వాతావరణ మార్పులపై రూపొందించిన ఒప్పంద ముసాయిదాపై 11 రోజులుగా మేధోమథనం జరుగుతోంది.
కాప్-21లో ‘భారత సూచన’లకు పట్టుబడుతున్న యూఎస్
పారిస్: వాతావరణ మార్పులపై రూపొందించిన ఒప్పంద ముసాయిదాపై 11 రోజులుగా మేధోమథనం జరుగుతోంది. దీనికి తుదిరూపు ఇచ్చేందుకు ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలుంది. అయినా ఇంత వరకు ఒప్పందంపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి సభ్యదేశాల మంత్రులంతా సమావేశం కానున్నారు. కాగా, భారత్ ప్రతిపాదించిన నియమాల అమలు అవసరమని.. దీనిపై సభ్యదేశాలు ఆలోచించాలని అమెరికా సూచించింది. బుధవారం నాటి ఒబామా-మోదీ ఫోన్ సంభాషణ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. భారత మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమయ్యారు.
సమావేశ వివరాలను వెల్లడించనప్పటికీ.. భేటీ సంతృప్తికరంగా సాగిందని.. పర్యావరణ మార్పులపై భారత్-అమెరికా సంయుక్తంగా పోరాటం చేయనున్నాయని జవదేకర్ తెలిపారు. భవిష్యత్ తరాలకు మంచి చేసేందుకు పారిస్ సదస్సు వేదికని జాన్ కెర్రీ తెలిపారు. అయితే.. ఉద్గారాల విషయంలో అందరూ ఒకతాటిపైనే ఉన్నా.. పేద దేశాలకు ఆర్థిక సాయం చేయటం, పర్యావరణ మార్పులతో నష్టపోతున్న దేశాలకు పరిహారం అందించటం విషయంలోనే ఏకాభిప్రాయం రావటం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. అయితే.. ఒప్పందంలో అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు పలు దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది.