కూతురి బాధ తట్టుకోలేకే...ట్రంప్ నిర్ణయం
లండన్: సిరియా వైమానిక స్థావరంపై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడానికి ఆయన కుమార్తె ఇవాంకా వేదన కూడా కారణమని ట్రంప్ కుమారుడు ఎరిక్ తెలిపారు. సిరియా గ్యాస్ దాడిలో గాయపడిన చిన్నారులపై మందును స్ప్రే చేస్తున్న చిత్రాలను చూసి తన తండ్రి చలించిపోయారని ఆయన చెప్పారు. గ్యాస్ దాడిలో తన గుండె పగిలిపోయిందని ఇవాంకా చెప్పినట్లు ‘టెలిగ్రాఫ్ పత్రిక’ పేర్కొంది. దాడి భయంకరంగా ఉందని, తన తండ్రి సకాలంలో చర్య తీసుకుంటాడని ఆమె చెప్పంది.
కాగా యుద్దవిమానాలు విష రసాయనాలతో వాయువ్య సిరియాపై జరిపిన దాడిలో 72మందికి పైగా అమాయకుల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. రెబెల్స్ ఆధీనంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోగల ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతున్న కుర్దిష్–అరబ్ కూటమి లక్ష్యంగా చేసుకుని గత కొద్ది రోజులుగా దాడులు ముమ్మరం చేసింది.