Starving
-
హృదయ విదారకం.. చికాగో రోడ్లపై దీనస్థితిలో హైదరాబాద్ మహిళ
ఉన్న ఊరు, దేశం విడిచి విదేశాల్లో సెటిల్ కావాలనే కోరిక కలిగిన వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉన్నత చదువుల కోసం, బెటర్ లైఫ్, లగ్జరీగా బతకాడనికి చాలా మంది విదేశాల బాటపడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, దుబాయ్, యూకే, సింగపూర్ అంటూ ఎంచక్కా ఎగిరిపోతున్నారు. అయితే పుట్టి పెరిగిన ప్రాంతాన్ని కాదని ముక్కు ముహం తెలియని దేశంలో జీవించడం అంత సులభం కాదు. ఏ ఆపద, కష్టం, విపత్తు ఎదురైనా అండగా నిలిచేందుకు ఎవరూ ఉండరు. తాజాగా అలాంటి ఓ దుర్భర పరిస్థితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన మహిళకు ఎదురైంది. ఎంఎస్ చదవడానికి యూఎస్ వెళ్లిన యువతి చికాగో రోడ్లపై దీనస్థీతిలో కనిపించింది. హైదరాబాద్‌కు చెందిన ‘సైదా లులు మిన్హాజ్ జైదీ’ మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లింది. అయితే ఆమె వస్తువులన్నీ ఎవరో దుండగులు దొంగిలించారు. దీంతో ప్రస్తుతం ఆమె చికాగోలోని రోడ్లపై ఆకలికి అలమటిస్తూ దయనీయ స్థితిలో తిరుగుతోంది. ఆమె పరిస్థితిని తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) పార్టీ అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టులో యువతి తన పేరు, వివరాలు తెలియజేస్తున్న వీడియో కూడా ఉంది. అయితే ఆమె బక్కచిక్కిపోయి, తినడానికి ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి వహాజ్ ఫాతిమా తీవ్రంగా విలపిస్తున్నారు. ఈ మేరకు విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు. కూతురుని తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు తమకు సాయం చేయాలని అర్థించారు. చదవండి: మొబైల్ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం Syeda Lulu Minhaj Zaidi from Hyd went to persue MS from TRINE University, Detroit was found in a very bad condition in Chicago, her mother appealed @DrSJaishankar to bring back her daughter.@HelplinePBSK @IndiainChicago @IndianEmbassyUS @sushilrTOI @meaMADAD pic.twitter.com/GIhJGaBA7a — Amjed Ullah Khan MBT (@amjedmbt) July 25, 2023 తల్లి రాసిన లేఖలో.. ‘హైదరాబాద్‌లోని మౌలాలీకి చెందిన మిన్హాజ్ జైదీ ఆగస్టు 2021లో డెట్రాయిట్‌లోని ట్రైనీ( TRINE) యూనివర్సిటీలో మాస్టర్స్ చేసేందుకు యూఎస్ వెళ్లింది. తరుచూ మాతో టచ్‌లోనే ఉంది. కానీ గత రెండు నెలలుగా తనతో సంబంధాలు తెగిపోయాయి. అయితే నా కూతురు డిప్రెషన్లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా మాకు తెలిసింది. చికాగో రోడ్లపై నిరాశ్రయురాలిగా నా కూతురు కనిపించింది. దయచేసి తక్షణమే జోక్యం చేసుకుని, నా కుమార్తెను వీలైనంత త్వరగా తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం, చికాగోలేని ఇండియన్ కాన్సులేట్‌ను కోరుతున్నాను’ అని పేర్కొంది. మహిళ విజ్ఞప్తిపై చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది. సయ్యద్ లులు మిన్హాజ్ కేసు గురించి ఇప్పుడే తెలుసుకున్నామని, దీనిపై వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపింది. కాగా మదద్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదైందని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. -
షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి!
సియోల్: దక్షిణ కొరియాలోని ఓ వ్యక్తి ఇంట్లో 1,000 శునకాలు చనిపోవడం కలకలం రేపింది. ఇతడు కుక్కలకు ఆహారం పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసి అవి చనిపోయేలా చేశాడు. తమ కుక్క తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన యజమాని ఒకరు ఓ ఇంట్లో శునకాలు చనిపోయి ఉండడం చూసి అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడ్ని గ్యాంగి ప్రావిన్స్‌లోని యంగ్‌ప్యోంగ్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. వెంటనే అతడ్ని అరెస్టు చేశారు. అయితే శునకాల మృతికి తానే కారణమని నిందితుడు అంగీకరించాడు. యజమానులు వదిలేసిన, జీవితకాలం పూర్తయిన శునకాలను సేకరించి వాటి కడుపుమాడ్చి చనిపోయేలా చేసినట్లు వివరించాడు. ఇందుకు గాను ఒక్కో శునకానికి వాటి యజమానులు తనకు రూ.623 ఇచ్చినట్లు వెల్లడించాడు. జంతు హక్కులు ఉల్లంఘించినందుకు ఇతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అధికారులు. స్థానిక చట్టాల ప్రకారం ఇతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. చదవండి: లింగ సమానత్వానికి మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్ -
సీ లయన్స్‌కు తప్పని అతిపెద్ద ముప్పు
న్యూయార్క్: కాలిఫోర్నియాలో అనూహ్యంగా భారీ సంఖ్యలో సీల్ చేపలు పెరిగిపోయాయి. ఎంతగా అంటే 1970లో వాటి సంఖ్య 50 వేలు ఉండగా.. ప్రస్తుతం అవి 3,40,000కు చేరుకున్నాయి. ఈ పెరుగుదల రేటు గతంలోని రికార్డులన్నింటిని దాటేసినా వాటి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం అయ్యో పాపం అనిపించక మానదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ జీవరాశికి ఓ ముప్పు వచ్చి పడింది. సీల్ పిల్లలు పౌష్టికాహార లోపంతో తిండిలేక ఆకలి సమస్యతో బాధపడుతున్నాయి. ఇప్పటివరకు మనుషులనే వేధిస్తున్న జంక్ ఫుడ్ సమస్య ప్రస్తుతం ఈ జీవరాశిని కూడా వెంటాడడమే ఇందుకు ఓ కారణం. వీటి తల్లులు జంక్ ఫుడ్ ను అమితంగా తీసుకోవడం వల్లే ప్రస్తుతం అవి ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నేషనల్ ఆసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ సీల్ జీవరాశిపై పరిశోధన చేయగా ఈ విషయం తెలిసింది. 2004 నుంచి 2014 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ మధ్యకాలంలో సీలు చేప పిల్లల ఆరోగ్య స్థితిని అంచనా వేశారు. ఇందులో అవి అనూహ్యంగా బరువు తగ్గిపోతున్నట్లు, పౌష్టికాహార లోపంతో బాధపడిపోతున్నట్లు గుర్తించారు. వాటిలో ఉండే కేలరీల స్థాయి కూడా పడిపోతుందని, అత్యధిక స్థాయి నుంచి అతి తక్కువ స్థాయికి వాటి పోషక విలువలు పడిపోతున్నట్లు వారు చెప్తున్నారు. సముద్రపు నీరు వేడెక్కడం కూడా అవి బలహీనంగా తయారవడానికి మరోకారణం అని వారు భావిస్తున్నారు. సముద్ర జలాల్లో జంక్ ఫుడ్‌లాంటి పదార్థాలు ఎక్కువవడం వాటిని అవి తినడం వల్ల ప్రస్తుతం ఈ జాతి పిల్లలు పెను ప్రమాదాన్ని చవిచూస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. -
కుక్కలు, పిల్లులే ఆహారమౌతున్నాయ్...!
సిరియా ప్రభుత్వ సైన్యాధికారంలో ఉన్న నగరాల్లోని ప్రజలు ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నారు. వేలాదిమంది పస్తులతో మరణిస్తున్నారు. కడుపు నింపుకొనేందుకు పిల్లులు, కుక్కలను తినాల్సిన స్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు సిరియన్ల ప్రముఖ హాలీడే రిసార్ట్ గా ఉన్న మధ్య నగరం.. ఇప్పుడు బస్తర్ అల్ అసద్ ప్రభుత్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ముట్టడిలో ఉన్న ఆ ప్రాంతంలోని జనం తిండి, నీళ్ళు, నిద్రా లేక అవస్థలు పడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా మీడియా దృష్టి పెట్టడంతో సిరియన్ ప్రభుత్వం ఇప్పుడు వారికి సాయం అందించేందుకు ఆయా పట్టణాలకు అనుమతిస్తోంది. సిరియా ప్రభుత్వ ఆమోదాన్ని తాము స్వాగతిస్తున్నామని, రాబోయే రోజుల్లో మానవతా దృక్పధంతో అక్కడి వారికి సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చెప్పారు. అయితే చలికాలం కావడంతో 'మధ్య'లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆకలి తట్టుకోలేక అక్కడివారు పిల్లులు, కుక్కలను తినేందుకు వెనుకాడటం లేదు. అందుకు ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఓ చిత్రం సాక్ష్యంగా నిలుస్తోంది. కొందరు ఆకులు తిని కడుపు నింపుకుంటున్నారు. ఆకలి తీరేందుకు చాలా కుటుంబాలు గడ్డి తిని నీరు తాగడం, లేదా సుగంధ ద్రవ్యాలు, జామ్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. నీరు నింపిన ప్లేట్ లో ఏదో పచ్చని పదార్థం కలిపి సేవిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మరో ఫోటో కూడ అక్కడి పరిస్థితిని కళ్ళకు కడుతోంది. బియ్యం కిలో 170 యూరోలు అమ్ముతుండటంతో అక్కడివారికి కొనలేని పరిస్థితి నెలకొంది. మధ్య ప్రాంతవాసుల దారుణ పరిస్తితి వారి కళ్ళలో చూశానని రెడ్ క్రాస్ ప్రతినిధి డైబర్ ఫాకర్ అంటున్నారు. ''మహిళలు తమకు తిండిలేక.. పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆకలిని తట్టుకోలేక రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు'' అని మధ్య ప్రాంతంలోని మెడికల్ కౌన్సిల్ మేనేజర్ చెప్తున్నారు. చనిపోయేవారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉంటున్నారని ఆయన తెలిపారు. నీరసించి, చావుబతుకుల్లో ఉన్నవారిని ఆరోగ్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని ఉంటున్నారని, అయితే తమ సంస్థ మరి కొద్ది రోజుల్లో వీరికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తోందని చెప్తున్నారు. మధ్య నగరానికి అక్టోబర్ ప్రాంతంలో సుమారు ఇరవై లారీల వైద్య, ఆహార పదార్థాలను అనుమతించారు. అప్పటినుంచి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అయితే ఇటీవలి కొన్ని వారాల్లోనే ఆహారం లేక పదిమంది, ఆహారంకోసం ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ బలగాల కాల్పుల్లో 13 మంది వరకూ చనిపోయారని బ్రిటన్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ హ్యూమన్ రైట్స్ చెప్తోంది. సిరియాలో యుద్ధం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యునైటెడ్ నేషన్స్ పేర్కొంది.