
బాలికను దత్తత తీసుకోనున్న ఏంజెలినా జోలి
న్యూయార్క్ : ముగ్గురు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలతోపాటు మూడు జాతులకు చెందిన ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని కన్నబిడ్డల్లా పెంచుకుంటున్న హాలీవుడ్ అందాల తార ఏంజెలినా జోలి మరో అనాథ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించింది. ఈసారి అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియాకు చెందిన అనాథ బాలికను దత్తత తీసుకోవాలని నిర్ణయించినట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
ఐక్యరాజ్య సమితి శరణార్థుల అంబాసిడర్గా వ్యవహరిస్తున్న జోలీ ఇటీవల పలు దేశాల్లోని సిరియా శరణార్థుల శిబిరాలను సందర్శించారు. అక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు అనాథ బాలల పరిస్థితిని చూసి కదిలిపోయారు. ఆ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయానికొచ్చి భర్త బ్రాడ్ పిట్కు తన నిర్ణయాన్ని తెలియజేశారట. అయితే ఇప్పటికే ఆరుగురు పిల్లలున్నారని, మరో ముగ్గురు చేరితే తొమ్మిదిమందవుతారని, అంతమందిని చూసుకోవడం కష్టమని, పైగా కొత్త పిల్లలతో సర్దుబాటవటం కూడా కష్టమేనని బ్రాడ్ వాదించారని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ రేడార్ డాట్ కామ్ వెల్లడించింది. చివరకు సిరియాకు చెందిన ఓ అనాథ ఆడపిల్లను దత్తత తీసుకోవాలని భార్యాభర్తలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ వెబ్సైట్ తెలిపింది.
సిరియాలో అంతర్యుద్ధం కారణంగా 70 వేల మంది పిల్లలు తండ్రులను కోల్పోగా, 3,700ల మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ ఏడాదిలోనే ఓ అనాథ సిరియా బాలికను ఏంజెలినా జోలి దత్తత తీసుకునే అవకాశం ఉందని సన్నిహితవర్గాలు చెప్పాయి. భౌతికంగా పిల్లలను కనే అవకాశం జోలికి లేదనే విషయం తెలిసిందే. వంశపారంపర్యంగా తమ కుటుంబంలో వస్తున్న కేన్సర్ ను నివారించడంలో భాగంగా ఆమె అండాశయాన్ని, బ్రెస్ట్ను తొలగించుకున్నారు.