
రక్తం పంచుకున్న నా కూతురుతో మాట్లాడాలి ప్లీజ్!
లండన్: ‘దయచేసి నా రక్తం పంచుకొని పుట్టిన నా కూతురుతో మాట్లాడే అవకాశం కల్పించండి. నా పాపకు తల్లిగా నేనేం చేయలేక పోయాను. ఏంజెలినా జోలీనే ఓ తల్లి చేయాల్సినవన్నీ చేశారు. నా కంటే తల్లిగా ఉండే అర్హత ఆమెకే ఎక్కువగా ఉంది. అయినంత మాత్రాన నేను తల్లి కాకుండా పోతానా? నేను నా కూతురుని వెనక్కి ఇచ్చేయమని కోరడం లేదు. ఆమెతో మాట్లాడే అవకాశం కల్పించాలని మాత్రమే కోరుతున్నాను. ఆమె జీవితంలో నేను కొంత భాగస్వామిని కావాలని కోరుకుంటున్నాను’ ఇది ఈజిప్టుకు చెందిన 31 ఏళ్ల మెంటేవాబ్ డావిట్ లెబిసో అనే ఓ తల్లి ఆవేదన.
శిశు ప్రాయంలోనే కన్న బిడ్డను ప్రముఖ హాలివుడ్ నటి ఏంజెలీనా జోలీకి దత్తతిచ్చి ఇప్పుడు ఆమెను వేడుకుంటున్న వైనం. ఆమె కూతురు జహారాకు ఇప్పుడు 12 ఏళ్లు. అత్యంత దుర్భర, నిస్సహాయ పరిస్థితుల్లో లెబిసో రేప్‌కు గురై తల్లయింది. అనారోగ్య పరిస్థితుల్లో పెళ్లి కాకుండానే పుట్టిన బిడ్డను దత్తత ఇచ్చేందుకు సిద్ధపడింది. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల కమిషన్‌ను అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఏంజెలినా జోలీ ఆ బిడ్డను దత్తత తీసుకున్నారు. తన కూతురు ఎలా ఉన్నది, ఎక్కడున్నదో జోలీ ఇంతవరకు తనకు తెలియజేయలేదని, బిడ్డను దత్తత తీసుకున్న నాటి నుంచి ఇంతవరకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదని లెబిసో తెలిపారు. భర్త బ్రాడ్‌పిట్ నుంచి జోలి విడాకులు తీసుకుంటున్నట్లు విన్నానని, ఈ సందర్భంగా తన కూతురు సంరక్షణ బాధ్యతలను జోలియే తీసుకోవాలని ఓ తల్లిగా కోరుతున్నానని ఆమె అన్నారు.
‘నేను నా కూతురును ఎంతో కోల్పోతున్నాను. ప్రతి రోజు కూతురు గురించే ఆలోచిస్తుంటాను. ఆమెను చూడాలని, మాట్లాడాలని తపించిపోతున్నాను. కూతురు పుట్టిన రోజు వేడుకను ఆమె సమక్షంలోనే చేసుకోవాలని ఆరాటపడతాను. నా కూతురుతో మాట్లాడే అవకాశం ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ఏంజెలినా అంతగా ప్రేమించే రక్తం పంచిన తల్లి కూడా నా బిడ్డకు ఉందని ఆమె తెలియజేయాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు అమెరికాలో ఉండే నా సోదరుడి ద్వారా పాప యోగక్షేమాలను కనుక్కుంటున్నాను’ అని లెబిసో తనను కలసిన మీడియాతో వ్యాఖ్యానించారు.
ఆమె సెంట్రల్ ఇథియోపియాలోని ఓ చిన్న పట్టణంలోని ఓ చిన్న సొంతిట్లో ఉంటున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఓ ఆగంతకుడు వచ్చి ఆమెను రేప్ చేశాడట. అవమాన భారంతో ఆ విషయాన్ని ఎవరికి చెప్పకపోవడంతో గర్భవతి అయ్యారట. అందువల్ల బంధువులందరు అమెను వదిలేశారట. 2005లో ఆరు నెలల పాపగా ఉన్నప్పుడు జోలీకి తన పాపను దత్తత ఇచ్చానని ఆమె చెప్పారు.
‘నేను ఎప్పటికీ ఇవ్వలేని జీవితాన్ని నేడు నా బిడ్డ పొందుతోంది. కానీ ఆమెతోని ఏదో రకమైన సంబంధాన్ని, సంభాషణను నేను కోరుకుంటున్నాను. ఒకరోజు ముందూ వెనకాల మనమంతా చనిపోయేవాళ్లమే. చనిపోయేలోగానే నా బిడ్డను కలుసుకోవాలని, ఆమెకంటూ నిజమైన తల్లి ఉందని తెలుసుకోవాలని ఎంతో కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ‘నా బిడ్డను దత్తత ఇచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జోలి నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు. ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అందలేదు. అందుకు నాకే బాధ లేదు. ఒంటరిగా మిగిలిపోయాను. డబ్బులిస్తే మాత్రం ఏం చేసుకుంటాను’ ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు.
జహరాకు తల్లి ఉందనే విషయం యాభై కోట్ల డాలర్లకు పైగా ఆస్తి కలిగిన ఏంజెలీనా జోలీకి 2007లో తెల్సింది. అప్పటి వరకు తాను అనాథ పిల్లనే దత్తత తీసుకున్నానని జోలి భావిస్తూ వచ్చారు. 2007లో లెబిసో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిడ్డను అనాథగా చెప్పి జోలికి దత్తత ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఏంజెలీనా జోలి, భర్త బ్రాడ్‌పిట్‌తో విడాకులు తీసుకుంటున్నప్పటికీ జహారాతో సహా ఆరుగురు పిల్లలను తన సంరక్షణలోనే ఉండేలా లాయర్ల ద్వారా ఒప్పందం చేసుకున్నారు.