కలిసే చదివారు... విడివిడిగా చేరారు! | Masood and Bilal educated together in Dubai | Sakshi
Sakshi News home page

కలిసే చదివారు... విడివిడిగా చేరారు!

Published Tue, Apr 23 2019 3:01 AM | Last Updated on Tue, Apr 23 2019 3:01 AM

Masood and Bilal educated together in Dubai - Sakshi

మసూద్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ అనుమానితులుగా, ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్‌ అనుచరులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ 3 రోజులుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణకు హాజరవుతున్న మసూద్‌ తహాజ్, షిబ్లీ బిలాల్‌ క్లాస్‌మేట్స్‌ అనే విషయం వెలుగులోకి వచ్చింది. విదేశంలో పీజీ వరకు కలిసే చదువుకున్నట్లు వెల్లడైంది. అయితే ఐసిస్‌లోకి మాత్రం బాసిత్‌ వేసిన ట్రాప్‌లో వేర్వేరుగా ఇరుక్కున్నారని ఎన్‌ఐఏ అధికారులు చెప్తున్నారు.

ఈ ఇద్దరితో పాటు మరో అనుమానితుడు జీషాన్‌ను సైతం అధికారులు వరుసగా మూడో రోజైన సోమవారమూ ప్రశ్నించారు. మాదాపూర్‌లోని హైదరాబాద్‌ యూనిట్‌ కార్యాలయంలో వీరిని, బాసిత్‌ రెండో భార్య మోమిన్‌ను మహారాష్ట్రలోని వార్దాలో విచారించారు. మహారాష్ట్రకు చెందిన మసూద్, షిబ్లీ కుటుంబాలు కొన్నేళ్ల క్రితం ఒమన్‌ను వలసవెళ్లాయి. దీంతో ఇద్దరూ అక్కడి ఎంబసీ అదీనంలో నడిపే భారతీయ పాఠశాలలో చదువుకున్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఇద్దరూ క్లాస్‌మేట్స్‌. గతేడాది ఎవరికి వారుగా భారత్‌కు వచ్చి నగరంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వేర్వేరు సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు.  

బాసిత్‌ అనుచరులుగా... 
ఐసిస్‌ భావజాలానికి ఆకర్షితులైన వీరు వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాల్లో ఆ అంశాల కోసం బ్రౌజింగ్‌ చేస్తుండేవారు. ఈ క్రమంలో బాసిత్‌ నిర్వహిస్తున్న ఫేస్‌బుక్‌ పేజ్, టెలిగ్రామ్‌ చానల్‌ గ్రూప్‌ల్లో సభ్యులుగా మారారు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు బాసిత్‌కు అనుచరులయ్యారు. పాతబస్తీలో జరిగిన సమావేశంలో నేరుగా పాల్గొనే వరకు తామిద్దరం ఒకే సూత్రధారితో కలసి పని చేస్తున్నామన్నది మసూద్, షిబ్లీకి తెలియదు. మరోపక్క బాసిత్‌కు మోమిన్‌ పరిచయమైంది కూడా ఇలాంటి ఐసిస్‌ సంబంధిత సోషల్‌ మీడియా గ్రూపుల్లోనే.

మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన ఈమె ఆయా గ్రూపుల్లో చేస్తున్న చర్చలు బాసిత్‌ను ఆకర్షించాయి. దీంతో గత ఏడాది తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మోమిన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చి మలక్‌పేటలో కాపురం పెట్టాడు. విదేశాల్లో ఉన్న ఐసిస్‌ హ్యాండ్లర్లతో బాసిత్‌తో పాటు మోమిన్‌ సైతం సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉండేది. గత ఏడాది ఆగస్టులో బాసిత్‌ అరెస్టు తర్వాత ఈమె వ్యవహారం కీలకంగా మారిందని అధికారులు చెప్తున్నారు.

బిలాల్‌ తండ్రీ ఉగ్రవాద కేసు నిందితుడే...
పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో (ఎల్‌ఈటీ) సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్న షిబ్లీ బిలాల్‌ తండ్రి మహ్మద్‌ షఫీఖ్‌ ముజావర్‌ 2002లో దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడే కావడం గమనార్హం. ఈ కేసులో ముజావర్‌పై నాంపల్లి కోర్టు నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కొన్నేళ్లుగా ఒమన్‌ కేంద్రంగానే వ్యవహారాలు నడిపిన ముజావర్‌ గత ఏడాది ఫిబ్రవరిలో ఖతర్‌ పయనమయ్యాడు. ఖతర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇతడిని పట్టుకున్న ఇంటర్‌ పోల్‌ భారత్‌కు బలవంతంగా (డిపోర్టేషన్‌) పంపింది. ఢిల్లీకి చేరుకున్న ఇతడిని సీఐడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టు నేపథ్యంలోనే షిబ్లీ బిలాల్‌ సైతం హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. గత జూన్‌లో ముజావర్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement