అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024, నవంబర్ 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ మధ్యేనే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. ఇదిలావుండగా అమెరికాను ఇప్పటి వరకూ ఏలిన మొత్తం 45 మంది అధ్యక్షులలో డొనాల్డ్ ట్రంప్ అత్యంత చెత్త అధ్యక్షునిగా అభివర్ణిస్తూ ఒక సర్వే ఫలితాలు వెలువడ్డాయి.
ఈ జాబితాలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 14వ స్థానంలో నిలిచారు. అంతర్యుద్ధాన్ని ఆపడంలో లేదా ఆ పరిస్థితి నుండి బయటపడేయడంలో విఫలమైన వారి కంటే కూడా డొనాల్డ్ ట్రంప్ వెనుకబడి ఉన్నారు. ఈ సర్వేను నిర్వహించిన రాజకీయ విశ్లేషకులు జస్టిన్ వాన్, బ్రాండన్ రోటింగ్‌హాస్ మాట్లాడుతూ బైడెన్ సాధించిన విజయాలలో.. ట్రంప్ నుండి అధ్యక్ష పదవిని కాపాడటమే ప్రధానమైనదని పేర్కొన్నారు.
యూనివర్శిటీ ఆఫ్ కోస్టల్ కరోలినాకు చెందిన వాన్, హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన రోటింగ్‌హాస్ తదితర 154 మంది రాజకీయ విశ్లేషకులు ఈ సర్వే నిర్వహించారు. వీరు అమెరికన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్‌తో సత్సంబంధాలు కలిగివున్నారు. అమెరికాలోని ఉత్తమ అధ్యక్షునిగా అబ్రహం లింకన్ నిలిచారు. ఆయన దేశంలో బానిసత్వాన్ని నిర్మూలించడంతోపాటు అంతర్యుద్ధం సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించాడని విశ్లేషకులు పేర్కొన్నారు. మరో ఉత్తమ అధ్యక్షునిగా ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ నిలిచారు. ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు సరైన మార్గనిర్దేశం చేశాడని విశ్లేషకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment