అధినేతలే శరణార్థులైతే!!
దేశాధినేతలు అందునా అగ్రరాజ్యాల అధినేతలు అధికార దర్పం ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కుతగ్గరు. అడుగు తీసి అడుగు వేస్తే అంగరక్షకులు, వందిమాగధులు, అనుచరగణాల మధ్య రాచఠీవి ఒలకబోస్తుంటారు. కానీ.. అభాగ్యులు, అన్నార్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లాపాపలతో శరణార్థులై వస్తుంటే వారికి ఆశ్రయం ఇవ్వడంపై సిద్ధాంత చర్చలతో రాద్ధాంతం చేస్తుంటారు. ఈలోగా ఆ అభాగ్యులు ఎందరో మధ్యధరా సముద్రంలోనో, మధ్యవర్తుల అకృత్యాలకో బలైపోతున్నారు. ముఖ్యంగా సిరియా శరణార్థుల దైన్యం మాటలలో చెప్పలేనిది. ఆ సిరియాకు చెందిన అబ్దల్లా అల్ఒమారి అనే చిత్రకారుడు ప్రపంచ దేశాల అధినేతల మీద తన నిరసనను తన చిత్రాల ద్వారా చూపించారు.
'మీరు కూడా మనుషులే... మీరు కూడా అభాగ్యులు కాగలరు.. మీరు శరణార్థులైతే ఎలా ఉంటారో చూడండి...' అంటూ వారి చిత్రపటాలు గీశారు. అధికారం అందించే రాజలాంఛనాలలో అనునిత్యం తేలియాడే ఆ నాయకుల చిత్రాలను.. జన్మభూమిని విడనాడి సర్వస్వం కోల్పోయి చెల్లాచెదురైన కుటుంబ సభ్యుల కోసం వెదుకులాడుతూ, తలదాచుకునేందుకు కాస్త చోటు కోసం అల్లాడుతూ, ఆకలి తీర్చుకోవడానికి పిడికెడు మెతుకుల కోసం బారులు తీరే దీనుల రూపంలో గీసి చూపించాడు. ఈ చిత్రాలు సామాజిక మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్జాంగ్ ఉన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని, హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా, టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసి, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికొలస్ సర్కోజీ, ఫ్రాంకోయ్ హోలాండ్ తదితరులను శరణార్థులుగా చిత్రించారు.
ప్రస్తుతం బెల్జియంలోని బ్రసెల్స్ లో నివసిస్తున్న అబ్దల్లా 'వల్నరబిలిటీ సిరీస్' పేరుతో గీసిన ఈ చిత్రాల్లో.. ముఖ్యంగా ఒక చంటిపాపను భుజాన ఎత్తుకుని, ఆచూకీ లేని తన కుటుంబ సభ్యుల ఫొటోను చేతిలో చూపిస్తూ దీనంగా కనిపిస్తున్న ట్రంప్ చిత్రం, 'నాకు సాయం చేయండి' అని రాసిన కాగితాన్ని ప్రదర్శిస్తూ అత్యంత దీనంగా కనిపిస్తున్న పుతిన్ చిత్రం, కాగితం పడవను నెత్తిన పెట్టుకుని నీటిలో నానిపోయిన అసద్ చిత్రంతో పాటు.. అధినేతలందరూ ప్లేట్లు, గిన్నెలె చేతుల్లో పట్టుకుని తిండి కోసం వరుసలో నిల్చున్న చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్
ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసి
జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికొలస్ సర్కోజీ
ఉత్తర కొరియా పాలకుడు కిమ్జాంగ్ ఉన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
తదితరులు