శరణం గచ్ఛామి | Refugees are highly in that three Countries | Sakshi
Sakshi News home page

శరణం గచ్ఛామి

Published Sun, Jun 24 2018 2:32 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Refugees are highly in that three Countries - Sakshi

టైమ్‌ మ్యాగజైన్‌ తాజా ముఖచిత్రం చూశారా? గులాబీ రంగు చొక్కాతో ఓ అమ్మాయి గుక్కతిప్పుకోకుండా ఏడుస్తూంటే.. ఎదురుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిలబడి ఉంటాడు. ఆ చిన్నారి తల్లి ఓ శరణార్థి. బతుకీడ్చేందుకు సరిహద్దు దాటింది. అవకాశాల స్వర్గమంటున్న అమెరికాలో కాలుపెట్టి దొరికిపోయింది. ఒక్క అమెరికా మాత్రమే కాదు.. యుద్ధ వాతావరణంతో నిండిన ఏ దేశ సరిహద్దులు చూసినా ఇదే తీరు. పొట్టచేత పట్టుకుని దేశాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎందరో..! 

ఆ మూడు దేశాల్లోనే సగం మంది! 
సరిహద్దులు దాటివచ్చిన శరణార్థులకు పెద్ద మనసుతో ఆశ్రయం కల్పించిన దేశాల్లో టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా ముందు వరసలో ఉన్నాయి. భారత్‌ కూడా అత్యధికంగా శరణార్థుల్ని అక్కున చేర్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో సగం మందికిపైగా ఈ మూడు దేశాల్లోనే ఆశ్రయం పొందుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా వంటి ధనిక దేశాలు శరణార్థులపై అక్రమ వలసదారులన్న ముద్ర వేసి సరిహద్దుల్లో ఆపేస్తూ, గోడలు నిర్మిస్తామని హెచ్చరికలు చేయడం, తల్లిదండ్రుల నుంచి చిన్నారుల్ని వేరు చేయడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడటంతో నిరాశ్రయుల్ని ఆదుకునే వారే కరువయ్యారు. ఈ మూడు దేశాలు శరణార్థుల ఆశ్రయానికి ముందుకు రాకపోతే నిరాశ్రయులకు భద్రత కరువై మానవత్వమే మంట గలిసే పరిస్థితి రావడమే కాదు, వివిధ దేశాల్లో సుస్థిరత కూడా దెబ్బతినేదన్న అంచనాలు ఉన్నాయి. 

ఉన్న ఊరు పొమ్మంటోంది. తలదాచుకోవడానికి జన్మభూమిలో జానెడు జాగా కూడా లేదు. నిరంతర ఘర్షణలు, యుద్ధ వాతావరణం, ఉగ్రవాదుల దాడులు, మతపరమైన వేధింపులు, కరువు పరిస్థితులు.. కారణాలు ఏవైతేనేం పొట్టచేత పట్టుకుని స్వదేశాన్ని విడిచి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల దుర్భర పరిస్థితులు గుండెల్ని మెలిపెడుతున్నాయి. జూన్‌ 20న ప్రపంచ శరణార్థుల దినాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థుల సంస్థ(యూఎన్‌హెచ్‌సీఆర్‌), అంతర్గత నిర్వాసితుల పర్యవేక్షణా కేంద్రం సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి. ఆ నివేదిక ప్రకారం 2017లో అత్యధికంగా శరణార్థులు సొంత దేశాలు విడిచి వెళ్లారు. శరణార్థుల సంఖ్యలో 13 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 6.85 కోట్ల మంది నిర్వాసితులైతే, వారిలో 2.54 కోట్ల మంది వేరే దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం పొందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో శరణార్థుల సంఖ్య పెరిగింది గత ఏడాదే. ప్రతీ రెండు సెకన్లకి ఒకరు నిర్వాసితులుగా మారుతూ ఉండటం పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. శరణార్థుల్లో ఎక్కువ మంది సిరియా, అఫ్గానిస్తాన్, దక్షిణ సూడాన్‌ తదితర దేశాల వారేనని ఈ నివేదిక వెల్లడించింది. 

52 శాతం చిన్నారులే 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో 52 శాతం మంది చిన్నారులే. 2009లో శరణార్థుల్లో 41 శాతం మంది బాలలు ఉంటే, అదిప్పుడు 52 శాతానికి పెరిగింది. దక్షిణ సూడాన్, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో నుంచి ఎక్కువ మంది పిల్లలు శరణార్థులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. 

కారణాలివే.. 
- 2011లో సిరియాలో అధ్యక్షుడు అసద్‌కు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు అంతర్యుద్ధానికి దారి తీసింది. తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు పలకడం, రష్యా, ఇరాన్‌ అసద్‌ వైపు నిలబడటంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితుల్లో సిరియా నుంచి 56 లక్షల మంది టర్కీ, లెబనాన్, జోర్డాన్, జర్మనీలకు శరణార్థులుగా వెళ్లారు. 
- అఫ్గానిస్తాన్‌లో దీర్ఘకాలంగా నెలకొన్న యుద్ధవాతావరణం, తాలిబన్ల అరాచకాల కారణంగా ప్రపంచంలోనే శరణార్థులు ఎక్కువగా ఉన్న రెండో దేశంగా మారింది. పాకిస్తాన్, ఇరాన్‌ వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లిన వారి సంఖ్య 26 లక్షల వరకూ ఉందని అంచనా. 
-  దక్షిణ సూడాన్‌లో నెలకొన్న దుర్భర కరువు పరిస్థితులు, ఆహార కొరత, అంతర్యుద్ధం కారణంగా శరణార్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికీ దేశంలోని సగం మంది జనాభాకి కడుపు నిండే పరిస్థితి లేదు. ఆ దేశం నుంచి 14 లక్షల మంది ఉగాండా, ఇథియోపియా వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. 
- మయన్మార్‌లో రోహింగ్యాలు ఎదుర్కొన్న వివక్ష ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సైనిక, భద్రతా దళాల వేధింపులు తట్టుకోలేక రోహింగ్యాలు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌కు వెల్లువలా వచ్చారు. 2017లో మయన్మార్‌ నుంచి 12 లక్షల మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయారు. 
- 1991 నాటి అంతర్యుద్ధ ప్రభావం ఇప్పటికీ సోమాలియాను వెంటాడుతోంది. అత్యంత 
నిరుపేద దేశంగా మారింది. 2012లో అంతర్జాతీయ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినా షబాబ్‌ అనే ఉగ్రవాద సంస్థ చేసిన దాడులతో కల్లోలం ఏర్పడింది. అల్‌ కాయిదా వంటి సంస్థలు కూడా దాడులకు దిగడంతో 10 లక్షల మంది కెన్యా, ఇథియోపియా వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. 

ఏయే దేశాల నుంచి..
సిరియా, అఫ్గానిస్తాన్, దక్షిణ సూడాన్, మయన్మార్, సోమాలియా, వియత్నాం 
 
ఏయే దేశాలకు వెళుతున్నారు.. 
(శరణార్థులు ఎక్కువగా సరిహద్దు దేశాలకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారు) 
టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా, పాకిస్తాన్, లెబనాన్, ఇరాన్‌ 
 
- రోజుకి సగటున 44,500 మంది దేశం విడిచి వెళుతున్నారు. 
- ప్రతీ రెండు సెకన్లకి ఒకరు నిర్వాసితులుగా మారుతున్నారు. 
- శరణార్థుల్లో 52 శాతం మంది చిన్నారులే. 
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో సగానికి పైగా టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండాలో తలదాచుకుంటున్నారు. 
- అమెరికా శరణార్థుల్ని దరికి రానివ్వట్లేదు. గతేడాది 60 వేల మందికే ఆశ్రయమిచ్చింది. 
- భారత్‌కు శరణార్థులు వరదలా వస్తున్నారు. ఏకంగా 20 లక్షల మందికి ఆశ్రయం కల్పిం చింది. వీరిలో చైనా(ముఖ్యంగా టిబెట్‌ నుంచి), శ్రీలంక నుంచే అత్యధికులు వచ్చారు. 

పౌరసత్వం ఫర్‌ సేల్‌..! 
వివిధ దేశాల్లో అత్యంత సంపన్నులు, మల్టీ మిలియనీర్లు ఒకటికి మించి ఎక్కువ దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉండటం ఓ అత్యున్నత హోదాకు చిహ్నం. ముఖ్యంగా 21వ శతాబ్దపు ధనికస్వామ్యంలో మూడు, నాలుగు దేశాల పౌరసత్వాలున్న వారు కూడా ఉన్నారు. ఐరోపా సంఘం(ఈయూ) లోని పలు దేశాలతోపాటు దాదాపు పాతిక దేశాల్లో పౌరసత్వం పొందవచ్చు.. అయితే దానికీ ఓ రేటు ఉంది సుమా..! గ్లోబల్‌ మార్కెట్‌లో సిటిజన్‌షిప్‌ బై ఇన్వెస్ట్‌మెంట్‌(సీఐపీ) ప్రోగ్రామ్‌ అనేది ఇప్పుడు బాగా డిమాండున్న బిజినెస్‌. తక్కువలో తక్కువ రూ.68 లక్షలు(లక్ష అమెరికన్‌ డాలర్లు) మొదలుకుని 2.5 మిలియన్‌ యూరోల(సుమారు రూ.20 కోట్లు) వరకు వివిధ స్కీంల కింద ఖర్చవుతుంది. ఆయా దేశాల్లో ఆస్తుల కొనుగోలు లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు, ప్రభుత్వ బాండ్ల కొనుగోలు లేదా నేరుగా నగదు విరాళాలు ఇవ్వడం ద్వారా పౌరసత్వాన్ని, పాస్‌పోర్ట్‌ను పొందవచ్చు. కొన్ని దేశాల్లోనైతే ఒకేసారి సిటిజన్‌షిప్‌ ఇవ్వకుండా ‘గోల్డెన్‌ వీసా’పథకాల నిర్వహణ ద్వారా ఐదేళ్ల తర్వాత పౌరసత్వాన్ని ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. 

మనది భిన్నమైన పరిస్థితి.. 
భారత్‌లోని వివిధ జాతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల అప్పులు తీసుకుని, వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఐపీఎల్‌ మాజీ సారథి లలిత్‌ మోదీ, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ఈ కోవలోకే వస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు అందకుండా తప్పించుకుని తిరుగుతూ విదేశాల్లో ఆశ్రయం పొందుతున్న నీరవ్‌ మోదీ వద్ద ఆరు పాస్‌పోర్టులున్నాయి. ప్రస్తుతం డొమినికా, సెయింట్‌ లూసియా, ఆంటిగ్వా, గ్రేనెడా, సెయింట్‌ కిట్స్, మాల్టా, సైప్రస్‌లో లక్ష డాలర్ల నుంచి 2.4 మిలియన్‌ డాలర్లలోపు పెట్టుబడులు పెడితే 3, 4 నెలల్లోనే సిటిజన్‌షిప్‌ను అందజేస్తున్నాయి. రెండు దేశాల్లో పౌరసత్వాన్ని కలిగి ఉండటానికి భారత్‌లో అనుమతి లేదు కాబట్టి, దేశం వెలుపల శాశ్వతనివాసం పొందడానికి అనేక మంది సిద్ధపడుతున్నారు. మరో దేశ పౌరసత్వం కోరకుండానే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. కరీబియన్‌ దీవుల్లో ప్రభుత్వ నిధికి లక్ష డాలర్లు విరాళమిస్తే చాలు పౌరసత్వం లభిస్తుంది. అంతేకాకుండా ఈ పాస్‌పోర్టుల ద్వారా వీసాలు లేకుండానే 120 దేశాల్లో పర్యటించేందుకు వీలుంటుంది. కరెన్సీ డాలర్లలోనే ఉంటుంది కాబట్టి విదేశాల్లో వచ్చే ఆదాయంపై పన్నులేమి పడవు. 

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులతో.. 
తమ దేశ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కొన్ని నెలల్లోనే పౌరసత్వం అందిస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. సైప్రస్‌లో 20 లక్షల యూరోలు పెట్టుబడి పెడితే చాలు సిటిజన్‌ షిప్‌ వచ్చేస్తుంది. మనదేశం నుంచి 2017లో ఏడు వేల మంది శ్రీమంతులు ఇతర దేశాలకు మకాం మార్చినట్టు న్యూవరల్డ్‌ వెల్త్‌ నివేదిక ఇటీవల వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement