
యూరప్ లో ఓ సిరియన్ తల్లి గోస
- సోదర దేశాలుగా మీకు బాధ్యత లేదా?
- సిరియా శరణార్థుల అంశంలో గల్ఫ్ దేశాలపై ఫ్రాన్స్ మండిపాటు
- శీతాకాలంలో ఈయూ ద్వారాలు మూసేస్తామని వెల్లడి
పారిస్: సిరియా శరణార్థుల విషయంలో గల్ఫ్ దేశాలపై ఫ్రాన్స్ మండిపడింది. ఇప్పటికే లెక్కకు మించి శరణార్థులకు ఐరోపా దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయని, ఇకపై ఆ బాధ్యతను గల్ఫ్ దేశాలు పంచుకోవాలని సూచించింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుల్ వాల్స్ శుక్రవారం రాత్రి పారిస్లో మీడియాతో మాట్లాడుతూ సిరియాకు సమీపంగా ఉండే సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాలు శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో అలసత్వం వహించాయని, ఇప్పటికైనా ఆ దేశాలు వాటి బాధ్యత నిర్వర్తించాలన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు యూరప్ దేశాల్లో దాదాపు 8 లక్షల మంది సిరియన్లు ఆశ్రయం పొందుతున్నారని, వారందరికీ వసతులు కల్పించడం ఎలాంటి దేశానికైనా సవాలేనని, శీతాకాలంలో ఆ పని మరింత కష్టసాధ్యమని వాల్స్ అన్నారు.
నిరోధించలేని విధంగా శరణార్థులు వస్తుండటంతో సరిహద్దులు మూసివేయాలని ఈయూ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వాల్స్ తెలిపారు. ' నేను మళ్లీ మళ్లీ ఇదే చెప్తున్నా. ఇకపై యూరప్ లోకి శరణార్థులను అనుమతించబోం. అన్ని దేశాలు.. ప్రధానంగా గల్ఫ్ దేశాలు శరణార్థుల బాధ్యత పంచుకోవాలి. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే సరిహద్దులు మూసేస్తాం' అని వాల్స్ స్పష్టం చేశారు. సిరియాలో శాంతి స్థాపన ఒక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారమని, ఆ దేశంలో రాజకీయ సుస్థిరతకు ప్రపంచం సహకరించాలని వాల్స్ పిలుపునిచ్చారు.