సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ అధికారం నుంచి వైదొలగితేనే ఆ దేశంలో అంతర్యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా
మనీలా: సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ అధికారం నుంచి వైదొలగితేనే ఆ దేశంలో అంతర్యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యానించారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరుగుతున్న సదస్సు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ‘‘అసద్ అధికారంలో ఉండగా సిరియాలో అంతర్యుద్ధం ముగుస్తుందని నేను భావించడం లేదు. ఆయన హయాంలో అంతర్యుద్ధం, సాధారణ పౌరులపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆయన అధికారంలో ఉండేందుకు అక్కడి ప్రజలు అంగీకరించరు..’ అని పేర్కొన్నారు. అసద్‌కు గట్టి మద్దతుదారైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఒబామా భేటీ అయిన కొద్దిరోజులకే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసద్‌ను తొలగించాలని అమెరికా, దానికి అంగీకరించబోమని రష్యా గట్టి పట్టుదలతో ఉన్నాయి. కానీ ఈ భేటీ సందర్భంగా ఇద్దరూ సిరియాపై ఓ ఒప్పందానికి వచ్చారని, అందువల్లే అసద్‌ను తొలగించాలంటూ ఒబామా చెప్పారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.