
బీజింగ్ : చైనాలో అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కడుపులో నుంచి వైద్యులు వంద చేప ముళ్లు బయటకు తీశారు. దాదాపు 2గంటలపాటు కష్టపడి సూదుల్లాంటి వాటిని జాగ్రత్తగా తొలగించారు. తమ వైద్య చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన ఆపరేషన్ అని వారు ఈ సందర్భంగా చెప్పారు. మరికాస్త వివరాల్లోకి వెళితే.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి రెండు బాయిల్డ్ చేపలను తిన్నాడు. వాటి ముళ్లులు ఎలాగో అరిగిపోతాయని సరిగా నమలకుండానే మింగేశాడు.
అయితే, రెండు మూడు రోజుల తర్వాత అతడి జీర్ణ వ్యవస్థలో మార్పు వచ్చింది. పెద్ద పేగులో విపరీతమైన నొప్పి ఏర్పడింది. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు స్కాన్ చేశారు. అందులో ఓ ముళ్ల గుత్తిలాంటిది ఉన్నట్లు గుర్తించారు. అది జీర్ణ వ్యవస్థకు అడ్డుగా ఉండటంతోపాటు ఇతర సమస్యలను కూడా కలిగిస్తోందని గుర్తించి ఆపరేషన్ చేయగా దాదాపు 100 చేప ముళ్లులు బయటపడ్డాయి. అతడు చేపను పూర్తిగా నమలకుండా మింగే ప్రయత్నం చేయడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు వైద్యులు చెప్పారు.