
ఇరాన్‌పై దాడికి ‘సిరియా’నాంది
‘శాంతి’ ఎంత బీభత్సంగా, వికృతంగా విలయ నర్తనం చేయగలదో సిరియాలో గత బుధవారం జరిగిన రసాయనిక ఆయుధ ప్రయోగం కళ్లకు కట్టింది. ఎప్పుడైనా మొద లు కావచ్చనిపించేలా ఉన్న సిరియా దురాక్రమణకు నాంది పాలస్తీనా ‘శాంతి చర్చలు’ కావడం విశేషం. పాలస్తీనా అథారిటీకి ఇస్తున్న 50 కోట్ల డాలర్ల వార్షిక సహాయాన్ని నిలిపేస్తామని బెదిరించి మొహ్మద్ అబ్బాస్‌ను శాంతి చర్చలకు ‘ఒప్పించింది’ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ. పాలస్తీనాలోకి అక్రమ వలసల విస్తరణను తాత్కాలి కంగా నిలిపివేసేందుకు కుదిరిన ఒప్పం దాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిన కారణంగా ‘శాంతి చర్చలు’ 2010లో నిలిచిపోయాయి.
అవి గత నెల 29న తిరిగి మొదలయ్యాయి. ఈ నెల 8న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరో వెయ్యి అక్రమ కాలనీల నిర్మాణానికి పచ్చ జెండా చూపారు. అందుకే నేటి చర్చలను పాలస్తీనీయులలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. ‘ఒకే దేశం (ఇజ్రాయెల్)’ పరిష్కారంతో పాలస్తీనానే లేకుండా చేసి ‘శాశ్వత శాంతి’ని సాధించాలని తపిస్తున్న నెతన్యాహూ ‘శాంతి’ కోసం హఠాత్తుగా తెగ తాపత్రయపడుతున్నారంటే అం దులో నిగూఢార్థం ఏదో ఉండి ఉంటుందనే అర్థం. అది సిరియాపై దురాక్రమణకు రంగం సిద్ధం చేయడమేనని డమాస్కస్ ‘రసాయనిక చేతబడి’ సూచిస్తోంది.
సిరియా సమస్యపై ‘నిర్ణయాత్మకం’గా వ్యవహరించడానికి నిర్ణయించిన అమెరికా అందుకు జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా మద్దతును కూడగట్టడం కోసమే పాలస్తీనా శాంతి చర్చల ప్రహసనానికి తెరదీసింది. సిరియాకు దక్షిణ, ఆగ్నేయ దిశల్లో విస్తరించిన జోర్డాన్ ఇప్పటికే సిరియా శరణార్థుల సమస్యను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్‌కు ఈశాన్యంగా ఉన్న జోర్డాన్, సిరియాపై దాడులకు ఆధారం కాగలుగుతుంది. సిరియాకు వాయవ్యంగా ఉన్న టర్కీ, బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని సైనిక చర్యతో కూలదోయాలని చాలా కాలంగా పట్టుబడుతోంది. సిరియాపై ముప్పేట దాడు లకు సన్నాహల్లో భాగంగానే ఇజ్రాయెల్... అసద్‌కు అనుకూలంగా పోరాడుతున్న హిజ బుల్లా బలగాలపై బాంబుల వర్షం కురిపిం చింది. ‘హిజబుల్లా ఉగ్రవాద స్థావరాలపై దాడుల’ పేరిట లెబనాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. హిజబుల్లా సంస్థ లెబనాన్ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగస్వామి! లెబ నాన్ సరిహద్దులను తటస్థం చేసి, టర్కీ, జోర్డాన్‌లను కేంద్రాలుగా చేసుకుని సిరి యాపై యుద్ధానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిట న్‌లు జోరుగా సన్నాహాలు చేస్తున్నాయి. సిరి యాపై దురాక్రమణ మొదలైతే వారికి అదో తాత్కాలిక మజిలీ మాత్రమే.
ఇదంతా అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకమైన ఊహాగానమేనని భావించేవారికి ఆదివారం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కనువిప్పు. ‘ఐరాస నిపుణులకు అనుమతిపై సుదీర్ఘ వాదోపవాదాల్లో ఇరుక్కోదలుచుకోలేదు. ఎందుకంటే అది అక్కడ విశ్వసనీయమైన నిర్థారణలు చేయలేకపోవచ్చు’ అన్న వైట్‌హౌస్ అధికారుల అభిప్రాయాన్ని అది బట్టబయలు చేసింది. ఒబామా బహిరంగంగానే అసంభవమని చెప్పిన ‘డమాస్కస్ తనిఖీ అనుమతి’ని అసద్ ఎలాంటి వాదోపవాదాలు లేకుండా ఆమోదించారనేది వేరే సంగతి. మార్చిలో అసద్ రసాయనిక ప్రయోగానికి ‘ఇదమిత్థమైన ఆధారాలు’ దొరికాయని ఒబామా చెప్పారు.
అప్పుడు కూడా అసద్ తనిఖీకి అంగీకరించారు. అసద్ బల గాలు తిరుగుబాటుదళాలపై నిర్ణయాత్మకం గా పైచేయి సాధించాయని అమెరికా మీడి యా సైతం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఘోషిస్తోంది. ఈ సానుకూల పరిస్థితుల్లో, ఐరాస నిపుణులు తనిఖీకి వచ్చిన సందర్భాన్ని ఏరి కోరి ఎంచుకొని, అదీ రాజధాని శివార్లలో రసాయనిక ఆయుధ ప్రయోగానికి పాల్పడడానికి అసద్ వెర్రివాడా?
‘అసద్ గెలిచినా లేదా నిలదొక్కుకున్నా ఇరాక్, సిరియా, లెబనాన్‌లపై ఇరాన్ వినూత్నమైన స్థాయిలో గొప్ప ప్రాబల్యాన్ని సంపాదిస్తుంది. ఇజ్రాయెల్ మునుపెన్నడూ ఎరుగనంతటి తీవ్ర ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ పట్టు మరింతగా బలపడి విస్తరిస్తుంది’ అని ఆదివారం ఆంటోనీ కార్డ్స్‌మాన్ అమెరికా అసలు సమస్య ఏమిటో విడమరిచారు. ఆం టోనీ సామాన్యుడు కాదు... అమెరికా దురాక్రమణ యుద్ధాలకు గొప్ప వత్తాసుదారైన ‘సెం టర్ ఫర్ స్ట్రేటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ నిపుణుడు. అమెరికా ముందున్న సమస్య చిన్నది కాదు... రూఢియైన ప్రపంచ చమురు నిక్షేపాలలో 20 శాతం ఇరాన్, ఇరాక్‌ల చేతుల్లోనూ, 48 శాతం గల్ఫ్‌లోనూ ఉన్నాయి! ‘దుష్టరాజ్యం’ ఇరాన్, దాని మిత్రుడు రష్యాల నుండి ‘ఆత్మరక్షణ’ కోసం యుద్ధానికి దిగక తప్పదు. అందుకే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఐరాస తీర్మానాల గొడవే లేకుండా సిరి యాపై యుద్ధానికి సకల సన్నాహాలు పూర్తి చేశాయి. కాకపోతే ఆశిస్తున్నట్టుగా దీర్ఘకాలిక యుద్ధంలో కూరుకుపోకుండా సిరియా యు ద్ధం నుంచి బయటపడగలమా? రష్యా, చైనా లు ఎలా ప్రతిస్పందిస్తాయి? అని తేల్చుకోలేకనే అమెరికా అధ్యక్షుడు వేచిచూస్తున్నారు.
పిళ్లా వెంకటేశ్వరరావు