Islamic State group
-
ఐఎస్ అగ్రనేత బగ్దాదీ కుమారుడు హతం
బీరుట్: సిరియా ప్రభుత్వ దళాలతో పోరాడుతూ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అగ్రనేత అబు బకర్ అల్ బగ్దాదీ కుమారుడు హుథయ్ఫా అల్ బద్రీ మృతి చెందినట్లు ఐఎస్ ప్రకటించింది. ఈ మేరకు బద్రీ మరణం గురించి తమ సోషల్ మీడియా అకౌంట్లలో మంగళవారం రాత్రి వెల్లడించింది. ఓ అస్సాల్ట్ రైఫిల్‌ను పట్టుకుని ఉన్న యువకుడి ఫొటోను కూడా చూపుతూ అతడి పేరును హుథయ్ఫా అల్ బద్రీగా పేర్కొంది. సెంట్రల్ సిరియన్ ప్రావిన్స్ ఆఫ్ హోమ్స్‌లోని థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద సిరియా, రష్యా బలగాలతో పోరాడుతూ చనిపోయినట్లు తెలిపింది. అయితే ఎప్పుడు హతమయ్యాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘ఇంఘిమసీ ఆపరేషన్’లో భాగంగా బద్రీ హతమైనట్లు ఐఎస్ తెలిపింది. సంప్రదాయ ఆత్మాహుతి బాంబింగ్ మెషీన్లకు ‘ఇంఘిమసీ ఆపరేషన్’ కొంత భిన్నంగా ఉంటుంది. పాత ఆత్మాహుతి దాడుల్లో భాగంగా లక్ష్యాలను చేరుకున్న వెంటనే సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకుంటారు. ఇంఘిమసీ ఆపరేషన్‌లో మాత్రం జిహాదిస్టులు తమ వద్ద ఉన్న తుపాకీలు, గ్రెనేడ్లు పూర్తయ్యే వరకు పోరాడతారు. అవి అయిపోగానే తమను తాము పేల్చేసుకుంటారు. -
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఘాతుకం
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఓ సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతిచెందారు. ఈ ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇరాక్ పోలీసుల కథనం ప్రకారం.. నార్త్ బాగ్దాద్ ఏరియాలో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియల నిమిత్తం వందలాది మంది వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఆ ప్రాంతంలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో మొత్తం 31 మంది మృత్యువాత పడగా, మరో 65 మందికి పైగా గాయాలపాలైనట్లు తెలిపారు. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, అయితే బాధితులు ఈ ఘటనపై నోరు విప్పే పరిస్థితిలో లేరని అధికారులు చెప్పారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నార్త్ బాగ్దాద్, మోసుల్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఇరాక్ భద్రతా బలగాలు దాడులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని ఓ సిబ్బంది స్థానిక మీడియాకు తెలిపారు. -
గొడ్డలితో దాడిచేసింది మావాడే
బెర్లిన్: జర్మనీలో ఉగ్రవాదదాడికి తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఐసిస్ ఈ మేరకు ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి రైలు ట్రూచిన్జెన్ నుంచి వువర్జ్బర్గ్ వెళ్తుండగా ఓ యువకుడు కత్తి, గొడ్డలితో ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జర్మనీ భద్రత సిబ్బంది రంగంలోకి దిగి... యువకుడిని కాల్చి చంపాయి. దాడికి పాల్పడిన యువకుడిని 17 ఏళ్ల శరణార్థిగా భద్రత దళాలు గుర్తించాయి. రెండేళ్ల క్రితం జర్మనీకి వచ్చాడు. ఈ యువకుడు ఇస్లామిక్ స్టేట్ ఫైటర్ అని ఆ సంస్థ వెల్లడించింది. బాంబులు, తుపాకీలతో దాడులు చేసే ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల విభిన్న మార్గాల్లో దాడులకు పాల్పడుతున్నారు. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఇటీవల ఉగ్రవాదులు జనసమూహంపై ట్రక్ నడిపారు. ఈ దాడిలో 84 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. తాజాగా జర్మనీలో కత్తి, గొడవలితో ఉగ్రవాది దాడి చేశాడు. -
ఉపవాసం విరమించారని ...
బీరూట్: ఆ ఇద్దరు ముస్లిం యువకులు ఆహారం తీసుకున్నారు. అది రంజాన్ వేళల్లో... ఆ విషయం ఐఎస్ సంస్థకు చెందిన ఉగ్రవాదులకు తెలిసింది. అంతే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సదురు యువకులిద్దరిని ఐఎస్ ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్తంభాలకు కట్టేసి రాత్రి వరకు అలాగే ఉంచాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా వారికి శిక్షను అమలు చేశారు. అంతేకాకుండా ముస్లిం పవిత్ర మాసమైన రంజాన్ని వీరిద్దరు అత్రికమించారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటన బీరూట్ డైయిర్ ఈజోర్ ప్రావిన్స్‌లోని మాయాదీన్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మేరకు సిరియాకు చెందిన మానవహక్కుల సంఘ పర్యవేక్షకులు మంగళవారం వెల్లడించారు. ఈ ఇద్దరు ముస్లిం యువకులు 18 ఏళ్ల కంటే చిన్నవారేనని స్పష్టం చేసింది. ముస్లిం పవిత్ర మాసం రంజాన్ గత గురువారం ప్రారంభమైంది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఆ మాసంలో ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం తీసుకోకుండా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు యువకులు రంజాన్ నియమ నిబంధనలను అత్రికమించడంతో ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. రంజాన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఐఎస్ ఈ విధంగా ముస్లింలను హెచ్చరించింది. -
ఐఎస్ అధీనంలో కీలక నగరం
-
ఐఎస్ అధీనంలో కీలక నగరం
బీరట్: ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పాశవిక చర్యలకు పాల్పడుతున్న ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ గ్రూప్) మరో కీలక నగరాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. సిరియాకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆదివారం రమాదీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాగ్దాద్ కు 110 కి.మీ దూరంలో ఉన్న రమాదీ నగరంలోని అధికారిక భవనాలను ఐఎస్ ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తొలుత పాల్ మైరా ప్రాంతాన్ని ఆక్రమించిన ఐఎస్ దళాలు అనంతరం రమాదీ నగరంలోని పలు అధికారిక భవనాలను స్వాధీనం చేసుకున్నాయి. గత సంవత్సరం ఐఎస్ ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసం తరువాత ఇదే అతి పెద్ద దాడిగా అన్ బార్ ఆపరేషన్ కమాండర్ ముహున్వాద్ హైమోర్ స్పష్టం చేశారు. ఆత్మాహుతి కారు బాంబులతో నగరంలోని అధిక భాగాన్ని ఐఎస్ గ్రూపు అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. -
ఐఎస్ చంపుతావుంటోంది: ట్విట్టర్ సీఈఓ
న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) మిలిటెంట్ల ‘ట్విట్టర్’ ఖాతాలను తొలిగించినందుకుగాను తమ ఉద్యోగులను చంపేస్తామంటూ ఐఎస్ ఉగ్రవాదులనుంచి తమ ఉద్యోగులకు బెదిరింపు కాల్ప్ అందినట్టు ట్విట్టర్ సీఈఓ డిక్ కోస్టొలో వెల్లడించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఈ వారం జరిగిన వ్యానిటీ ఫెయిర్ సదస్సులో కోస్టొలో మాట్లాడుతూ, ఐఎస్ ఉగ్రవాదులకు చెందిన టిట్టర్ ఖాతాలను తొలగించడం మెుదలుపెట్టగానే, తనకు, తమ ఉద్యోగులకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకోసం, సందేశాలు పంపించేందుకు ట్విట్టర్ సైట్‌ను విస్తృతంగా వినియోగించుకోవడంతో, ఇది సంస్థ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంటూ వారి ఖాతాలను, గ్రూప్ అకౌంట్లను తొలగించింది. -
వైమానిక దాడులతో వారిని నిర్మూలించలేము!
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల గ్రూపు (ఐఎస్) అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ అని, కేవలం వైమానిక దాడులతోనే దాన్ని నిర్మూలించలేమని ఇరాన్ పేర్కొంది. ఇస్లామిక్ మిలిటెంట్ల బెడద ఎదుర్కొనడంలో మిత్రులకు తగిన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టంచేసింది. విమానాలతో బాంబుల వర్షం కురిపించినంత మాత్రాన ఇస్లామిక్ మిలిటెంట్ల నిర్మూలన సాధ్యంకాదని, అధునాతనమైన ఈ ఉగ్రవాద సంస్థ బెడద నిర్మూలనకు కొత్త సాధనాలు అవసరమని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మిత్రులకు తగిన మద్దతు ఇచ్చేందుకు ఇరాన్ ఏమాత్రం సందేహించబోదన్నారు. ’ఇది ఏ ఒక్క మతానికో, ప్రాంతానికో సంబంధించిన ముప్పు కాదు. ఇరాక్కో, సిరియాకో పరిమితమైనది కాదని' ఆయన తెలిపారు.