యూఎస్ దాడిలో ధ్వంసమైన మసీదు శిధిలాలకింద మృతుల కోసం గాలిస్తున్న సిరియన్లు.
- ఐసిస్ పేరుతో అమాయకులపై భీకరదాడులు
- సిరియాలో ప్రతిరోజూ పదులకొద్దీ శవాలు.. హక్కుల సంస్థల ఆందోళన
అలెప్పో/లండన్: అసద్ ప్రభుత్వాన్ని గద్దెదించడమేకాక ఐసిస్ ను రూపుమాపే ఉమ్మడి లక్ష్యంతో సిరియాపై అమెరికా చేస్తోన్న యుద్ధం గతి తప్పింది. అమెరికన్ యుద్ధ విమానాలు జారవిడుస్తోన్న బాంబులు అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నాయి. సిరియా ఉత్తర భాగంలోని పలు పట్టణాల్లో అమెరికన్ డ్రోన్లు జరిపిన బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో జనం చనిపోయారు.
ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న అల్-బుకామల్ పట్టణంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 23 మంది మృతిచెందారు. వీరిలో 13 మంది పౌరులతో పాటు, ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఉన్నట్లు సిరియన్ అబ్వర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. అదే పట్టణంలో అల్-హమర్ అనే ఆయిల్ ఫీల్డ్‌లో జరిపిన వైమానికి దాడిలో మరో ఏడుగురు చనిపోయారు. ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 12 మిస్సైళ్లను సంకీర్ణ బలగాలు ప్రయోగించాయి.
మసీదుపై దాడి.. 50మంది హతం
అల్ జినా పట్టణంలోని ఓ మసీదుపై అమెరికా డ్రోన్లు జరిపిన బాంబు దాడుల్లో 50 మంది చనిపోయిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మార్చి 16న చోటుచేసుకున్న ఈ ఘటన ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని, దీనిపై అమెరికా సమాధానం చెప్పాలని హ్యుమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. పెంటగాన్ వర్గాలు సైతం ఈ ఘటనపై వివరణ ఇచ్చాయి. మసీదు వెనుక భాగంలో అల్ కాయిదా ఉగ్రవాద నాయకులు దాక్కున్నారనే సమాచారంతోనే దాడి చేశామని, ఆ సమయంలో అక్కడ సాధారణ పౌరులెవరూ లేరని పెంటగాన్ అధికారులు తెలిపారు. కాగా, ఈ వివరణ సత్యదూరమని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపిస్తోంది. ప్రత్యక్ష సాక్షులతో తాము మాట్లాడినట్లు ఆ సంస్థ తెలిపింది.