ఒబామా వరస్ట్ ప్రెసిడెంట్ః ట్రంప్
వాషింగ్టన్ః రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒబామాను టార్గెట్ చేశారు. ఆమెరికా చరిత్రలోనే ఒబామా లాంటి వరస్ట్ ప్రెసిడెంట్ లేడంటూ విరుచుకు పడ్డారు. అతడు అసలు అధ్యక్షపదవికే పనికి రాడని, ఓ భయంకరమైన విపత్తులాంటి వ్యక్తి అంటూ నోటికొచ్చిన పదాలన్నీ వాడుతూ అక్కసు వెళ్ళగక్కారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. ఒబామా ఓ భయంకరమైన వ్యక్తి అంటూ అభివర్ణించారు. ఒబామాలాంటి చెత్త అధ్యక్షుడు అమెరికా చరిత్రలోనే లేడని విమర్శలు గుప్పించిన ట్రంప్... వెంటనే అధ్యక్షపదవికి ఒబామా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రిపబ్లిన్ అభ్యర్థిగా తనకు నామినేషన్ కూడా లభించదన్నారని, తర్వాత తాను గెలిచే అవకాశం లేదన్నారని, ఉన్నట్లుండి తనదే విజయం అని కూడా చెప్తారంటూ ఒబామాపై విమర్శనాస్థ్రాలు సంధించారు. రిపబ్లికన్ అభ్యర్థి ప్రెసిడెంట్ పదవికి అన్ ఫిట్ అంటూ గతవారం ట్రంప్ పై ఒబామా చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించిన ఓ బ్రాడ్ కాస్టింగ్ గ్రూప్ ఇంటర్వూల్లో ట్రంప్.. ఒబామాపై తనదైన రీతిలో స్పందించారు.
మరోవైపు డెమొక్రెటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను సైతం ట్రంప్ దెయ్యంతో పోల్చిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు దుష్ట హిల్లరీగా సంబోధిస్తున్న ఆయన తాజాగా ఆమెను దెయ్యం అనడం కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ ప్రత్యర్థులు రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్న ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో సైతం రిగ్గింగ్ జరుగుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.