
మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం
15 టన్నుల సహాయక సామగ్రి చేరవేత
టెంట్లు మొదలుకుని ఔషధాల దాకా
వాయు, జలమార్గాన మరో 70 టన్నులు
రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
ఆస్పత్రిని కూడా ఎయిర్‌లిఫ్ట్ చేసిన వైనం
న్యూఢిల్లీ: భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు అంతర్జాతీయ సాయం వెల్లువెత్తుతోంది. ఈ విషయంలో తక్షణం స్పందించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక సామగ్రి తదితరాలు అందజేసేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట హుటాహుటిన రంగంలోకి దిగింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగు లు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్‌లైట్లు, జెనరేటర్ సెట్లు, అత్యవసర ఔషధాల వంటివాటితో కూడిన 15 టన్నుల సహాయక సామగ్రిని శనివారం తెల్లవారుజామున మూడింటికే సైనిక విమానాల్లో మయన్మార్‌కు పంపింది.
ఉదయం 8 గంటలకల్లా వాటిని స్థానికంగా బాధిత ప్రాంతాలకు పంపే కార్యక్రమం మొదలైపోయింది. అంతేగాక 118 మంది వైద్య తదితర సిబ్బందితో కూడిన పూర్తిస్థాయి ఫీల్డ్ ఆస్పత్రిని కూడా వాయుమార్గాన శనివారం రాత్రికల్లా మయన్మార్‌కు తరలించింది! వాళ్లంతా ఇప్పటికే మాండలే ప్రాంతంలో రంగంలోకి దిగా రు. గాయపడ్డ వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరో రెండు వాయుసేన విమానాల్లో మరింత సామగ్రిని పంపుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేగాక మరో 40 టన్నుల సామగ్రిని ఐఎన్‌ఎస్ సాత్పురా, ఐఎన్‌ఎస్ సావిత్రి నౌకల్లో యాంగూన్‌కు తరలిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
కమాండెంట్ పి.కె.తివారీ నేతృత్వంలో 80 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ అన్వేషక, విపత్తు సహాయక బృందాలు శనివారం సాయంత్రానికే బాధిత ప్రాంతాలకు చేరుకుని రంగంలోకి కూడా దిగాయని చెప్పారు. ‘‘రెస్క్యూ డాగ్స్ కూడా వెంట వెళ్లాయి. వాయు మార్గాన ఆరు అంబులెన్సులను తరలిస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. చైనా, రష్యా, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి కూడా సహాయక సామగ్రి మయన్మార్ చేరుతోంది. ఆ దేశంతో భారత్ 1,643 కి.మీ. పొడవైన సరిహద్దును పంచుకుంటుంది.
అందుకే ‘బ్రహ్మ’
‘‘బ్రహ్మ సృష్టికర్త. తీవ్ర విధ్వంసం బారిన పడ్డ మయన్మార్‌లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ జరగాలన్నది భారత్ ఆకాంక్ష. అందుకే ఈ సహాయక ఆపరేషన్‌కు బ్రహ్మ అని పేరు పెట్టాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ మీడియాకు వివరించారు. మరింత సాయం పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. గతేడాది యాగీ తుపానుతో అతలాకుతలమైనప్పుడు కూడా మయన్మార్‌కు భారత్ ఇలాగే తక్షణం ఆపన్నహస్తం అందించిందని గుర్తు చేశారు. సహాయక సామగ్రి బాధిత ప్రాంతాలకు తక్షణం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మయన్మార్ సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు.