సిరియా ఉగ్రవాదులపై ఆసిస్ సమరశంఖం
సిరియా: ఆస్ట్రేలియా తొలిసారి సిరియాలోని ఉగ్రవాదులపై సమర శంఖం పూరించింది. ఆ దేశానికి చెందిన యుద్ధ విమానాలు సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై తొలిదాడి చేసింది. అయితే, నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, దాడి జరిపిన విషయాన్ని మాత్రం ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి కెవిన్ ఆండ్రూస్ స్పష్టం చేశారు. ఈ దాడుల ద్వారా దాయిష్ ఉగ్రవాదులు తరలిస్తున్న మందుగుండు సామాగ్రి వాహనాన్ని ఒక ప్రత్యేక క్షిఫణి ద్వారా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉండే తూర్పు సిరియా ప్రాతంపై ఈ దాడి జరిపనట్లు తెలిపారు.
అయితే, సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. అదే సమయంలో తమ యుద్ధ విమానాలు ఉగ్రవాదులు జరిపే ఎదురు దాడులకు ధ్వంసం కావని, ఎలాంటి అగ్ని ప్రమాదాన్ననైనా తట్టుకునేలా తమ జెట్ యుద్ధ విమానాలు ఉన్నట్లు చెప్పారు. ఉగ్రవాదులను అణిచివేసే చర్యలకోసం అంతకుముందు జరిగిన ఒప్పందంతోపాటు సిరియాకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఉత్తర బాగ్దాద్లో ఇలాంటి దాడులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.