ఆ రెండు దేశాలకు ఒబామా హెచ్చరిక
బీరూట్: కాల్పుల విరమణపై మీ వైఖరిని ప్రపంచం గమనిస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సిరియా, రష్యాలను హెచ్చరించారు. శుక్రవారం నుంచి పాక్షిక సంధి సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సిరియాలో శాంతిని నెలకొల్పే దిశగా అడుగులు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సిరియాలో శాంతి ప్రక్రియకు 17 దేశాలు మద్దతు ఇస్తున్నాయి.
సిరియాలో శాంతి చర్చలకు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ప్రతిపక్ష పార్టీ ఆమోదం తెలిపారు. కాగా ఈ చర్చలకు ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలు దూరంగా ఉన్నాయి. శాంతి చర్చలకు మద్దతు ఇస్తున్న 17 దేశాల ప్రతినిధులు ఈ రోజు జెనీవాలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. ‘రేపు చాలా కీలకమైన రోజు’ అని ఐక్యరాజ్య సమితిలో సిరియా రాయబారి స్టఫాన్ డి మిస్టురా వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా కాల్పుల విరమణ కోసం కృషి చేస్తానన్నారు. కాగా సిరియా విషయంలో రష్యా, అమెరికాల మధ్య విభేదాలున్నాయి. రష్యా సిరియా అధ్యక్షుడిగా మద్దతుగా నిలవగా, అమెరికా సిరియాలోని ప్రతిపక్ష పార్టీకి మద్దతు తెలుపుతోంది.