
మానవత్వం ఓడిన వేళ...
మానవత్వం ఓడిన తీరును కళ్లకు కట్టి ప్రపంచాన్ని కంటతడి పెట్టించిన చిన్నారి అయలాన్ కుర్దీ అంత్యక్రియలు శుక్రవారం సిరియాలోని కోబాన్ పట్టణంలో పూర్తయ్యాయి. టర్కీ నుంచి సిరియా సరిహద్దుల వరకు ప్రత్యేక విమానంలో రేహన్, ఇద్దరు పిల్లల మృతదేహాలను తరలించారు. జర్నలిస్టులు, టర్కీ ఎంపీలు వెంటరాగా... తండ్రి అబ్దుల్లా సొంతపట్టణానికి చేరుకొని బంధు, మిత్రుల సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దామనే మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేశానని... ఇప్పుడు నాకంటూ ఏమీ మిగల్లేదు గనక ఇక ఎక్కడికీ పోనని అబ్దుల్లా రోదిస్తూ చెప్పారు. 'ప్రపంచ దేశాలన్నింటినీ తనకిచ్చినా (ఎక్కడైనా నివసించే అవకాశం కల్పించినా) నాకేమీ వద్దు. అత్యంత విలువైనదే కోల్పోయాను' అంటూ గద్గదస్వరంతో అన్నారు. టర్కీ తీరంలో అయలాన్ మృతదేహం యూరోప్ దేశాధినేతలను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజానీకంలో సానుభూతి వెల్లువెత్తింది. ఏళ్లుగా నలుగుతున్న సిరియా శరణార్థుల సమస్యను ప్రపంచం దృష్టికి తెచ్చింది.
2 లక్షల మందికి నీడ ఇవ్వండి
బ్రస్సెల్స్: యూరప్‌కు వస్తున్న వలసదారులు ప్రమాదాల్లో చనిపోతున్న నేపథ్యంలో 2 లక్షల మంది శరణార్థులకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలన్నీ కలసి ఆశ్రయమివ్వాలని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ అంటోనియో గటై పిలుపునిచ్చారు. అయలాన్ మృతదేహం దొరికిన తీరు ప్రపంచ ప్రజల్ని కలచి వేసిన తరుణంలో స్పందించకుండా ఉండకూడదన్నారు. కాగా, శరణార్థులకు ఆశ్రయమివ్వడానికి జర్మనీ, ఫ్రాన్స్ అంగీకరించాయి. గ్రీస్, ఇటలీ, హంగరీ దేశాలపై శరణార్థుల భారం తగ్గించేందుకు 1.2 లక్షల మందికి పునరావాసం కోసం ఒక ప్రణాళికను వచ్చేవారంలో ఈయూ విడుదల చేయనుంది. అధిక సంఖ్యలో శరణార్థులకు ఆశ్రయమిస్తామని బ్రిటన్ తెలిపింది.