ఇండియాలోని అమెరికన్లకు హెచ్చరిక
వాషింగ్టన్: రకరకాల కారణాలతో ఇండియాలో ఉంటోన్న తన పౌరులకు అమెరికా కీలక సూచనలు చేసింది. భారత్ లో ఉంటోన్న అమెరికన్లు సాధ్యమైనంతమేరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దని, జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో సంచరించొద్దని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటన జారీచేసింది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విరుచుకుపడొచ్చనే అనుమానంతోనే అమెరికా ప్రభుత్వం తన పౌరులను హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాక్ లో ఐసిస్, అమెరికా సంకీర్ణ సైన్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అమెరికా సేనలతో కలిసి ఇరాకీ ఆర్మీ మంగళవారం ఐసిస్ కేంద్ర స్థానమైన మోసుల్ నగరంలోకి ప్రవేశించడంతో యుద్ధం తారాస్థాయికి చేరినట్లయింది.
వీలైనన్ని దారుల్లో శత్రువును దెబ్బతీయాలనుకునే ఐసిస్.. అన్ని దేశాల్లోని అమెరికన్లను టార్గెట్ చేసుకునే అవకాశంఉంది. ఇండియాలోనూ ఐసిస్ ఆ తరహా దాడులకు పాల్పడవచ్చనే అనుమానాల నడుమ తాజా హెచ్చరికలు జారీ అయినట్లు తెలిసింది. కాగా, దీనిపై భారత ప్రభుత్వం స్పందించాల్సిఉంది.