కోల్‌కతా: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బాధితురాలి తల్లిదండ్రుల వ్యాఖ్యలను దీ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వంపై అపనిందలు వేసే ప్రయత్నమంటూ మండిపడ్డారు.
‘బాధితురాలి తల్లిదండ్రులకు మేము ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదు. ఒక నిండు జీవితాన్ని డబ్బు ఎప్పటికీ భర్తీ చేయలేదు. కానీ, వారి కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా మంచి పని చేయాలని భావిస్తే.. వారికి మా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చా. ఆ విషయంలో వారు నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలుసు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సీఎం దీదీ వ్యాఖ్యలను హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లి ఖండించారు. మమతా బెనర్జీ అబద్దం చెబుతున్నారని ఆరోపించారు. వారికి డబ్బులు ఇవ్వాలని చూశారని మరోసారి పేర్కొన్నారు.
ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం మమతా అబద్ధాలు చెబుతున్నారు. నష్టపరిహారం ఇప్పిస్తానని, మీ కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చని మాతో చెప్పారు. నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు నేను మీ ఆఫీసుకు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పాను’ అని తెలిపారు.
అదే విధంగా హత్యాచారం అనంతరం చేపట్టిన నిరసనలను అణచివేసేందుకు సీఎం మమతా ప్రయత్రించారని ఆమె ఆరోపించారు. తమ నిరసనలు ఆపాలని, రాబోయే దుర్గా పూజ ఉత్సవాలకు సిద్దం కావాలని సూచించారని పేర్కొన్నారు. అయితే దీదీ అలా మాట్లాడటం అమానవీయమని అన్నారు. తాను ఒక ఆడపిల్లకు తల్లినైనందున ఇది అమానుషంగా భావిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment