కుక్కలు, పిల్లులే ఆహారమౌతున్నాయ్...!
సిరియా ప్రభుత్వ సైన్యాధికారంలో ఉన్న నగరాల్లోని ప్రజలు ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నారు. వేలాదిమంది పస్తులతో మరణిస్తున్నారు. కడుపు నింపుకొనేందుకు పిల్లులు, కుక్కలను తినాల్సిన స్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు సిరియన్ల ప్రముఖ హాలీడే రిసార్ట్ గా ఉన్న మధ్య నగరం.. ఇప్పుడు బస్తర్ అల్ అసద్ ప్రభుత్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ముట్టడిలో ఉన్న ఆ ప్రాంతంలోని జనం తిండి, నీళ్ళు, నిద్రా లేక అవస్థలు పడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా మీడియా దృష్టి పెట్టడంతో సిరియన్ ప్రభుత్వం ఇప్పుడు వారికి సాయం అందించేందుకు ఆయా పట్టణాలకు అనుమతిస్తోంది.
సిరియా ప్రభుత్వ ఆమోదాన్ని తాము స్వాగతిస్తున్నామని, రాబోయే రోజుల్లో మానవతా దృక్పధంతో అక్కడి వారికి సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చెప్పారు. అయితే చలికాలం కావడంతో 'మధ్య'లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆకలి తట్టుకోలేక అక్కడివారు పిల్లులు, కుక్కలను తినేందుకు వెనుకాడటం లేదు. అందుకు ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఓ చిత్రం సాక్ష్యంగా నిలుస్తోంది. కొందరు ఆకులు తిని కడుపు నింపుకుంటున్నారు. ఆకలి తీరేందుకు చాలా కుటుంబాలు గడ్డి తిని నీరు తాగడం, లేదా సుగంధ ద్రవ్యాలు, జామ్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. నీరు నింపిన ప్లేట్ లో ఏదో పచ్చని పదార్థం కలిపి సేవిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మరో ఫోటో కూడ అక్కడి పరిస్థితిని కళ్ళకు కడుతోంది. బియ్యం కిలో 170 యూరోలు అమ్ముతుండటంతో అక్కడివారికి కొనలేని పరిస్థితి నెలకొంది.
మధ్య ప్రాంతవాసుల దారుణ పరిస్తితి వారి కళ్ళలో చూశానని రెడ్ క్రాస్ ప్రతినిధి డైబర్ ఫాకర్ అంటున్నారు. ''మహిళలు తమకు తిండిలేక.. పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆకలిని తట్టుకోలేక రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు'' అని మధ్య ప్రాంతంలోని మెడికల్ కౌన్సిల్ మేనేజర్ చెప్తున్నారు. చనిపోయేవారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉంటున్నారని ఆయన తెలిపారు. నీరసించి, చావుబతుకుల్లో ఉన్నవారిని ఆరోగ్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని ఉంటున్నారని, అయితే తమ సంస్థ మరి కొద్ది రోజుల్లో వీరికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తోందని చెప్తున్నారు.
మధ్య నగరానికి అక్టోబర్ ప్రాంతంలో సుమారు ఇరవై లారీల వైద్య, ఆహార పదార్థాలను అనుమతించారు. అప్పటినుంచి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అయితే ఇటీవలి కొన్ని వారాల్లోనే ఆహారం లేక పదిమంది, ఆహారంకోసం ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ బలగాల కాల్పుల్లో 13 మంది వరకూ చనిపోయారని బ్రిటన్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ హ్యూమన్ రైట్స్ చెప్తోంది. సిరియాలో యుద్ధం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యునైటెడ్ నేషన్స్ పేర్కొంది.