ఉపవాసం విరమించారని ...
బీరూట్: ఆ ఇద్దరు ముస్లిం యువకులు ఆహారం తీసుకున్నారు. అది రంజాన్ వేళల్లో... ఆ విషయం ఐఎస్ సంస్థకు చెందిన ఉగ్రవాదులకు తెలిసింది. అంతే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సదురు యువకులిద్దరిని ఐఎస్ ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్తంభాలకు కట్టేసి రాత్రి వరకు అలాగే ఉంచాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా వారికి శిక్షను అమలు చేశారు.
అంతేకాకుండా ముస్లిం పవిత్ర మాసమైన రంజాన్ని వీరిద్దరు అత్రికమించారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటన బీరూట్ డైయిర్ ఈజోర్ ప్రావిన్స్లోని మాయాదీన్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మేరకు సిరియాకు చెందిన మానవహక్కుల సంఘ పర్యవేక్షకులు మంగళవారం వెల్లడించారు. ఈ ఇద్దరు ముస్లిం యువకులు 18 ఏళ్ల కంటే చిన్నవారేనని స్పష్టం చేసింది.
ముస్లిం పవిత్ర మాసం రంజాన్ గత గురువారం ప్రారంభమైంది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఆ మాసంలో ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం తీసుకోకుండా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు యువకులు రంజాన్ నియమ నిబంధనలను అత్రికమించడంతో ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. రంజాన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఐఎస్ ఈ విధంగా ముస్లింలను హెచ్చరించింది.