
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న ఏంజెలినా జోలీ
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి కాందిశీకుల హైకమిషనర్ ప్రత్యేక రాయబారి, హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ భద్రతా మండలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో శుక్రవారం భద్రతా మండలిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సిరియా సంక్షోభాన్ని పరిష్కరించే శక్తిసామర్థ్యాలు భద్రతా మండలికి ఉన్నప్పటికీ, వాటిని వాడుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలికి ఐక్యత, రాజకీయ సంకల్పం కొరవడిందని ఆమె మండిపడ్డారు.
అయిదు సంవత్సరాలుగా సిరియాలో జరుగుతున్న సంఘర్షణలు, సంక్షోభం కారణంగా రెండు లక్షల 20వేల మంది చనిపోయారు. పది లక్షల మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. 76 లక్షల మంది వారు నివసించే ప్రదేశాల నుంచి వెళ్లిపోయారు. దాదాపు 40 లక్షల మంది పొరుగుదేశాలకు వెళితే అక్కడ తిరస్కరించబడ్డారు. ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించాలన్న సంకల్పం లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులలో సిరియా సంక్షోభం సమసిపోయే దిశగా భద్రతా మండలి పనిచేయాలని శరణార్ధుల తరపున ఆమె మండలికి విజ్ఞప్తి చేశారు.
మండలి తన అధికారాలను వినియోగించి సిరియాలో సంఘర్షణలకు చరమగీతం పాడి సిరియన్లకు న్యాయం చేయాలని ఆమె కోరారు. మండలిలోని దేశాల విదేశాంగ మంత్రులు అందరూ కలసి ఈ సమస్యకు ఒక రాజకీయ పరిష్కారం కనుగొనాలని ఏంజెలినా జోలీ విజ్ఞప్తి చేశారు.