ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యం
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ
♦ ఇరాక్, సిరియాల్లో పలు ప్రాంతాలు స్వాధీనం
♦ అమెరికా, పాశ్చాత్య దేశాలపై దెబ్బతీయడంపై దృష్టి
♦ ‘ఖలీఫా’ను పునరుద్ధరించడమే లక్ష్యంగా విస్తరణ
ఐఎస్‌ఐఎస్.. గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఉగ్రవాద సంస్థ ఇది. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను అనూహ్యమైన బలప్రయోగంతో తమ అధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్‌ఐఎస్... తాను ‘ఖలీఫా’ను స్థాపించానని, తమ ఖాలీఫ్ అబుబకర్ అల్-బగ్దాదీ అని ప్రకటించింది. ఖాలీఫా అంటే ‘ఇస్లాం రాజ్యం’. ఖాలీఫ్ అంటే ఆ రాజ్యానికి అధినేత, మహమ్మద్ ప్రవక్త వారసుడు. అరేబియా ప్రాంతంతో పాటు మధ్య ప్రాచ్యమంతా ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని.. యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియా వరకూ విస్తరిస్తామని, అమెరికా శ్వేతసౌధం పైనా తమ జెండా ఎగురవేస్తామని ఐఎస్‌ఐఎస్ తన ‘ప్రణాళిక’ను వెల్లడించింది. అందులో భాగంగా భారీ స్థాయిలో ఉగ్రదాడులకు తెగబడుతోంది. ఫ్రాన్స్‌లోనూ శుక్రవారం మారణహోమం సృష్టించి 128 మందిని బలి తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఐఎస్‌ఐఎస్ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా విస్తరిస్తోందనే దానిపై ప్రత్యేక కథనం..
ఎలా పుట్టింది?
ఇరాక్‌లో జమాత్ అల్-తాహిద్ వల్-జిహాద్ అనే పేరుతో 1999లో ఒక ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఆ తర్వాత 2004 సంవత్సరంలో అల్‌ఖైదాతో చేతులు కలిపి.. ‘అల్-ఖైదా ఇన్ ఇరాక్’ (ఏక్యూఐ) అని పేరు మార్చుకుంది. 2003లో ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో.. ఆ దేశంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏక్యూఐ పాలుపంచుకుంది. 2006లో ఇతర సున్నీ తీవ్రవాద సంస్థలతో కలసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా మారింది. ఆ తర్వాత కొద్ది కాలానికే.. ఇస్లామిక్ రాజ్యంఏర్పాటును ప్రకటించింది. తన పేరును ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’ (ఐఎస్‌ఐ)గా మార్చుకుంది.అబుబకర్ అల్-బాగ్ధాదీ నాయకత్వంలో ఈసంస్థ గణనీయంగా పెరిగింది.
సిరియా అంతర్యుద్ధంలో ప్రవేశించి.. ఆ దేశంలోని సున్నీ మెజారిటీ ప్రాంతాల్లో గట్టి పట్టు సాధించింది.2013 ఏప్రిల్‌లో అక్కడి అల్‌ఖైదా అనుబంధఉగ్రవాద సంస్థ జభాట్ అల్-నుస్రా ఫ్రంట్‌నువిలీనం చేసుకుని.. పేరును ‘ఇస్లామిక్ స్టేట్‌ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ - ఐఎస్‌ఐఎస్‌గా (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరా అండ్ ద లెవాంట్ -ఐఎస్‌ఐఎల్ అనీ అంటారు) మార్చుకుంది.ఇది 2014 ఫిబ్రవరి వరకూ కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సన్నిహతసంబంధాలు కలిగివుంది. కొంత కాలం ఆధిపత్య పోరు తర్వాత ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అల్‌ఖైదా అధినేతఅల్-జవహరి ప్రకటించారు.
ఐఎస్‌ఐఎస్ ‘ఖలీఫా’..
ఒకప్పుడు అరబ్ దేశాలన్నీ ‘ఖలీఫా’ పాలనలో ఉండేవి. దాదాపు వందల ఏళ్ల పాటు ఒకే ఛత్రం కింద కొనసాగాయి. కానీ పశ్చిమ దేశాల ప్రభావం, ప్రపంచ యుద్ధాల్లో దెబ్బతినడంతో... ఇప్పుడున్న రూపంలో స్వతంత్ర దేశాలుగా రూపొందాయి. అయితే.. ఇస్లాం రాజ్యాన్ని పునరుద్ధరించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఖలీఫాను రాజకీయ చర్యలద్వారా పునరుద్ధరించాలని ముస్లిం బ్రదర్‌హుడ్, హిజ్బ్ ఉట్-తాహ్రిర్ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. శతాబ్దాల పాటు కొనసాగిన తమ ‘ఖలీఫా’ విచ్ఛిన్నం కావడానికి కారణం పశ్చిమ దేశాలేనన్న ఆలోచన ఇస్లాం ప్రపంచంలో బలంగా నాటుకుపోయింది.
ఆ తర్వాత కూడా పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్ ఏర్పాటు, అఫ్గానిస్థాన్ ఆక్రమణ, ఇరాక్ ఆక్రమణ వంటి అనేక పరిణామాలు.. ముస్లిం ప్రపంచంలో పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతను పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బలప్రయోగం ద్వారా ఖాలీఫాను పునరుద్ధరించాలని, పశ్చిమ దేశాలను దెబ్బ తీయాలనే లక్ష్యంతో అల్‌ఖైదా వంటివి పుట్టుకొచ్చాయి.అనూహ్యంగా తెరపైకి వచ్చిన ‘ఐఎస్‌ఐఎస్’ మాత్రం.. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి ‘ఖాలీఫా’ను స్థాపించినట్లు ప్రకటించుకుంది. 2014 జూన్ 29న తాను ప్రపంచవ్యాప్త ఖలీఫాగా ఐఎస్‌ఐఎస్ సంస్థ ప్రకటించుకుంది. తన పేరును ‘ఇస్లామిక్ స్టేట్’గా మార్చుకుంది. అయితే ఏదేశం కానీ, ప్రధాన స్రవంతి ముస్లిం సంస్థలు కానీ దీనిని ఖాలీఫాగా గుర్తించటానికి నిరాకరించాయి.
నాయకుడు ఎవరు?
ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ టైస్ట్‌గా ఉన్న అబుబకర్ అల్-బాగ్దాదీ (43) అసలు పేరు ఇబ్రహీం ఇబిన్ అవ్వాద్ అల్-బాద్రి అల్-సమర్రాయి. 1971లో ఇరాక్‌లోని సమర్రా నగరంలో పుట్టాడు. స్వతహాగా బిడియస్తుడని పేర్కొంటారు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ నుంచి ఇస్లామిక్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశాడు. ఇతడు నేరుగా మహమ్మద్ ప్రవక్త వారసుడని ప్రచారం. ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో తన నగరంలో ‘జైష్ హల్ అల్ సున్నా అల్-జమా’ అనే ఒక చిన్న సున్నీ తిరుగుబాటు సంస్థను నెలకొల్పాడు. కొన్ని నెలలకే 2004 ఫిబ్రవరిలో ఫలుజాలో ఇతడిని అమెరికా బలగాలు నిర్బంధంలోకి తీసుకుని.. బాగ్దాద్ శివార్లలో ‘క్యాంప్ బుక్కా’ జైలుకు తరలించాయి. అదే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేశాయి. అనంతరం 2006లో బాగ్దాదీ సంస్థ, మరికొన్ని సున్నీ తిరుగుబాటు సంస్థలు కలిసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా ఏర్పడ్డాయి. అది ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’గా పేరు మార్చుకున్నపుడు అందులో బాగ్దాదీ హోదా పెరిగింది. 2010 మే నాటికి ఆ సంస్థ అధినేత అయ్యాడు.
బగ్దాదీ ఉన్నట్లా.. లేనట్లా?
బగ్దాదీ గాయపడ్డాడని, మరణించాడని పలుమార్లు వార్తలు వెలువడ్డాయి... అయితే అతని మృతి చెందాడని గట్టిగా ధృవీకరించి ఏ దేశమూ చెప్పడం లేదు. ఈ ఏడాది మార్చి 18న సిరియా సరిహద్దుల్లోని అల్ బాజ్ జిల్లాలో.. వైమానిక దాడుల్లో బగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. తదుపరి నేతను ఎన్నుకోవడానికి ఐఎస్‌ఎస్ అగ్రనేతలు సమావేశమయ్యారని కూడా వినవచ్చింది. బగ్దాదీ పూర్తిగా కోలుకోలేదని, బగ్దాదీకి డిప్యూటీగా పనిచేసిన ఫిజిక్స్ ఉపాధ్యాయుడు అబూ అలా అల్- ఆఫ్రీ (ఇరాక్ దేశస్తుడు)ని ఐఎస్‌ఐఎస్ తాత్కాలిక నాయకుడిగా ఎన్నుకున్నారని ఏప్రిల్ 22న ఇరాక్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. బగ్దాదీ వెన్నముక దెబ్బతిందని, కదల్లేని స్థితిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి.
మే 14న బగ్దాదీ ఆడియో టేపుగా ఐఎస్‌ఐఎస్ ఒక టేపును విడుదల చేసింది. ఇందులో అతను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ స్టేట్‌కు తరలిరావాలని, తమ తరఫున పోరాడాలని పిలుపిచ్చాడు. బగ్దాదీ గాయపడ్డాడు లేదా మరణించాడనే వార్తలు నిజం కాదని ఈ ఏడాది జులై 20న న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అక్టోబరు 11న బగ్దాదీ కాన్వాయ్‌పై తాము దాడి చేశామని ఇరాక్ వాయుసేన ప్రకటించుకుంది. కానీ ధృవీకరణ జరగలేదు. మొత్తం మీద అగ్రరాజ్యం అమెరికా సహా ఏ దేశమూ బగ్దాదీ చనిపోయాడని ధృవీకరించకపోవడం గమనార్హం.
బలాన్ని చాటే యత్నం
సిరియా అధ్యక్షుడు అసాద్‌ను తొలగించాలని, అతని అసమర్థత వల్లే ఐఎస్‌ఐఎస్ విస్తరిస్తోందని అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు వాదిస్తున్నాయి. అసాద్ తప్పితే మరొకరు ఐఎస్‌ఐఎస్‌ను నిలువరించలేరని రష్యా అధ్యక్షుడు పుతిన్ వాదన. అసాద్ బలగాలకు మద్దతు తమ వైమానిక దళాలతో రష్యా ఐఎస్‌ఐఎస్‌పై వైమానిక దాడులు మొదలుపెట్టింది. మరోవైపు అమెరికా ఐఎస్‌ఐఎస్ ఆధీనంలోని చమురు బావులు, ఇతర కీలక స్థావరాలపై దాడులను ముమ్మరం చేసింది. సింజార్ ఐఎస్ ఆధీనంలో నుంచి జారిపోయింది. కుర్దు బలగాలు సింజార్‌ను వశం చేసుకున్నాయి. వీటన్నింటిని నేపథ్యంలో ఇటీవల ఐఎస్‌ఐఎస్ కాస్తా వెనకంజ వేయాల్సి వచ్చింది. బలం కూడా తగ్గినట్లు కనపడింది. ఈ నేపథ్యంలోనే పాశ్చాత్యదేశాల్లో వణుకు పుట్టించడం... తద్వారా తామింకా బలంగానే ఉన్నామని చాటడమే లక్ష్యంగా ఐఎస్‌ఐఎస్ భారీదాడికి వ్యూహరచన చేసి... పారిస్‌పై విరుచుకుపడి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
యువత ఎలా ఆకర్షితమవుతోంది..?
ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు.. అరబ్ దేశాల నుంచేకాదు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వంటి పాశ్చాత్య దేశాల నుంచీ.. భారత్ నుంచీ గణనీయమైన సంఖ్యలో యువత ప్రయాణమవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఇస్లాం రాజ్యాన్ని విస్తరించేందుకు జిహాద్ (పవిత్రయుద్ధం)లో బాధ్యతగా పాల్గొనాలని ఐఎస్‌ఐఎస్ ఇస్తున్న పిలుపు ఒకటైతే.. ఇరాక్, సిరియాల్లో తాను ఇస్లాం రాజ్యాన్ని స్థాపించానంటూ ‘సాధించిన విజయం’పై చేసుకుంటున్న ప్రచారం మరొకటి. యుక్తవయసులోఉండే ఉడుకు రక్తంతో పాటు.. పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతతో రగులుతున్న ముస్లిం యువతకు ఇదితమకు అందివచ్చిన ఒక అవకాశంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే.. ఒకసారి అందులోకి వెళ్లాక.. అక్కడి అంతులేని హింస, అరాచకత్వాలను సహించలేక.. అందులో నుంచి బయటకు రాలేక తల్లడిల్లుతున్న యువకుల ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి.
జాతుల హత్యాకాండ..
ఐఎస్‌ఐఎల్ తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ‘జాతి, మత పరమైన’ హత్యాకాండలకు, హింసకుపాల్పడుతోందని.. ఇతర జాతుల వారిని తుడిచిపెట్టే కార్యక్రమం కొనసాగిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వారందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించి.. సున్నీ ఇస్లాం, షరియా చట్టాలకు తాను ఇచ్చే భాష్యం ప్రకారం జీవించాలని ఈసంస్థ స్పష్టం చేస్తోందని.. వినని వారిపై హింసకు పాల్పడుతోందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగాషియా ముస్లింలు, స్థానికులైన అస్సీరియన్, చాల్దియన్, సిరియాక్, ఆర్మీనియన్ క్రిస్టియన్లు, యాజిదీలు, డ్రూజ్, షబాక్‌లు, మాందియాన్లను లక్ష్యంగా చేసుకుని హింసిస్తోంది.
ఖ్వినియేలో 90 మంది వరకూ, హర్దాన్‌లో 60 మంది, సింజార్‌లో 500 మందివరకూ, రమాదీ జబాల్‌లో 70 మంది, ధోలాలో50 మంది, ఖానాసోర్‌లో 100 మంది, హర్దాన్‌లో 300 మంది వరకూ, అల్-షిమాల్‌లో డజన్ల సంఖ్యలో, జదాలాలో 14 మంది, టాల్ అఫర్ జైలులో200 మంది యాజిదీలను ఐఎస్‌ఐఎస్ హత్యచేసింది. ఖోచోలో 400 మంది యాజిదీలను చంపేసివేయి మందిని అపహరించింది. బేషిర్‌లో 700మంది షియా తుర్కుమెన్లను చంపింది. మోసుల్‌లోని బాదుష్ జైలులో 670 మంది ఖైదీలను చంపింది. ఈ హత్యలన్నీ ఇరాక్‌లోని ఆయా ప్రాంతాలను ఐఎస్‌ఐల్ ఆక్రమించుకుంటున్న క్రమంలో 2014 ఆగస్టులో జరిగినవే. ఇక సిరియాలోనూ ఘ్రానీజ్, అబు హమాన్, కాష్కియే పట్టణాల్లో సున్నీ అల్‌షియాటట్ తెగకు చెందిన 700మందిని హతమార్చారు.