'ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వదిలేది లేదు'
న్యూయార్క్: ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని మాత్రం అడ్డుకోవడం జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి స్పష్టం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కుట్రలను ఏ దేశంలోనైనాన చేధించడానికి తాము సిద్ధమని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై తమ దేశ భద్రతా బృందానికి సూచనలు చేసిన సందర్భంగా ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు.
'మా అధ్యక్షుడు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు ఇసిల్(ఇస్లామిక్ స్టేట్ మరోపేరు)ను గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
అవసరం అయితే, ఇతర దేశాల్లో ఆ ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను కూడా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు' అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇసిల్ ముఖ్యంగా పరిపాలన బలహీనంగా ఉన్న లిబియా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకొని తన దాడులకు కేంద్ర స్థానంగా మార్చుకుంటున్నందున అలాంటి దేశాలకు పాలన పరమైన సహాయం కూడా చేసి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రపంచంలో తమతో దౌత్యపరమైన సంబంధాలు ఉన్న దేశాలన్నింటితో కలిసి సాగేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఉగ్రవాదం విషయంలో తమ ముందున్న సవాళ్లను గురించి అమెరికా ప్రజలతో చాలా స్పష్టంగా ఒబామా మాట్లాడారని, అయితే, అది తమ దేశాన్ని ఏమీ చేయలేదని కూడా వారికి భరోసా ఇచ్చినట్లు చెప్పారు.