అలెప్పో: తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న సిరియా నగరం అలెప్పోలో శనివారం ప్రభుత్వం జరిపిన వైమానిక దాడుల్లో 52 మంది పౌరులు మరణించారు. కాల్పుల విరమణ కోసం రాయబారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం ఫిరంగులు, వైమానిక దాడులు చేసి, చేయిజారిపోయిన నగరాన్ని తిరిగి తన అధీనంలోకి తీసుకోడానికి ప్రయత్నించింది.
ఈ దాడులపై అంతర్జాతీయ సమాజం మౌనం వహించిందంటూ సిరియా ప్రధాన ప్రతిపక్షం నిరసన తెలిపింది. సిరియా, రష్యాలు కలిసి అలెప్పోలో నేరానికి పాల్పడుతున్నాయంది. ప్రజలు శిథిలాల్లో చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ కేంద్రం పేర్కొంది. ఆహారం కొనడానికి ఒక అంగడి ముందు వరుసలో నిల్చున్న ఏడుగురు సామాన్యులు ఈ దాడుల్లో మరణించారు. కొన్ని వీధులు నామరూపాల్లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అలెప్పోలో శుక్రవారం నాటి దాడుల్లో 47 మంది మరణించారు.
పేలని రాకెట్లు ఇంకా వీధుల్లో అలాగే పడి ఉన్నాయి. ‘వైట్ హెల్మెట్స్’ అనే ప్రజా రక్షణ సంస్థ భవనం తీవ్రంగా ధ్వంసమైంది. మిగతా భవంతులన్నీ పూర్తిగా నేలమట్టమైపోయాయి. అలెప్పో నగరంలో రెండే అగ్ని మాపక వాహనాలున్నాయని, అవి నగరం మొత్తానికి తిరగడం కష్టంగా ఉందని ఈ కేంద్రం పేర్కొంది. విద్యుత్, ఇంధనం లేకపోవడంతో అలెప్పో అంధకారంలో చిక్కుకుపోయింది. శుక్రవారం ఉదయం వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. స్థానికులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు.
అలెప్పోపై వైమానిక దాడుల్లో 52 మంది మృతి
Published Sun, Sep 25 2016 7:25 PM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM
Advertisement