
పాపం... పసివాడు!
ఈ ఫోటో చూడగానే 'అయ్యో పాపం...' అంటూ చలించని హృదయం ఉండదు. సురక్షిత జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి సిరియాను వదిలి మధ్యదరా సముద్రం మీదుగా యూరోప్‌కు ప్రయాణమైంది వీరి కుటుంబం. ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు, కుర్దు సాయుధుల మధ్య సిరియా నలిగిపోతోంది. నిత్యం బాంబుల మోతలు, తుపాకుల గర్జనలే. ఇక ఇక్కడ ఉండలేమనే భావనతో పుట్టినగడ్డను, ఆస్తిపాస్తులను వదిలేసి వేలాది మంది ప్రాణాలకు తెగించి చిన్నచిన్న బోట్లలో మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేస్తున్నారు. జనాన్ని అక్రమంగా తరలించే ముఠాల అత్యాశతో బోట్లు కిక్కిరిసిపోతున్నాయి. కల్లోల సముద్రంలో ఈ బోట్లు మునిగిపోతున్నాయి. వేల మంది చనిపోతున్నారు.
సిరియాలోని కొబాని పట్టణానికి చెందిన అబ్దుల్లా, తన భార్య రేహన్, కుమారులు అయలాన్ కుర్దీ (3), గాలిప్ (5)లతో ఇలాగే దేశం వదిలాడు. టర్కీకి వచ్చి గ్రీస్‌లోని కోస్‌కు వెళ్లేందుకు బోటు ఎక్కాడు. వీరి పడవ మునిగిపోయి 12 మంది చనిపోయారు. అబ్దుల్లా ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ... కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. భార్య, ఇద్దరు పిల్లలు నీట మునిగి చనిపోయారు. అయలాన్ కుర్దీ మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది. దీన్ని చూసిన ప్రపంచం నివ్వెరపోయింది. బాధతో విలవిల్లాడింది. పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. సోషల్ సైట్లలో ఎందరో అశ్రుతర్పణాలు అర్పించారు. యూరోప్ దేశాధినేతలంతా స్పందించారు.ప్రస్తుతానికి ఏడాదికి 32 వేల మందిని ఆశ్రయం కల్పిస్తున్న యూరోప్ దేశాలు ఈ సంఖ్యను మరింత పెంచడానికి సిద్ధమని ప్రకటించాయి. మొత్తం లక్షా అరవై వేల మంది యూరప్‌లోని శరణార్థుల శిబిరాల్లో తలదాచుకున్నారు.