ఒబామా చిన్న కూతురు జాబ్ లో చేరింది..!
అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా చిన్న కూతురు వేసవి సెలవుల సందర్భంగా పార్ట్ టైం జాబ్ లో చేరింది. పదిహేనేళ్ళ వయసులో సగభాగం వైట్ హౌస్ లోనే లగ్జరీగా గడిపిన సాషా ఒబామా.. సమ్మర్ హాలీడేస్ హాయిగా గడిపేయకుండా జీవితానికి కావలసిన మరింత పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మీడియా రంగంలో సెటిలవ్వాలనుకున్న పెద్ద కూతురు మలియా ఒబామా.. గతేడాది సమ్మర్ హాలీడేస్ లో అనుభవంకోసం మీడియాలో పనిచేయగా... ప్రస్తుతం చిన్న కూతురు.. సాషా ఒబామా ఓ రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయింది.
ఫ్రైడ్ సీ ఫుడ్, మిల్క్ షేక్ లకు ప్రతీతి చెందిన మార్తాస్ వైన్యార్డ్ లోని ఫుడ్ జెయింట్.. నాన్సీ రెస్టారెంట్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. బ్లూ షర్ట్- హ్యాట్ ఖాకీ బ్యాంక్స్ వేసుకొని కస్టమర్ల ఆర్డర్లు తీసుకుంటూ సాషా కనిపించడం.. ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది. రెస్టారెంట్లో ఉన్న సమయంలో సాషా ఒబామా.. తన పూర్తి పేరైన నటాషాను వినియోగిస్తోంది. ఆమెకు వేసిన షిఫ్టుల ప్రకారం ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా ఆమెకు భద్రత కోసం పని చేస్తున్నారు. అయితే ఓ సర్వర్ గా పనిచేస్తున్న ఆమెకు.. తోడుగా ఆరుగురు పనిచేస్తున్నారేంటి చెప్మా.. అంటూ.. ముందుగా తామంతా ఆశ్చర్యపోయామని, ఆ తర్వాత ఆమె ఎవరు అన్న అసలు విషయం తెలిసిందని రెస్టాటరెంట్లోని ఇతర సర్వర్లు చెప్తున్నారు.
ఎప్పుడు మార్తాస్ వైన్యార్డ్ సందర్శించినా ఒబామా దంపతులు నాన్సీకే వెడుతుంటారు. ఒబామా కు ఎంతో ఇష్టమైన నాన్సీ రెస్టారెంట్లోనే ఆయన కూతురు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తుండటం విశేషం. రెస్టారెంట్లో నాలుగు గంటలపాటు కొనసాగే సాషా షిప్టు.. ఉదయమే ప్రారంభమౌతుంది. అయితే సాషా పనిచేస్తున్న నాన్సీ యజమాని మౌజబ్బర్.. ఒబామా మంచి స్నేహితులు కావడంతోనే సాషా సమ్మర్ జాబ్ కు అక్కడ చేరినట్లు తెలుస్తోంది.