూ పరుగెత్తుకెళ్లి పట్టణంలో ప్రకటించగా వాళ్లంతా వచ్చి తినగలిగినంతా తిని ఇళ్లకు సమృద్ధిగా ఆహారాన్ని తీసుకెళ్లారు. దేవుడు చెప్పినట్టే 24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది. అయితే రాజులు అధిపతులు అవిశ్వాసులు కాగా, దేవుడు అంటరానివారు, పరమ వికారమైన వ్యక్తులైన కుష్ఠురోగులను వాడుకున్నాడు. అందాన్ని వ్యక్తుల ముఖారవిందాల్లో వెదుకుతుంది లోకం. కాని పదిమందికీ సాయం చేయడానికి ఉరుకులు పరుగులెత్తే పాదాలల్లోనే నిజమైన అందం ఉందంటాడు దేవుడు. ‘నాకు నా కుటుంబానికే అంతా కావాలనుకునేవాడు చూసేందుకు పైకి ఎంత అందగాడైనా పరమ వికారి అంటాడు దేవుడు. పక్కవాడికి, పదిమందికి లాభం కలగాలని పాకులాడేవాడు పరమ వికారంగా ఉన్నా, అతడు కుష్ఠురోగిౖయెనా అతనే నా దృష్టిలో అందగాడంటాడు దేవుడు. సమాధాన సువార్తను ప్రకటించేవారి పాదాలు ఎంతో సుందరమైనవని బైబిలు అందుకే చెబుతోంది (రోమా 10:14–15). – రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
నిన్ను చూసి గర్విస్తున్నా: ఒబామా
వాషింగ్టన్: ‘నువ్వు చాలా మంచివాడివి. నీలాగే అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నా’ అని ఆరేళ్ల బాలుడిని ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. సిరియా అంతర్యుద్ధం బాధిత బాలుడు ఒమ్రాన్ గురించి తనకు లేఖ రాసిన అలెక్స్ అనే అమెరికా బాలుడిని ఒబామా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన అధికారిక నివాసానికి ఆహ్వానించి అలెక్స్ తో మాట్లాడారు. అలెక్స్ తన కుటుంబ సభ్యులతో పాటు వైట్ హౌస్ కు వెళ్లి ఒబామాను కలిశాడు. ఒమ్రాన్ పట్ల అలెక్స్ చూపిన మానత్వానికి ఒబామా ముగ్దుడయ్యారు. చిన్నవయసులోనే అరుదైన వ్యక్తిత్వం కనబరిచిన అలెక్స్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సిరియా వైమానిక దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ ఫొటోను చూసి కదిలిపోయిన అలెక్స్ ఒబామాకు లేఖ రాశాడు. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. ఈ ఉత్తరాన్ని ఐక్యరాజ్యసమితిలో ఒబామా చదివి వినిపించారు. -
మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?
త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా రాబోతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికా.. రష్యాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ విషయం నేరుగా ప్రకటించకపోయినా.. దేశాధ్యక్షుల ప్రకటనలు, వాళ్ల సూచలను బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న రష్యా అధికారులు, రాజకీయ నాయకులు అందరూ తిరిగి స్వదేశానికి వచ్చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నందున వెంటనే తిరిగి వచ్చేయాలని అన్నారు. సిరియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు మరోసారి చెడిపోతున్నాయి. సిరియా విషయంలో అమెరికా మెప్పుకోసం ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని, అందుకే ఐక్యరాజ్య సమితి తీర్మానంపై వీటో చేసేందుకు తమను లాగుతోందని పుతిన్ ఆరో్పించారు. ఆ తర్వాతి నుంచి రష్యా, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలు కూడా చెడిపోయాయి. అలెప్పోలో యుద్ధ నేరాలకు పాల్పడిన సిరియన్ బలయగాలకు సాయం చేసేందుకు రష్యా వైమానిక దాడులు జరుపుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఆరోపించడంతో.. ఆయనతో జరగాల్సిన భేటీని పుతిన్ రద్దుచేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. త్వరలోనే పెద్ద యుద్ధం సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రష్యాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లావ్ బెల్కోవ్స్కీ అన్నారు. ఉద్రిక్తతలు మరింత పెరిగితే అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని రష్యా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎవ్‌గెనీ బుజిన్స్కీ చెప్పారు. సిరియా గురించి జరుగుతున్న చర్చల నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించుకున్నప్పటి నుంచి అమెరికా - రష్యా సంబంధాలు చెడిపోవడం మొదలైంది. దానికి తోడు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురి కావడం, దాని వెనుక రష్యా ప్రభుత్వం ఉందని చెప్పడంతో.. పరస్పర ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. -
సరిహద్దుల్లో బాంబు పేలుడు : 20 మంది మృతి
డెమాస్కస్: సిరియా - టర్కీ సరిహద్దుల్లోని బద్ అల్ సలమ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు సిరియా తిరుగుబాటుదారులని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. -
అలెప్పోపై వైమానిక దాడుల్లో 52 మంది మృతి
అలెప్పో: తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న సిరియా నగరం అలెప్పోలో శనివారం ప్రభుత్వం జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది పౌరులు మరణించారు. కాల్పుల విరమణ కోసం రాయబారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం ఫిరంగులు, వైమానిక దాడులు చేసి, చేయిజారిపోయిన నగరాన్ని తిరిగి తన అధీనంలోకి తీసుకోడానికి ప్రయత్నించింది. ఈ దాడులపై అంతర్జాతీయ సమాజం మౌనం వహించిందంటూ సిరియా ప్రధాన ప్రతిపక్షం నిరసన తెలిపింది. సిరియా, రష్యాలు కలిసి అలెప్పోలో నేరానికి పాల్పడుతున్నాయంది. ప్రజలు శిథిలాల్లో చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ కేంద్రం పేర్కొంది. ఆహారం కొనడానికి ఒక అంగడి ముందు వరుసలో నిల్చున్న ఏడుగురు సామాన్యులు ఈ దాడుల్లో మరణించారు. కొన్ని వీధులు నామరూపాల్లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అలెప్పోలో శుక్రవారం నాటి దాడుల్లో 47 మంది మరణించారు. పేలని రాకెట్లు ఇంకా వీధుల్లో అలాగే పడి ఉన్నాయి. ‘వైట్ హెల్మెట్స్’ అనే ప్రజా రక్షణ సంస్థ భవనం తీవ్రంగా ధ్వంసమైంది. మిగతా భవంతులన్నీ పూర్తిగా నేలమట్టమైపోయాయి. అలెప్పో నగరంలో రెండే అగ్ని మాపక వాహనాలున్నాయని, అవి నగరం మొత్తానికి తిరగడం కష్టంగా ఉందని ఈ కేంద్రం పేర్కొంది. విద్యుత్, ఇంధనం లేకపోవడంతో అలెప్పో అంధకారంలో చిక్కుకుపోయింది. శుక్రవారం ఉదయం వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. స్థానికులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు.