ఒబామాకు అరుదైన గౌరవం
ఒబామాకు అరుదైన గౌరవం
Published Sat, Sep 3 2016 10:55 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల గుర్తించిన అరుదైన జాతికి చెందిన చేప పేరులో 'ఒబామా' చేర్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే ఈ గౌరవం ఆయనకు ఊరికే దక్కింది కాదు. గతవారం హవాయ్లోని ఓ మెరైన్ సాంక్షుయరీ విస్తీర్ణం పెంచుతూ ఒబామా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సాంక్షుయరీ విస్తీర్ణం గతంలో కంటే నాలుగింతలు పెరుగుతోంది. అంతేకాదు.. ప్రపంచంలోనే పెద్ద మెరైన్ సాంక్షుయరీగా అది రికార్డులకెక్కింది. దీంతో జంతు శాస్త్రవేత్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇటీవల గుర్తించిన ఇంకా పేరుపెట్టని చేపకు ఒబామా పేరును చేర్చుతున్నట్లు వారు వెల్లడించారు.
హవాయ్లోని పపహనౌముకాకియా మెరైన్ సాంక్షుయరీలోనే శాస్త్రవేత్తలు ఈ చేపను కనుగొన్నారు. ఈ చేపకున్న మరో విశేషం ఏమిటంటే.. ఒబామా ప్రచార సింబల్కు దగ్గరగా ఈ చేపపై కొన్ని గుర్తులున్నాయట. సముద్ర జీవులను రక్షించడానికి ఒబామా తీసుకున్న నిర్ణయానికి గుర్తుగా ఆయనకు ఈ గౌరవమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అన్నట్లు ఓ చేపకు ఒబామా పేరునుపెట్టడం ఇదే తొలిసారికాదు. గతంలోనూ టెనెస్సీ నదిలో కనుగొన్న ఓ చేపకు ఇథియోస్టోమా ఒబామా అనే పేరుపెట్టారు.
Advertisement
Advertisement