ఉగ్ర చెర నుంచి 22 మందికి విముక్తి
డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల చెర నుంచి 22 మంది క్రైస్తవులు విడుదలయ్యారు. సిరియాలో గత ఫిబ్రవరి 23న కిడ్నాప్నకు గురైన వీరిని విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఉగ్రవాదుల చెరు నుంచి విడుదలైన వీరు సిరియా ఉత్తరాన ఉన్న హసాఖా పట్టణానికి చేరుకుని, అక్కడ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ పట్టణానికి చెందిన మానవ హక్కుల విభాగం నుంచి ఉగ్రవాదుల ఆగడాలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.
ఉగ్రవాదుల చెరలో ఇంకా మహిళలు, చిన్నారులు సహా 187 మంది బంధీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాల్ హుర్మాజ్, తాల్ షామిరామ్, తాల్ నస్రా పట్టణాలపై ఈ ఏడాది మొదట్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. సుమారు 200 మందికి పైగా ప్రజలను ఐఎస్ ఉగ్రవాదులు బంధించినట్లు సమాచారం. ఈ దాడులు ముఖ్యంగా చర్చ్ వంటి వాటిపై జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.