పాట్నా: బిహార్‌లో జివుతియా పండుగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో 46 మంది నీట మునిగి మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు.
కాగా బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ‘జీవిత్‌పుత్రిక’ పండుగ జరుపుకున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతో పాటు పిల్లలతో కలిసి నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు.
వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీసినట్లు విపత్తు నిర్వహణ విభాగం(డీఎండీ) అధికారులు తెలిపారు. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.
ఈ విషాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని సీఎం నితీష్‌కుమార్ వెల్లడించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment