
సిరియాపై యుద్ధమేఘాలు
డమాస్కస్: సిరియాపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక చర్యలకు సిద్ధమవుతున్నాయి. సిరియాలోని సైనిక స్థావరాలపై గురువారం దాడులు చేసే అవకాశముందని అమెరికా సీనియర్ అధికారులు ‘ఎన్‌బీసీ’ టీవీ చానల్‌కు చెప్పారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాల నుంచి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించే అవకాశముందని రాజకీయ నిపుణులు తెలిపారు. అమెరికా, దాని మిత్రదేశాలు యుద్ధ సామగ్రిని సిరియా సమీపానికి తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ బుధవారం అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ఫోన్లో చర్చలు జరిపారు. సిరియాపై దాడికి బ్రిటన్ పార్లమెంటు అనుమతి తీసుకునే అంశంపై మాట్లాడారు. దాడికి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి మద్దతు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
మరోపక్క.. డమాస్కస్‌లో ఈ నెల 21న వందలాది మంది మృతికి కారణమైన రసాయన దాడికి పాల్పడింది సిరియా ప్రభుత్వ బలగాలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జోసఫ్ బిడెన్ స్పష్టం చేశారు. దాడి సిరియా ఆర్మీ పనేనని ‘నాటో’ కూడా ప్రకటించింది. తమ దేశంపై దాడి చేస్తే దీటుగా ఎదుర్కొంటామని సిరియా, సిరియాపై దాడి చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదురువుతాయని రష్యా, ఇరాన్‌లు హెచ్చరించడం తెలిసిందే. కాగా, సిరియాపై ఏకపక్ష దాడి చేయబోమని, సైనిక చర్యపై మిత్రదేశాలతో చర్చిస్తున్నామని అమెరికా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తాము దాడి చేస్తే సిరియా మళ్లీ రసాయనిక దాడి జరిపే అవకాశముందన్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో సిరియాలోని లటాకియా నగరం నుంచి వంద మందికిపైగా తమ దేశీయులను రష్యా మంగళవారం విమానాల్లో స్వదేశానికి తరలించింది. సిరియా సమస్యకు దౌత్యమార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ సూచించారు.
ట్విట్టర్, న్యూయార్క్ టైమ్స్ వెబ్‌సైట్ల హ్యాకింగ్..
వాషింగ్టన్: సిరియాపై అమెరికా దాడి చేయనుందన్న వార్తల నేపథ్యంలో అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్, హఫింగ్టన్ పోస్ట్, ట్విట్టర్ సంస్థల వెబ్‌సైట్లు మంగళవారం కొన్ని గంటలపాటు హ్యాక్ అయ్యాయి. సిరియా అధ్యక్షుడు అసద్‌కు మద్దతిస్తున్న ‘సిరియన్ ఎలక్ట్రానిక్ ఆర్మీ’ అనే బృందం వీటిని హ్యాక్ చేసింది. దేశం వెలుపల నుంచి హ్యాకింగ్ జరగడంతో తమ వెబ్‌సైట్‌ను కొన్ని గంటలపాటు మొరాయించిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించిన తర్వాత మళ్లీ హ్యాకింగ్ చేశారని, వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.