మూడో రోజూ ఐసిస్‌పై వైమానిక దాడులు | French, Russian raids in Syria kill 33 IS terrorists in 72 hrs | Sakshi
Sakshi News home page

మూడో రోజూ ఐసిస్‌పై వైమానిక దాడులు

Published Thu, Nov 19 2015 2:45 AM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM

మూడో రోజూ ఐసిస్‌పై వైమానిక దాడులు - Sakshi

మూడో రోజూ ఐసిస్‌పై వైమానిక దాడులు

 సిరియాలో 33 మంది
 ఉగ్రవాదులు మృతి

 బీరుట్: ఫ్రాన్స్, రష్యా యుద్ధవిమానాలు ఉత్తర సిరియాలోని ఐసిస్ స్థావరమైన అల్-రాఖా, పరిసర ప్రాంతాలపై వరుసగా మూడో రోజు కూడా బాంబు దాడులు కొనసాగించాయి. ఆదివారం మొదలు మూడు రోజుల్లో 33 మంది ఉగ్రవాదులు చనిపోయారని, పదుల సంఖ్యలో గామపడ్డారని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్సర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ డెరైక్టర్ రామి అబ్దెల్ రహమాన్ బుధవారం తెలిపారు. అయితే.. దాడుల నుంచి చాలా మంది ఉగ్రవాదులు తప్పించుకున్నారని, విదేశీ ఉగ్రవాదుల కుటుంబాలు చాలా వరకూ అల్-రాఖా నుంచి ఇరాక్‌లోని మోసుల్ నగరానికి తరలిపోయాయని వివరించారు.
 
   పారిస్‌లో శుక్రవారం నాటి దాడి నేపథ్యంలో ఐసిస్ లక్ష్యంగా ఫ్రాన్స్ వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ప్రాన్స్ యుద్ధ విమాన వాహక నౌకను తూర్పు మధ్యధరాసముద్రానికి పంపింది. మరోవైపు.. గత నెలలో ఈజిప్టులో రష్యా విమానాన్ని కూల్చివేసింది తామేనని ప్రకటించిన ఐసిస్‌ను వేటాడటానికి రష్యా కూడా దాడులను తీవ్రం చేసింది. విమానం కూలిపోయి 224 మంది మరణించటానికి కారణం బాంబు దాడేనని రష్యా తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా.. తమపై దాడులకు ప్రతీకారంగా తమ వద్ద బందీలుగా ఉన్న ఒక చైనా జాతీయుడిని, ఒక నార్వే జాతీయుడిని హతమార్చామని ఐసిస్  ప్రకటించింది.
 
 అమెరికా, రష్యాలతో కలిసి మహా సంకీర్ణం
 ఫ్రాన్స్ ఇప్పుడు యుద్ధం చేస్తోందని.. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని ఆ దేశాధ్యక్షుడు హోలాండ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికా, రష్యాలతో కలిసి మహా సంకీర్ణం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఫ్రాన్స్‌లో విధించిన అత్యవసర పరిస్థితిని మూడు నెలలకు పొడిగించాలని నిర్ణయించారు.  
 
 టర్కీలో 8 మంది ఐసిస్ అనుమానితుల అరెస్ట్
 ఇస్తాంబుల్: ఐసిస్ సభ్యులుగా భావిస్తున్న 8 మంది అనుమానితులను టర్కీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారు శరణార్థుల పేరుతో ఈయూలోకి ప్రవేశించే ప్రణాళికలు రచిస్తున్నారని అధికారులు తెలిపారు. మొరాకో లోని కాసాబ్లాంకా నుంచి మంగళవారం విమానంలో ఇస్లాంబుల్‌కు వచ్చిన ఈ ఎనిమిది మందిని.. ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
 
 బాంబు బెదిరింపుతో ఫ్రాన్స్ విమానాల దారిమళ్లింపు
 అమెరికా నుంచి బుధవారం పారిస్‌కు బయల్దేరిన రెండు ఎయిర్ ఫ్రాన్స్ విమానాలను.. బాంబు బెదిరింపులతో దారి మళ్లించి క్షేమంగా దించారు. లాస్ ఏంజెలెస్ నుంచి 497 మందితో బయల్దేరిన ఫ్లైట్ 65 విమానం, వాషింగ్టన్ నుంచి   262 మందితో వెళ్లిన ఫ్లైట్ 55 విమానాలకు కాసేపటికే బాంబు బెదిరింపులు రావటంతో  దారిమళ్లించినట్లు ఎయిర్ ఫ్రాన్స్  తెలిపింది. వాషింగ్టన్ నుంచి వచ్చిన విమానాన్ని హాలిఫాక్స్‌కు, లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానాన్ని సాల్ట్ లేక్ సిటీకి మళ్లించారు. వాటిలో తనిఖీలు నిర్వహించి బాంబు ప్రమాదం లేదని నిర్ధారించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement