మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?
త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా రాబోతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికా.. రష్యాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ విషయం నేరుగా ప్రకటించకపోయినా.. దేశాధ్యక్షుల ప్రకటనలు, వాళ్ల సూచలను బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న రష్యా అధికారులు, రాజకీయ నాయకులు అందరూ తిరిగి స్వదేశానికి వచ్చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నందున వెంటనే తిరిగి వచ్చేయాలని అన్నారు. సిరియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు మరోసారి చెడిపోతున్నాయి. సిరియా విషయంలో అమెరికా మెప్పుకోసం ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని, అందుకే ఐక్యరాజ్య సమితి తీర్మానంపై వీటో చేసేందుకు తమను లాగుతోందని పుతిన్ ఆరో్పించారు. ఆ తర్వాతి నుంచి రష్యా, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలు కూడా చెడిపోయాయి.
అలెప్పోలో యుద్ధ నేరాలకు పాల్పడిన సిరియన్ బలయగాలకు సాయం చేసేందుకు రష్యా వైమానిక దాడులు జరుపుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఆరోపించడంతో.. ఆయనతో జరగాల్సిన భేటీని పుతిన్ రద్దుచేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. త్వరలోనే పెద్ద యుద్ధం సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రష్యాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లావ్ బెల్కోవ్‌స్కీ అన్నారు. ఉద్రిక్తతలు మరింత పెరిగితే అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని రష్యా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎవ్గెనీ బుజిన్‌స్కీ చెప్పారు. సిరియా గురించి జరుగుతున్న చర్చల నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించుకున్నప్పటి నుంచి అమెరికా - రష్యా సంబంధాలు చెడిపోవడం మొదలైంది. దానికి తోడు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురి కావడం, దాని వెనుక రష్యా ప్రభుత్వం ఉందని చెప్పడంతో.. పరస్పర ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి.