aylan kurdi
-
ప్రపంచాన్ని కుదిపేసిన ఫొటోనే ఇలా..
ఎర్రచొక్కా, నీలిరంగు నిక్కరు ధరించిన నాలుగేళ్ల సిరియా బాలుడు ఆయలాన్ కుర్దీ మృతదేహం టర్కీ బీచ్‌కు కొట్టుకొచ్చిన ఫొటో లక్షలాది మంది ప్రజల హృదయాలను కదిలించింది. అనేకమందికి కన్నీళ్లు తెప్పించిన ఆ విషయం గుర్తుండే ఉంటుంది. కన్నీళ్లు కారుస్తున్న నిశ్శబ్ద ప్రకృతి మధ్య ఇసుకపై బోర్లాపడిన బాలుడి చెంపలను అలలు తాకుతున్నట్లుగా కనిపించే ఫొటో సోషల్ మీడియాలో ఐదు నెలల క్రితం విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు సృష్టిస్తున్న మారణకాండ నుంచి తప్పించుకునేందుకు యూరప్ బాట పట్టిన సిరియా, ఇరాక్ శరణార్థుల గురించి మొట్టమొదటి సారిగా ప్రపంచం పట్టించుకోవడానికి ఈ ఫొటోనే కారణమైంది. అచ్చం ఆ ఫొటోలో కనిపించినట్లుగా ఆ బాలుడి విగ్రహాన్ని చెక్కారు ఫిన్లాండ్కు చెందిన ప్రముఖ శిల్పి పెక్కా జిల్హా. 'అంటిల్ ది సీ షెల్ హిమ్ ఫ్రీ' అని దానికి టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ బాలుడి విగ్రహాన్ని టర్కీ రాజధాని హెల్సింకీ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఏర్పాటుచేశారు. బాలుడు ఆయలాన్ కుర్దీ, అతడితో పాటు తండ్రి మినహా ఐదుగురు కుటుంబ సభ్యుల మరణానికి కారణమైన ఇద్దరు మానవ అక్రమ రవాణాదారులు టర్కీ జైల్లో ఉన్నారు. వారిపై విచారణ కొనసాగుతోంది. నేరం రుజువైతే వారికి 35 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. సిరియా, ఇరాక్ ప్రాంతాల నుంచి వచ్చిన శరణార్థులు టర్కీ నుంచి యూరప్‌కు వెళుతూ వందలాది మంది సముద్రంలో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. టర్కీ అధికార లెక్కల ప్రకారమే గత ఒక్క నెలలోనే 400 మంది శరణార్థులు నీట మునిగి చనిపోయారు. వాస్తవానికి మృతుల సంఖ్య మూడింతలు ఉంటుందని అనధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. -
ప్రపంచాన్ని కదిలించిన చిత్రాలు
చిత్రం దృశ్యాన్ని బంధిస్తుంది. చిత్రం మాట్లాడుతుంది. మాటలకందని భావాలను సైతం పలికిస్తుంది. చివరికి కంటతడి కూడా పెట్టిస్తుంది. తాజాగా టర్కీ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన అయలాన్ కుర్దీ అనే మూడేళ్ల బాలుడి చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. ప్రతి ఒక్కరిని చలింపచేసింది. మనసున్న ప్రతి గుండెను కన్నీరు పెట్టించింది. స్వార్థపు మత్తుతో గాఢనిద్రలో ఉన్న మానవత్వాన్ని తట్టిలేపింది. కేవలం ఫొటోలతో ప్రపంచాన్ని కదిలించి..చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన.. ఇలాంటి మరొకొన్ని చిత్రాలను ఒక సారి పరికిస్తే... అమెరికా-వియత్నాం యుద్ధం అమెరికా, వియత్నాం యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు తార్కాణమీచిత్రం.సైన్యం ప్రయోగించిన నాపాం బాంబు దాడిలో ఒళ్లంతా కాలిన గాయాలతో బట్టలు విప్పేసి నగ్నంగా నడిరోడ్డుపై ప్రాణభయంతో పరుగెడుతున్న వియత్నాం బాలిక ఫాన్ ది కిమ్ ఫుట్ ఫొటో ఇది. ఆ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో, దాని తీవ్రత ప్రజలపై, ముఖ్యంగా పసిపిల్లలపై చూపిన ఆనాటి భయానిక పరిస్థితులు..ఈ ఒక్క చిత్రంచూస్తే అర్థమవుతుంది. అమెరికా యుద్ధోన్మోదానికి సజీవ ఉదాహరణ ఈ చిత్రం. నిక్ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోని తీశాడు. ఫొటో తీసిన తరువాత నిక్ ఆ పాప ఒంటిపై తన కోట్‌ను కప్పి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి..కిమ్ ప్రాణాలను కాపాడాడు. ఒక విధంగా అమెరికా వియత్నాం యుద్ధాన్ని విరమించడానికి ఈ చిత్రం కూడా ఒక కారణమే. వియత్నాంపై అమెరికా చేస్తున్న యుద్ధానికి అమెరికన్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ దేశం యుద్ధాన్ని విరమించింది. యుద్ధాల్లో పసిపిల్లలు ఎలా బాధితులవుతన్నారో ప్రపంచానికి చెంపచెల్లుమనేలా చాటిచెప్పిన చిత్రమిది. కాటేసినకరవు .. ఆకలితో బక్కచిక్కిన శరీరం, ఎముకల గూడుతో ఉన్న చిన్నారి.. పక్కనే చనిపోతే తినడానే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్న రాబందు. ఈ ఫొటోను చూస్తే చలించని వారు ఉండరు. సుడాన్లో ఆ నాటి కరువు పరిస్థితులు, పోషకాహారలోపానికి శిశువులు ఎలా బలయ్యారనే దానికి ఈ ఫోటో ప్రత్యక్ష ఉదాహరణ. కెవిన్ కార్టర్ అనే ఫొటోగ్రాఫర్ 1993లో ఈ ఫొటోను తీశారు. ఈ ఫొటో తీసి కార్టర్ తనమానాన తాను వెళ్లిపోయాడు. ఆ పిల్లవాడిని రక్షించే పని చేయలేదు. ఆ తరువాత ఆ రాబందు పసివాడిని తినేసిందో? లేక వదిలేసిందో? ఆ దేవుడికి తెలియాలి. ఈ ఫొటో తీసినందుకు కార్టర్‌కు పులిట్జర్ బహుమతి లభించింది. కానీ ఆ చిన్నారిని కాపాడనందుకు.. ఆ సమయంలో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాబందును నుంచి ఆ చిన్నారిని రక్షించకుండా అలాగే వదిలేసి వచ్చానన్న బాధతో.. కొన్ని నెలల తరువాత కెవిన్ కార్టర్ ఆత్మచేసుకుని చనిపోయాడు. సాహసమేరా జీవితం.. ఒక వ్యక్తి ఎంతో ధైర్యంగా యుద్ధ ట్యాంకులకు ఎదురుగా నిలబడి ఉన్న చిత్రం ఇది. చైనాలో రాజకీయ, ఆర్థిక సంస్కరణలకు పిలుపునిస్తూ 1989 లో సుమారు 10 లక్షల మంది ప్రజలు బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్ వద్ద కొన్ని వారాలపాటు నిరసన చేపట్టారు. అయితే చైనా ప్రభుత్వం ఈ నిరసనను అణచివేసేందుకు మిలటరీని ప్రయోగించింది. యుద్ధట్యాంకులు, ఫిరంగులతో నిరసనకారులను చెదరగొట్టడానికి మిలటరీ వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి వాటికి ఎదురుగా వచ్చి నిలబడి తన నిరసన తెలిపాడు. చైనా మిలటరీ అతనిని కొట్టి ఈడ్చిపారేసింది. ఆ తరవాత అతనికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. యుద్ధట్యాంకులకు ఎదురుగా నిలబడి నిరసన తెలుపుతన్న సమయంలో జెఫ్ వైడ్నర్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశాడు. చైనా ప్రభుత్వం ఈ ఫొటోను నిషేధించింది. కదిలించిన చిత్రం.... చిగురిస్తుందా మానవత్వం? ఇటీవల కాలంలో పత్రికల్లో, చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమై యూరప్ ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేసి..ప్రపంచం ముందు ఆ దేశాలను బోనెక్కించి దోషిగా నిలబెట్టిన బాలుడి చిత్రమిది. నిలోఫర్ డెమిర్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశాడు. అగ్రదేశాల స్వప్రయోజనాల మూలంగా గత నాలుగేళ్లుగా దావాగ్నిలా రగులుతున్న సిరియా నుంచి యూరప్‌కు పడవలో వలస పోతూ ప్రాణాలు పోగొట్టుకున్న మూడేళ్ల పసికందు. పేరు అయలాన్ కుర్దీ. శరణార్థుల పట్ల యూరోపియన్ దేశాలు వ్యవహరిస్తున్న దమననీతికి, సిరియా శరణార్ధుల దుర్భరస్ధితికి.. ఈ చిత్రం అద్దం పడుతోంది. యుద్ధవిమానాలు వేసే బాంబులకు, ఐఎస్ ఉగ్రవాదుల నరమేధానికి భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దొంగతనంగా, రహస్యంగా సిరియా నుంచి యూరప్ దేశాలకు వలసపోతున్న ఎందరో సామాన్య ప్రజల దయనీయ స్థితికి సజీవ తార్కాణమీచిత్రం. సిరియా అంతర్యుద్ధంలో అయలాన్ అన్న, అమ్మ కూడా చనిపోగా అతని తండ్రి మాత్రం ప్రాణాలతో మిగిలాడు. అయలాన్ కర్దీ మాదిరే సిరియా నుంచి సమీపంలోని యూరోపియన్ దేశాలకు వలసపోతూ నిత్యం అనేక మంది పౌరులు మృత్యువాత పడుతున్నారు. రాకాసి అలలు కాటేసినప్పుడు..తీరప్రాంత గస్తీదళాలు ఒడ్డుకు చేరుకుంటున్న వారిని నిర్దయగా వెనక్కి నెట్టేసినప్పుడు కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. పడవల్లో లెక్కకు మించి ఉండటం వల్ల.. ప్రయాణ మార్గంలో ఊపిరాడక మరికొందరు చనిపోతున్నారు. ఈ అడ్డంకులన్ని దాటుకుని యూరప్‌లోకి ప్రవేశిస్తే సరిహద్దుల్లో ముందుగా ముళ్ల కంచెలు స్వాగతం పలుకుతాయి. పోలీసుల వాటర్ క్యానన్లు, రబ్బరు బుల్లెట్లు వెన్నాడుతాయి. వీటిని దాటుకుని ఏదైనా గ్రామంలోకి ప్రవేశిస్తే జాత్యహంకార దూషణలు, దాడులు.. ఈ క్రమంలో ఒక కుటుంబంగా వచ్చిన వారు చెల్లా చెదురై చెట్టుకొకరు..పుట్టుకొకరుగా ఒంటరిగా మిగిలి..చావలేక బతకలేక అత్యంత దుర్భరమైన, దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో ఇప్పటివరకు 2,600 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి. సిరియా, నైజీరియా, గాంబియా వంటి దేశాల నుంచి ఇంతవరకూ 3,50,000 మంది యూరప్‌లోకి ప్రవేశించారని సమాచారం. సిరియాలోని కొబాని పట్టణాన్ని ఐఎస్ తీవ్రవాదులు ధ్వంసం చేస్తే... తన పిల్లలకు భయంలేని సురక్షిత జీవితాన్ని, మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఏకైక కోరికతో... పుట్టిన గడ్డని వదిలి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, అత్యంత ధైర్యంతో, సాహసంతో ... కుటుంబంతో వందల కిలోమీటర్లు పడవలో ప్రయాణించి... గమ్యం చేరకుండానే తన పిల్లలను పొగొట్టుకున్న ఆ తండ్రి బాధ వర్ణాతీతం... పసిమనసులపై ఉగ్రపంజా.. చూడగానే ముద్దొచ్చే ఈ పాలబుగ్గల చిన్నారి ఫొటో కూడా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా హల్చల్ చేసింది. సిరియా శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న చిన్నారిని ఓ ఫొటోగ్రాఫర్ ఫొటో తీస్తుండగా..కెమెరాను తుపాకీగా భావించిన ఆ బాలిక..భయంతో చేతులు పెకైత్తి నిలబడి పోయింది. ఈ దృశ్యాన్ని చూసిన వారికి ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. నిత్యం బాంబులు, తుపాకీలు మధ్య లక్షలాది మంది చిన్నారులు ఈ నరకకూపంలో బతుకు వెళ్లదీస్తున్నారు. పసి మనసుపై ఉగ్రవాదం వేసిన ముద్రకు ఈ ఫొటో సజీవ తార్కాణం. బోపాల్ గ్యాస్ ఉదంతం అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనల్లో బోపాల్ గ్యాస్ ఉదంతం ఒకటి. 1984లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీకవటం వల్ల సుమారు 15,000 మంది ప్రజలు చనిపోయారు. 5 లక్షల మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన తన కొడుకుని ఓ తండ్రి పూడ్చిపెడుతున్నటప్పుడు తీసిన చిత్రమిది. ఆ దుర్ఘటన తీవ్రతను తెలిపే సజీవ తార్కారణం ఈ ఫొటో. కంపించిన అమెరికా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానంతో ఢీకొడుతున్నప్పుడు తీసిన చిత్రమిది. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి...చిచ్చుపెట్టి తన స్వప్రయోజనాలు నెరవేర్చుకునే అమెరికాకు అల్‌ఖైదా తీవ్రవాదులు 2001, సెప్టెంబర్ 11న ఈ దాడితో ముచ్చెమలు పట్టించారు. భయకంపితుల్ని చేశారు. ఉగ్రవాదులు పక్కా వ్యూహంతో అమెరికాకు చెందిన విమానాలను హైజాక్ చేసి.. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లపై దాడులు చేశారు. ఈ దుర్ఘటనలో 2,752 మంది ప్రజలు మరణించారు. -
కుర్దీకి వివిధ ప్రాంతాల్లో ఘననివాళి
-
'అది చెప్పలేను.. గుండె చివుక్కుమంది'
టర్కీ: 'విధుల్లో భాగంగా మధ్యదరా సముద్ర తీరానికి వెళ్లిన నాకు అలలు ఎగిసిపడుతుండగా ఇసుకలో ఓ మూడేళ్ల బాలుడు కదలకుండా పడిఉండి కనిపించాడు. సముద్రంవైపే ముఖం పెట్టి ఉండగా అతడిని అప్పుడప్పుడు అలలు తాకి వెళుతున్నాయి. ఆ బాలుడిలో మాత్రం చలనం లేదు. నేను ఆ బాలుడిని సమీపిస్తున్నాను. మనసులో గట్టిగా ప్రార్థించాను. భగవంతుడా ఆ బాలుడు ప్రాణాలతో ఉండాలని.. కానీ అలా జరగలేదు. అతడు ప్రాణాలతో లేడని అర్థమై గుండె చివుక్కుమంది' 'లోపలే ఏడ్చేశాను. మనసులో ఎంత ఇబ్బందిపడ్డానో నాకే తెలియదు. నా సొంత కొడుకే అన్నంత భావన కలిగింది' అని ఇటీవల సిరియా నుంచి ప్రాణభయంతో మధ్యదరా సముద్రం గుండా వచ్చి ప్రాణాలు కోల్పోయిన మూడేళ్ల బాలుడు అయలాన్ కుర్దీ గురించి అతడిని చేతుల్లోకి మొట్టమొదటిసారి తీసుకున్న మెమెట్ క్లిపాక్ అనే పోలీసు చెప్పాడు. తనకు ఆరేళ్ల బాలుడు ఉన్నాడని, అయలాన్ మొదటి చూసినప్పుడు నా స్థానంలో తన తండ్రి ఉంటే ఎంతటి భావోద్వేగానికి లోనవుతాడో అంతగా తాను అయ్యానని ఆ క్షణం మాటల్లో వర్ణించలేనని తెలిపాడు. -
అయలాన్ లాంటి ఇంకెందరో..
దే ఆర్ టూ యంగ్ టు వోట్.. బట్ టూ ఓల్డ్ టు డై.. ( ఇంకా ఓటు హక్కు కూడా రాని ప్రాయం కాని చనిపోయే వయసు వచ్చేసింది) వియత్నాం : ఫాన్ థి కిమ్ పుచ్, 1972 గాజాస్ట్రిప్ : ముహమ్మద్ అల్ దుర్రా, 2000 టర్కీ : అయలాన్ కుర్దీ, 2015 ప్రపంచవ్యాప్తంగా జరిగిన జరుగుతున్న యుద్ధాల్లో, అంతర్యుద్ధాల్లో తమ ప్రమేయం లేకుండా బలైన, బలౌతున్నపసికూనలకు ప్రతినిధులు. సంఖ్య వేలల్లో, లక్షల్లో ఉండొచ్చు.. ఉంటుంది కూడా.. వీళ్లు కరుడు కట్టిన నేరస్తులు కాదు.. అవకాశాలుంటే అందరూ పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ స్కూళ్లకి వెళుతూ, అమ్మ ఒడిలో సేదతీరుతూ, నాన్న భుజాలపై ఆడుకుంటూ సరదాగా గడిపేయాలనుకునే చిరుకోరిక ఉన్నావారే.. శైశవ గీతాలు పాడుకోవాల్సిన వయసులో శవాలుగా మారుతుంటే.. మనసున్న ప్రతి గుండె కన్నీరు పెడుతుంటే.. సభ్యసమాజం సిగ్గుతో బాధతో తలదించుకుంటే కారణాలు, పరిష్కారాలు వెతకాల్సిన సమయంలో.. ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పించుకొని ఇలాంటి పరిస్థితుల్లో కొలాటరల్ డామేజీగానే పరిగణిస్తే, పసికూనలు శవాల గుట్టలుగా పడితే ఇంతకన్నా 'హ్యుమనిటేరియన్ క్రైసిస్' ఏముంటుంది. 1972, 2000, 2015.. తేడా ఏమీ లేదు... అప్పడూ, ఇప్పుడూ, ఎప్పుడూ పసికూనలే సమిధలు.. ఈ మూడు ఘటనలు కెమరా కంటికి యాదృచ్ఛికంగా చిక్కాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. కెమెరా కంటికి చిక్కని ఇలాంటి సంఘటనలు వేనవేలు. నాపాం బాంబు దాడిలో ఒళ్లంతా కాలిన గాయాలతో బట్టలు విప్పేసి నగ్నంగా నడిరోడ్డు పై ప్రాణభయంతో పరుగెడుతున్న వియత్నాం బాలిక ఫాన్ ది కిమ్ ఫుట్ ఫోటో ఇప్పటికీ యుద్ధోన్మాదుల భయంకర క్రీనీడని గుర్తుకు తెస్తుంది. ఒకరకంగా అమెరికా వియత్నాం యుద్ధాన్ని విరమించి తోకముడవటానికి నిక్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఈ సజీవ చిత్రం ప్రధాన కారణం. అంతర్జాతీయంగా గగ్గోలు, సభ్యసమాజం విమర్శలు, తొమ్మిది సంవత్సరాల కిమ్ ను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆపన్న హస్తాలు. అదృష్టవశాత్తు కిమ్ బతికి బట్టకట్టింది. ఇప్పుడ కెనాడాలో ఉంటోంది. యుద్ధాల్లో పసికూనలు ఎలా బాధితులవుతున్నారో ప్రపంచానికి చెంపదెబ్బ కొట్టి మరీ చెప్పింది కిమ్ ఫోటో.. కిమ్ లాంటి ఆ చిన్నపాటి అదృష్టానికి కూడా నోచుకోలేదు ముహమ్మద్ అల్ దుర్రా.. అతడు చేసిన నేరం ఏమీ లేదు. అయినా 12 సంవత్సరాల పసికూన ఏ నేరం చేయగలడు. తండ్రి జమాల్ తో కలిసి గాజాస్ట్రిప్ లో నడుచుకుంటూ వెళ్లడం, యాదృచ్ఛికంగా ఫ్రెంచ్ టెలివిజన్ ఒకటి ఆ సమయంలో అక్కడ ఉండటం ముహమ్మద్ ఎలా చనిపోయాడో ప్రపంచానికి తెలిసేట్టు నివ్వెరపోయేట్టు చేసింది సెప్టెంబర్ 2000లో జరిగిన ఈ సంఘటన. కాల్చొద్దు అంటూ బతిమాలుతున్న జమాల్, ప్రాణభయంతో కొడుకును పొదుముకొని బుల్లెట్లు తగలకుండా దాక్కునే ప్రయత్నం.. వెంట వెంటనే నేరుగా కాల్పులు, గాయపడిన తండ్రి ఒడిలో నిర్జీవంగా ఉన్న ముహమ్మద్.. ఇక్కడ చర్చ పాలస్తీనా, ఇజ్రాయిల్ గొడవ కాదు. 12 సంవత్సరాల ముహమ్మద్ ఏం నేరం చేశాడని. ఈ ఉదంతం మరో ఐదు సంవత్సరాల పాటు పాలస్తీనా, ఇజ్రాయిల్ ల మధ్య తీవ్ర యుద్ధానికి, ప్రాణ నష్టానికి దారి తీసింది. 2015 సెప్టెంబర్ : టర్కీ సముద్ర తీరంలో మూడంటే మూడు సంవత్సరాల అయలన్ కుర్దీ శవం.. ఇసుకలో బోర్లాపడి.. ఎర్రటి చొక్కా, బ్లూకలర్ నిక్కర్, షూ.. అమాయకమైన మొహం.. ఎంత దారుణం. సిరియాలోని కొబాని పట్టాణాన్ని ఐఎస్ఐఎస్ మూకలు ధ్వంసం చేసిన తర్వాత ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని... అక్కడినుండి వందల కిలోమీటర్లు టర్కీ గుండా ప్రయాణం.. గ్రీస్ లోని ఒక దీవికి చేరుకొని అక్కడి నుండి ఎలాగో అలాగా కెనడా చేరుకోవాలని, పిల్లలకి భయం లేని జీవితాన్ని ఇవ్వాలని అయలన్ తండ్రి ఆరాటం.. మూడు సంవత్సరాల అయలన్ కు తెలిసినవి రెండే రెండు. ఒకటి భయం. రెండు పరుగు.. టర్కీ గ్రీస్ మధ్య సముద్రంలో ఆ పరుగు ఆగిపోయింది. కాని శరణార్ధుల జీవితాల్ని, యూరప్ దేశాల మొండి వైఖరిని ప్రపంచానికి అయలాన్ మరొకసారి చాటి చెప్పాడు..తన చావుతో... ఈ మూడు సంఘటనలు దాదాపు 50 సంవత్సరాల వ్యవధిలో జరిగాయి. ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిపోయిందట.. కానీ పసికూనల సామ్రాజ్యం కుంచించుకుపోయింది.. యుద్ధాల్లో, అంతర్యుద్ధాల్లో పిట్టల్లా రాలిపోతున్నారు. కొన్ని ఆఫ్రికా, ఆసియా దేశాలలో మొన్నమొన్నటి వరకు పక్కన ఉన్న శ్రీలంకలో 10,12 సంవత్సరాల పిల్లలు ఏకే 47లు పట్టుకొని, ఇతరులను చంపి, తాము చస్తున్న ఘటనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. పసికూనలు ఆత్మాహుతి దళ సభ్యులవుతున్నారు. వీరి చావులకు లెక్కే లేదు.. లెక్కలు లేవు. ఎక్కడో ఎందుకు.. మన దగ్గరే. వామపక్ష తీవ్రవాదం బలంగా ఉన్న రోజుల్లో ఓటు హక్కు వయసు కూడా లేని ఎంతో మంది నక్సలైట్లు ఎన్‌కౌంటరయ్యారు. ఎగురుకుంటూ వచ్చే నోట్ల కట్టలకు ఎర్రతివాచీలు స్వాగతం పలికే 'గ్లోబల్ విలేజ్' లో కంప్యూటర్లే మాట్లాడుకుంటాయి. ' సాఫ్ట్వేర్', హార్డ్‌వేర్ భాషలో.. అరచేతిలో ప్రాణలు పెట్టుకొని బతకాలనే ఆశతో పరుగులు పెట్టే అయలాన్ లాంటి వారికి తుపాకులు అడ్డం పడతాయి.. ముళ్ల కంచెలు శరీరాన్ని చీరేస్తాయి. బారికేడ్లు బంధిస్తాయి.. వేటకుక్కలు తరిమేస్తాయి.. సముద్రమైనా కాపాడుతుందనుకుంటే మింగేసిన కడలి అలలతో ఒడ్డుకు నెట్టేస్తుంది. అలా ఒడ్డున దీనంగా దిక్కులేని శవంగా అయలాన్ అలాంటి ఇంకెందరో..' హ్యుమానిటీ' లేనపుడు ఇక హ్యుమనిటేరియన్ క్రైసిస్ కి అర్ధమెక్కడుంది. ఎస్.గోపినాథ్ రెడ్డి -
మానవత్వం ఓడిన వేళ...
మానవత్వం ఓడిన తీరును కళ్లకు కట్టి ప్రపంచాన్ని కంటతడి పెట్టించిన చిన్నారి అయలాన్ కుర్దీ అంత్యక్రియలు శుక్రవారం సిరియాలోని కోబాన్ పట్టణంలో పూర్తయ్యాయి. టర్కీ నుంచి సిరియా సరిహద్దుల వరకు ప్రత్యేక విమానంలో రేహన్, ఇద్దరు పిల్లల మృతదేహాలను తరలించారు. జర్నలిస్టులు, టర్కీ ఎంపీలు వెంటరాగా... తండ్రి అబ్దుల్లా సొంతపట్టణానికి చేరుకొని బంధు, మిత్రుల సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దామనే మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేశానని... ఇప్పుడు నాకంటూ ఏమీ మిగల్లేదు గనక ఇక ఎక్కడికీ పోనని అబ్దుల్లా రోదిస్తూ చెప్పారు. 'ప్రపంచ దేశాలన్నింటినీ తనకిచ్చినా (ఎక్కడైనా నివసించే అవకాశం కల్పించినా) నాకేమీ వద్దు. అత్యంత విలువైనదే కోల్పోయాను' అంటూ గద్గదస్వరంతో అన్నారు. టర్కీ తీరంలో అయలాన్ మృతదేహం యూరోప్ దేశాధినేతలను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజానీకంలో సానుభూతి వెల్లువెత్తింది. ఏళ్లుగా నలుగుతున్న సిరియా శరణార్థుల సమస్యను ప్రపంచం దృష్టికి తెచ్చింది. 2 లక్షల మందికి నీడ ఇవ్వండి బ్రస్సెల్స్: యూరప్‌కు వస్తున్న వలసదారులు ప్రమాదాల్లో చనిపోతున్న నేపథ్యంలో 2 లక్షల మంది శరణార్థులకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలన్నీ కలసి ఆశ్రయమివ్వాలని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ అంటోనియో గటై పిలుపునిచ్చారు. అయలాన్ మృతదేహం దొరికిన తీరు ప్రపంచ ప్రజల్ని కలచి వేసిన తరుణంలో స్పందించకుండా ఉండకూడదన్నారు. కాగా, శరణార్థులకు ఆశ్రయమివ్వడానికి జర్మనీ, ఫ్రాన్స్ అంగీకరించాయి. గ్రీస్, ఇటలీ, హంగరీ దేశాలపై శరణార్థుల భారం తగ్గించేందుకు 1.2 లక్షల మందికి పునరావాసం కోసం ఒక ప్రణాళికను వచ్చేవారంలో ఈయూ విడుదల చేయనుంది. అధిక సంఖ్యలో శరణార్థులకు ఆశ్రయమిస్తామని బ్రిటన్ తెలిపింది. -
ఆకలి లేదు.. ఏడుపు లేదు.. ప్రాణాలూ!
మూడంటే మూడే సంవత్సరాల వయసు. తల్లి ఒడిలోనో, తండ్రి భుజం పైనో హాయిగా సేద తీరే పసిప్రాయం. ఆకలేస్తే ఏడవడం, సంతోషమొస్తే ఎగిరి గంతేయడం మాత్రమే తెలిసిన వయస్సు. కానీ ఇప్పుడు ఆకలి లేదు, ఏడుపూ లేదు, ఎందుకంటే ప్రాణాలు కూడా లేవు. ఇప్పుడీ ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటన టర్కీలోనిది. చనిపోయింది సిరియా చిన్నారి. ఓ వైపు ఉగ్రదాడులు, మరో వైపు సైన్యం ప్రతిదాడులతో ప్రాణాలు చేతబట్టుకుని అనేక మంది టర్కీకి వలస వస్తున్నారు. సముద్ర మార్గంలో దొంగచాటుగా చేస్తున్న ఈ ప్రయాణం వారి ప్రాణాలకు ముప్పు తెస్తోంది. సిరియా నుంచి గ్రీస్‌కు వెళ్తున్న రెండు పడవలు మునిగిపోగా, 12 మంది చనిపోయారు. అందులోంచి కొట్టుకువచ్చిందే ఈ చిన్నారి మృతదేహం. సిరియన్ల దుస్థితికి అద్దం పట్టే ఈ దృశ్యంలో పిల్లాడి పేరు అయిలన్ కుర్దీ. - రంజన్, సాక్షి టీవీ